మస్త్‌ రుచుల మునగ!

ఆషాఢమాసంలో మునగాకు తినాలంటారు. ఎన్నో పోషకాలను అందించే మునగాకుతో కేవలం పప్పు, వేపుడు కూర మాత్రమే కాదు మరికొన్ని రుచులూ చేసుకోవచ్చు. అలాంటివే ఇవన్నీ...

Published : 26 Jun 2021 12:05 IST

ఆషాఢమాసంలో మునగాకు తినాలంటారు. ఎన్నో పోషకాలను అందించే మునగాకుతో కేవలం పప్పు, వేపుడు కూర మాత్రమే కాదు మరికొన్ని రుచులూ చేసుకోవచ్చు. అలాంటివే ఇవన్నీ...


రొయ్యల కూర

కావలసినవి: నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, మునగాకు: రెండు కప్పులు, చిన్న రొయ్యలు: పదిహేను, ఉప్పు: తగినంత, కొబ్బరి తురుము: కప్పు, ఎండుమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: మూడు, జీలకర్ర: చెంచా.

తయారీవిధానం: రొయ్యల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు వేయించి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. అవి కూడా వేగాక మునగాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. మునగాకు ఉడికిందనుకున్నాక శుభ్రం చేసుకున్న రొయ్యలు, కొబ్బరి మిశ్రమం వేసి కలిపి స్టౌని మీడియంలో పెట్టాలి. ఇది పొడి కూరలా అయ్యాక దింపేయాలి.


కారప్పొడి

కావలసినవి:పల్లీలు: పావుకప్పు, మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు: రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మునగాకు: కప్పు, ఎండుమిర్చి: ఇరవైఅయిదు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుకొబ్బరి పొడి: రెండు చెంచాలు, దనియాలు: రెండు చెంచాలు, చింతపండు: కొద్దిగా.
తయారీవిధానం: స్టౌమీద బాణలి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు, మినప్పప్పు, నువ్వులు, సెనగపప్పు, ఎండుమిర్చి, దనియాలు వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి... మునగాకు, చింతపండు వేసి వేయించుకుని స్టౌ కట్టేసి, కొబ్బరిపొడి వేయాలి. అయిదు నిమిషాలయ్యాక మిక్సీ జారులో ముందుగా వేయించుకున్న తాలింపు, మునగాకు, తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.


కూటు

కావలసినవి: మునగాకు: రెండు కప్పులు, పెసరపప్పు: పావుకప్పు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, నెయ్యి: రెండు చెంచాలు, కొబ్బరి తురుము: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: రెండు, మినప్పప్పు: చెంచా, కారం: చెంచా.
తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో పెసరపప్పును ఉడికించుకుని పెట్టుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, దనియాలు, జీలకర్రను మిక్సీలో వేసి, కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేయాలి. అవి వేగాయనుకున్నాక పసుపు, తగినంత ఉప్పు, మునగాకు తరుగు, కారం వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మునగాకు మెత్తగా అయ్యాక ఉడికించిన పెసరపప్పు కొబ్బరిమిశ్రమం వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


రాగి రొట్టె

కావలసినవి: రాగిపిండి: కప్పు, మునగాకు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, ఆవాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, నూనె: పావుకప్పు.
తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు వేయించి.. ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగాయనుకున్నాక టొమాటోముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆ ముక్కలూ ఉడికాక స్టౌని కట్టేయాలి. ఇందులో రాగిపిండి వేసి... అవసరమైతే నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలపాలి. తరవాత పిండి అద్దుకుంటూ మందంగా రొట్టెలా చేసి పెనంమీద వేసి మూత పెట్టాలి. ఒకవైపు కాలాక రెండోవైపు తిప్పి... కొద్దిగా నూనె వేసి ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని