పండ్ల పచ్చళ్లు!

దోర వెలక్కాయకి కాసింత జీలకర్ర, ఇన్ని పచ్చి మిరపకాయలు చేర్చి రోట్లో దంచితే... నోరూరకుండా ఉంటుందా?  పైనాపిల్‌ని ముక్కలుగా కోసి ఎవరైనా తింటారు. అదే ఎండుమిర్చి వేసి పచ్చడి చేసి చూడండి. ఇన్ని రోజులూ ఇలా ఎందుకు తినలేదా అనిపిస్తుంది.  ఇవే కాదు పండ్లతో చేసే పచ్చళ్లు ఇంకా బోలెడు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని...

Updated : 11 Sep 2022 06:40 IST

దోర వెలక్కాయకి కాసింత జీలకర్ర, ఇన్ని పచ్చి మిరపకాయలు చేర్చి రోట్లో దంచితే... నోరూరకుండా ఉంటుందా?  పైనాపిల్‌ని ముక్కలుగా కోసి ఎవరైనా తింటారు. అదే ఎండుమిర్చి వేసి పచ్చడి చేసి చూడండి. ఇన్ని రోజులూ ఇలా ఎందుకు తినలేదా అనిపిస్తుంది.  ఇవే కాదు పండ్లతో చేసే పచ్చళ్లు ఇంకా బోలెడు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని...


వెలక్కాయ రోటి పచ్చడి

కావాల్సినవి: పచ్చి వెలక్కాయ- ఒకటి, జీలకర్ర- అరచెంచా, మినప్పప్పు- చెంచా, మెంతి గింజలు- నాలుగు, పచ్చిమిర్చి- రెండు, ఎండు మిరపకాయలు- నాలుగు, ఇంగువ- పావుచెంచా, ఉప్పు- తగినంత, బెల్లం- కొద్దిగా(నచ్చితే), పసుపు- పావుచెంచా, నూనె- రెండు చెంచాలు, కరివేపాకు- రెబ్బ
తయారీ: వెలక్కాయ గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌లో నూనె పోసి అందులో ఎండు మిర్చి, మెంతి గింజలు, ఇంగువ, జీలకర్ర, పచ్చిమిర్చి, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నూనె తప్పించి తక్కిన తిరగమోత గింజలని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో వెలక్కాయ గుజ్జు వేసి మూతపెట్టి మగ్గపెట్టుకోవాలి. పచ్చిగా ఉంటే కొద్దిగా నీళ్లు, ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. మిక్సీ లేదా రోట్లో ముందుగా తిరగమోత గింజలని దంచి ఆ తర్వాత వెలక్కాయ గుజ్జు వేసి రుబ్బుకోవాలి. నెయ్యి వేసుకుని తింటే అన్నంలోకి చాలా బాగుంటుంది.

* మెదడు చురుగ్గా ఉండటానికీ, కిడ్నీలో ఏర్పడిన రాళ్ల నుంచి ఉపశమనం పొందడానికీ దానిమ్మ గింజలు సాయపడతాయి.
*పచ్చి బొప్పాయి నెలసరి సమయంలో ఎదురయ్యే నొప్పిని తగ్గిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్‌  రాకుండా చూస్తుంది.
* పైనాపిల్‌ ఆర్థరైటిస్‌ సమస్య ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది.


పచ్చి బొప్పాయితో..

కావాల్సినవి: పచ్చి బొప్పాయి- ఒకటి, నిమ్మరసం- అరకప్పు, కారం- అరకప్పు, ఉప్పు- పావు కప్పు, ఆవపిండి- పావుకప్పు, తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు- ఐదారు, కరివేపాకు- రెబ్బ, నూనె- అరకప్పు, మెంతులు- చెంచా  
తయారీ: పచ్చి బొప్పాయిని చెక్కుతీసి తడిలేకుండా తుడిచి చిన్నముక్కలుగా కోసి ఎండలో పదినిమిషాలపాటు పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి కడాయిలో మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో తరిగిన బొప్పాయి ముక్కలు, నిమ్మరసం, కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయి పెట్టి, మొత్తం నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. ఇందులోనే... వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వాటిని కూడా ఇదే నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత స్టౌ కట్టేసి పోపుని చల్లారనివ్వాలి. దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుని బాగా కలపాలి. ఇది వెంటనే కన్నా.. రెండు రోజులు ఊరితే బాగుంటుంది.


జామకాయతో..

కావాల్సినవి: దోర జామకాయలు- మూడు, పచ్చిమిర్చి- ఆరు, చింతపండు గుజ్జు- చెంచాన్నర, ఎండు మిరపకాయలు- నాలుగు, ఉప్పు- తగినంత, ధనియాలు- పావుచెంచా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ- పావుచెంచా చొప్పున, నూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
తయారీ: ముందుగా జామకాయల్ని శుభ్రం చేసి సన్నని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక అందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోనే జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో రెండు చెంచాల నూనె వేసి అందులో జామ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, మినప్పప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. అవి నలిగాక మగ్గిన జామకాయ ముక్కల్ని వేసి రుబ్బుకోవాలి. అప్పుడు స్టౌపైన కడాయి పెట్టి అందులో ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లిరెబ్బలు వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది.


దానిమ్మ ఊరగాయ

కావాల్సినవి: దానిమ్మ గింజలు- కప్పు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, జీలకర్ర- అరచెంచా, కారం- అరచెంచా, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అరచెంచా, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా కడాయిలో జీలకర్రని పొడిగా వేయించుకోవాలి. రోట్లో లేదా మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో దానిమ్మ గింజలు, జీలకర్ర- వెల్లుల్లిపొడి, ఉప్పు, కారం వేసి కలపాలి. స్టౌ వెలిగించి.. ఒక పాన్‌లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు చల్లారాక సిద్ధం చేసుకున్న దానిమ్మ గింజలపై వేసుకుంటే పచ్చడి సిద్ధం. దోసెల్లోకి బాగుంటుంది.


పైనాపిల్‌తో..

కావాల్సినవి: పైనాపిల్‌- ఒకటి, ఉప్పు, కారం, మిరియాలపొడి- తగినంత, వేయించిన చిల్లీఫ్లేక్స్‌- చెంచా, కాల్చిన వెల్లుల్లి రెబ్బలు- ఐదు, ఆవనూనె- చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు చెంచాలు, పంచదార- చెంచా (పైనాపిల్‌ మరీ పుల్లగా ఉంటే అవసరం అవుతుంది), చాట్‌మసాలా- చెంచా(నచ్చితే), దానిమ్మ గింజలు- చెంచా
తయారీ: పైనాపిల్‌ పచ్చగా ఉంటే ఒకటిరెండు రోజుల ఎండలో పెడితే పండిపోతుంది. దాని చెక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలపై నుండే పొట్టు తీసేసి గ్యాస్‌పొయ్యిమీద కాని గ్రిల్‌మీద కాల్చుకోవాలి. దీనివల్ల పచ్చడికి చక్కని స్మోకీ రుచి అబ్బుతుంది. ఇప్పుడొక పాత్రలో అనాస ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, కారం, చిల్లీఫ్లేక్స్‌, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, చల్లార్చిన వెల్లుల్లి రెబ్బలు, చాట్‌మసాలా, దానిమ్మ గింజలు, చివరిగా ఆవనూనె వేసి కలపాలి. వీటన్నింటినీ చెంచాతోకానీ, చేత్తోకానీ మెదిపి ఓ పదినిమిషాల తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు