నేరేడు...తిని చూడు!

నేరేడు పండ్లు పుష్కలంగా దొరికే కాలం ఇది. నల్లగా నిగనిగలాడే అల్ల నేరేడు పండ్లు రుచిలో వగరూ, తీపీ, పులుపు కలగలిపి ఉంటాయి. వీటిల్లో పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి

Published : 25 Jun 2023 00:36 IST

నేరేడు పండ్లు పుష్కలంగా దొరికే కాలం ఇది. నల్లగా నిగనిగలాడే అల్ల నేరేడు పండ్లు రుచిలో వగరూ, తీపీ, పులుపు కలగలిపి ఉంటాయి. వీటిల్లో పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు ఈ చెట్టు ఆకులూ, బెరడుల్లోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.

  • నేరేడులో కెలొరీలు తక్కువ. ఎ, సి-విటమిన్లూ ఖనిజాలూ ఫైటోకెమికల్సూ పుష్కలంగా ఉంటాయి. అందుకే  సీజన్‌లో వచ్చే ఈ పండ్లను నేరుగా తినడమే కాదు, ఐస్‌క్రీములూ స్మూదీలూ జామ్‌లూ సలాడ్‌ల తయారీలోనూ వాడుతుంటారు.
  • వానాకాలంలో వచ్చే అతిసారం, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ నేరేడు అరికడుతుంది. దంతాలు, చిగుళ్ల వల్ల సమస్యల్నీ, జలుబు వైరస్‌ల్నీ అడ్డుకుంటుందని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం.
  • క్యాన్సర్‌, గుండె, కాలేయ చికిత్సలో వాడే మందుల ప్రభావాన్ని తగ్గించే గుణం నేరేడులోని పోషకాలకి ఉంది. నేరేడులోని ఫైటో కెమికల్సూ పాలీఫినాలిక్‌ ఆమ్లాలూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • కడుపులో పేరుకుపోయిన  మలినాలను, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి ఇందులోని పోషకాలు చక్కగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు... కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ బాధితులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
  • రక్తహీనత ఉన్నవాళ్లు తింటే.. హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ సరఫరాని పెంచి చురుగ్గా ఉండేట్టు చేస్తుంది.
  • ఈ పండ్లలోని ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లను స్రవించేలా చేసి కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి. నేరేడులోని పొటాషియం రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోనీయదనీ తద్వారా హృద్రోగాలనీ నియంత్రించుకోవచ్చనీ పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని