నోరూరించే కట్‌లెట్‌లు!

పిల్లలకే కాదు పెద్దవాళ్లకీ సాయంత్రం కాగానే స్పైసీగా ఉండే స్నాక్స్‌ తినాలనిపించడం మామూలే. అయితే... కొత్తగా ఏం చేసుకోవాలనేదే అసలు సమస్యంతా... అందుకే ఈసారి ఏ పకోడీనో, బజ్జీనో కాకుండా ఈ కట్‌లెట్‌లను ప్రయత్నిస్తే సరి.

Published : 24 Jun 2021 21:04 IST

పిల్లలకే కాదు పెద్దవాళ్లకీ సాయంత్రం కాగానే స్పైసీగా ఉండే స్నాక్స్‌ తినాలనిపించడం మామూలే. అయితే... కొత్తగా ఏం చేసుకోవాలనేదే అసలు సమస్యంతా... అందుకే ఈసారి ఏ పకోడీనో, బజ్జీనో కాకుండా ఈ కట్‌లెట్‌లను ప్రయత్నిస్తే సరి.


చికెన్‌తో...

కావలసినవి
చికెన్‌: పావుకేజీ, ఉల్లిపాయ తరుగు: అరకప్పు, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, ఉడికించిన పచ్చిబఠాణీ: అరకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా, పుదీనా ఆకులు: గుప్పెడు, గరంమసాలా: ఒకటిన్నర చెంచా, బియ్యప్పిండి: అరకప్పు, సెనగపిండి: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, గుడ్డు: ఒకటి, బ్రెడ్‌పొడి: అరకప్పు.
తయారీవిధానం: ముందుగా చికెన్‌ని ఉడికించుకుని తరువాత మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అందులో బ్రెడ్‌పొడి, గుడ్డుసొన, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నచ్చిన ఆకృతిలో కట్‌లెట్‌లా చేసుకుని మొదట గుడ్డుసొనలో తరువాత బ్రెడ్‌ మిశ్రమంలో అద్దుకుని పెనం మీద ఉంచి.. నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


సేమియాతో...

కావలసినవి
సేమియా: ఒకటిన్నర కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, మొక్కజొన్నపిండి: అరకప్పు, మైదా: పావుకప్పు, మిరియాలపొడి: పావుచెంచా, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, అల్లంముద్ద: అరచెంచా, ఎండుమిర్చి గింజలు: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, బ్రెడ్‌పొడి: కప్పు, కొత్తిమీర: కట్ట.
తయారీ విధానం: స్టౌమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి అరకప్పు సేమియాను దోరగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో నాలుగు కప్పుల నీళ్లు, అరచెంచా ఉప్పు వేయాలి. అవి మరుగుతున్నప్పుడు సేమియా వేసి మూడు నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి. ఆ నీళ్లు వంపేసి ఉడికించిన సేమియాను ఓ గిన్నెలో వేసుకోవాలి. అది పూర్తిగా చల్లారాక అందులో రెండు టేబుల్‌స్పూన్ల మొక్కజొన్నపిండి, ఉడికించిన బంగాళాదుంపముద్ద, అల్లంముద్ద, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి గింజలు, జీలకర్రపొడి, గరంమసాలా, చాట్‌మసాలా, అరకప్పు బ్రెడ్‌పొడి, కొత్తిమీర తరుగు, అరచెంచా ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన మొక్కజొన్నపిండి, మైదా, మిరియాలపొడి, కొద్దిగా ఉప్పు ఓ గిన్నెలో వేసి నీళ్లుపోసి పల్చగా కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకుని సేమియా మిశ్రమాన్ని పొడుగ్గా చేసుకుని ముందు మైదా మిశ్రమంలో ముంచి... తరువాత బ్రెడ్‌పొడిలో, చివరగా మిగిలిన సేమియాలో అద్ది కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


పనీర్‌తో...

కావలసినవి
పనీర్‌ తురుము: రెండుకప్పులు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద: కప్పు, ఉల్లిపాయ తరుగు: పావుకప్పు, క్యారెట్‌: ఒకటి, పచ్చిమిర్చి: ఒకటి, అల్లంముద్ద: అరచెంచా, కారం: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా, మొక్కజొన్నపిండి: అరకప్పు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: పావుచెంచా, మైదా: రెండుటేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: అరకప్పు.
తయారీవిధానం
ఓ గిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, బ్రెడ్‌పొడి, మిరియాలపొడి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో రెండు టేబుల్‌స్పూన్ల మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలపాలి. మరో గిన్నెలో మైదా, మిరియాలపొడి, మిగిలిన మొక్కజొన్నపిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోస్తూ గరిటెజారుగా చేసుకోవాలి. కొద్దిగా పనీర్‌ మిశ్రమాన్ని తీసుకుని చిన్న కట్‌లెట్‌లా చేసుకుని మొదట మైదా మిశ్రమంలో, తరువాత బ్రెడ్‌పొడిలో అద్దుకోవాలి. ఇలా అన్నీ చేసుకుని స్టౌమీద పెనంపెట్టి రెండు చొప్పున ఉంచి... నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


అటుకులతో..

కావలసినవి
అటుకులు: రెండుకప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు: మూడు, పనీర్‌ తురుము: పావుకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, మిరియాలపొడి: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, చాట్‌మసాలా: చెంచా, కారం: అరచెంచా, అల్లంతరుగు: అరచెంచా, పచ్చిమిర్చి తరుగు: చెంచా, మైదా: రెండు చెంచాలు, కొత్తిమీర: కట్ట, బ్రెడ్‌పొడి: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: అటుకుల్ని ఓసారి కడిగి గిన్నెలో తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ ఆకృతిలో చేసుకుని రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని