చల్ల చల్ల చల్లగా...

రంగులతో ఆడటం మొదలుపెట్టామంటే సమయమే తెలియదు.. అలసిపోయినా ఆడాలనిపిస్తుంది. ఆ నీళ్లకి దగ్గు, జలుబు వస్తాయని తెలిసినా లెక్కచేయం. వీటి గురించి ఆలోచించకుండా రంగులతో పండగ చేసుకోవాలంటే ఈ పానీయాలు తాగేయండి.

Published : 05 Mar 2023 00:28 IST

రంగుల పండగ!

రంగులతో ఆడటం మొదలుపెట్టామంటే సమయమే తెలియదు.. అలసిపోయినా ఆడాలనిపిస్తుంది. ఆ నీళ్లకి దగ్గు, జలుబు వస్తాయని తెలిసినా లెక్కచేయం. వీటి గురించి ఆలోచించకుండా రంగులతో పండగ చేసుకోవాలంటే ఈ పానీయాలు తాగేయండి. అటు హుషారునీ... ఇటు వ్యాధినిరోధక శక్తిని పెంచేస్తాయి.


తండాయి

కావాల్సినవి: పాలు- 2 కప్పులు, చక్కెర- 2 చెంచాలు, రోజ్‌ఎసెన్స్‌- అర చెంచా, కుంకుమపువ్వు- చిటికెడు, గ్రైండ్‌ చేయడానికి: బాదం-20, గసగసాలు- చెంచా, సోంపు- చెంచా, మిరియాలు- 8, యాలకుల పొడి- పావుచెంచా

తయారీ: బాదంపప్పుని గంటపాటు నానబెట్టుకోవాలి. పొట్టు తీసేసి.. కాసిని పాలలో కుంకుమపువ్వుతో కలిపి మరో పావుగంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గసగసాలు, సోంపు, మిరియాలు, అరకప్పు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు మరిగించుకున్నాక అందులో ఈ బాదం మిశ్రమం వేసి ఓ అరగంటపాటు పక్కన పెట్టేసి తర్వాత ఆ పాలను వడకట్టుకోవాలి. ఈ పాలను మళ్లీ మరిగించి అందులో పంచదార, యాలకుల పొడి, రోజ్‌ఎసెన్స్‌ వేసుకుంటే తండాయి సిద్ధం. దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని హోలీ ఆడి అలసిపోయాక చల్లగా తాగి చూడండి. భలే ఉంటుంది. శక్తినివ్వడంతోపాటు మలబద్ధకం రాకుండా చేస్తుంది.


జల్‌జీరా

కావాల్సినవి:  పుదీనా ఆకులు- గుప్పెడు, కొత్తిమీర- గుప్పెడు, ఐస్‌క్యూబ్స్‌- తగినన్ని, అల్లం- చిన్నముక్క, జీలకర్ర- రెండు చెంచాలు, ఆమ్‌చూర్‌ పొడి- అరచెంచా, నల్లుప్పు- తగినంత, నీళ్లు- రెండున్నర గ్లాసులు, నిమ్మ- అరచెక్క, మిరియాల
పొడి- అరచెంచా

తయారీ: కడాయిలో జీలకర్రని దోరగా వేయించుకోవాలి. చల్లారాక వాటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి. మిక్సీలో కొత్తిమీర, పుదీనాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌కి తగినన్ని నీళ్లు కలపాలి. ఒక జగ్‌లో తగినన్ని ఐస్‌క్యూబ్స్‌ తీసుకుని.. సన్నగా తరిగిన అల్లం, పుదీనా పేస్ట్‌, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌పొడి, నల్లుప్పు, రెండు గ్లాసుల నీళ్లు, నిమ్మరసం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చల్లచల్లని జల్‌జీరా సిద్ధం. దాహార్తిని తీర్చడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.


పసుపుతో..

కావాల్సినవి:  తేనె- రెండు చెంచాలు, నిమ్మరసం- అరచెంచా, పసుపు- పావుచెంచా, గోరువెచ్చని నీళ్లు- గ్లాసు

తయారీ: ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో పసుపు, నిమ్మరసం, తేనె వేసి బాగా కలిపితే హనీలెమన్‌ వాటర్‌ సిద్ధమవుతాయి. చేయడానికి తేలిగ్గానే అనిపించినా ఈ పానీయంతో అనేక ప్రయోజనాలున్నాయి. జలుబు, దగ్గు రాకుండా నివారిస్తుంది. గొంతుకు హాయిగా ఉంటుంది. నిమ్మరసం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.


స్ట్రాబెర్రీ స్మూథీ

కావాల్సినవి:  చల్లని స్ట్రాబెర్రీలు లేదా ఫ్రోజెన్‌వి- కప్పు, అరటిపండు- 1, పెరుగు- అర కప్పు, బాదం ఫ్లేవర్డ్‌ పాలు- కప్పు, వెనిలా- అరచెంచా, చియా గింజలు లేదా నానబెట్టిన సబ్జా గింజలు- చెంచా

తయారీ: స్ట్రాబెర్రీలు శుభ్రం చేసుకుని చిన్నముక్కలుగా చేసుకోవాలి. సబ్జా గింజలని అరగంటపాటు నానబెట్టి ఉంచుకోవాలి. వీటితోపాటు అరటిపండు ముక్కలు, పాలు, పెరుగు వేసి మిక్సీలో బ్లెండ్‌ చేసుకుంటే రుచికరమైన స్మూథీ సిద్ధం.


పుచ్చకాయ, కీరతో

కావాల్సినవి:  పుచ్చకాయ ముక్కలు- మూడు కప్పులు, కీరా- అరకప్పు, నిమ్మరసం- నాలుగు చెంచాలు

తయారీ: మిక్సీలో కీరా, పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం వేసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. రుచికోసం తేనె కలపొచ్చు. లేదంటే... వడ కట్టుకుని అలానే తాగేయొచ్చు. ఎండ నుంచి చక్కని ఉపశమనం ఇవ్వడంతోపాటు చెమట కారణంగా కోల్పోయిన పోషకాలనీ అందిస్తుంది.


కొబ్బరితో

కావాల్సినవి:  కొబ్బరి నీళ్లు- 2 కప్పులు, లేత కొబ్బరి మీగడ- అర కప్పు, పైనాపిల్‌ ముక్కలు- అరకప్పు, పంచదార- చెంచా, ఉప్పు- చిటికెడు

తయారీ: కొబ్బరినీళ్లు, కొబ్బరి మీగడ, సన్నగా తరిగిన పైనాపిల్‌ ముక్కలు, పంచదార, ఉప్పు వీటిని మిక్సీలో మెత్తగా స్మూథీగా మాదిరిగా చేసుకుని, చల్లగా సర్వ్‌ చేసుకోవాలి. చెమట కారణంగా శరీరం కోల్పోయిన పోషకాలని తిరిగి అందిస్తుందీ పానీయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని