ఉల్లిమసాలా... నోరూరేలా!

మసాలాముద్దకోసం కొబ్బరితురుము వేయించి తీయాలి. తరవాత దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు కూడా వేయించి తీయాలి. అన్నీ కలిపి ముద్దలా రుబ్బాలి.

Published : 27 Jun 2021 14:40 IST

ఉల్లిపాయ పులుసు

కావలసినవి
సాంబారులో వేసే చిన్న ఉల్లిపాయలు: పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, కారం: టీస్పూను, పసుపు: అరటీస్పూను, ఉప్పు: తగినంత, చింతపండు: నిమ్మకాయంత, ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: పది రెబ్బలు, ఎండుమిర్చి: నాలుగు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు మసాలాముద్దకోసం: కొబ్బరితురుము: అరకప్పు, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరటీస్పూను, మిరియాలు: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, మెంతులు: పావుటీస్పూను

తయారుచేసే విధానం
* మసాలాముద్దకోసం కొబ్బరితురుము వేయించి తీయాలి. తరవాత దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు కూడా వేయించి తీయాలి. అన్నీ కలిపి ముద్దలా రుబ్బాలి. చింతపండు నానబెట్టాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత ఒలిచిన ఉల్లి, వెల్లుల్లిపాయలు వేసి ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు రుబ్బిన మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి వేగిన తరవాత ఓ కప్పు నీళ్లు పోయాలి. అది మరిగిన తరవాత సిమ్‌లో పెట్టాలి. నానబెట్టిన చింతపండును రసం పిండి కూరలో పోసి ఓ నిమిషం ఉడికించి దించాలి.


బేబీ ఆనియన్‌ కా సాలన్‌

కావలసినవి
చిన్న ఉల్లిపాయలు: పావుకిలో, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, నువ్వులు: టీస్పూను, కొబ్బరి తురుము: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, పెద్ద ఉల్లిపాయ: ఒకటి, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, మెంతులు: అరటీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, టొమాటో: ఒకటి, చింతపండుగుజ్జు: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, పుదీనా ఆకులు: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, బెల్లం తురుము: టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* పల్లీలు, నువ్వులు, కొబ్బరితురుము వేయించాలి. చల్లారాక పొడి చేసి ఉంచాలి.
* పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి తీసి పక్కన ఉంచాలి. మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి ఉప్పు చల్లి అవి ఉడికేవరకూ ఉంచాలి. ఇప్పుడు పసుపు, కారం, దనియాలపొడి, పల్లీల మిశ్రమం వేసి కలపాలి. తరవాత పుదీనా, కొత్తిమీర తురుములతోబాటు చింతపండు గుజ్జు కూడా వేసి ఉడికించాలి. అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి సిమ్‌లో ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికిన తరవాత చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించి దించాలి.


ఉల్లి కారం

కావలసినవి
ఉల్లిపాయలు: రెండు, ఎండుమిర్చి: ఏడు, జీలకర్ర: టీస్పూను, దనియాలు: టీస్పూను, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: మూడు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాచాలి. ఎండుమిర్చి, జీలకర్ర, దనియాలు వేసి వేగాక చింతపండు కూడా వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి ఓ నిమిషం వేయించి తీసి చల్లారాక కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఇది
ఇడ్లీ, దోసె, అన్నం, రోటీ అన్నింటిలోకీ బాగుంటుంది.


మసాలా కూర

కావలసినవి
ఉల్లిపాయలు (చిన్న సైజువి): అరకిలో, పెద్ద ఉల్లిపాయ: ఒకటి, యాలకులు: రెండు, వెల్లుల్లిరెబ్బలు: నాలుగు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, సిమ్లా మిర్చి: రెండు, ఎండుమిర్చి: నాలుగు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, దాల్చినచెక్కముక్క: అంగుళం సైజు, కారం: 4 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: తగినంత, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, పెరుగు: పావుకప్పు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* చిన్న సైజు ఉల్లిపాయలు ఒలిచి ఉంచాలి. పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కోయాలి. సిమ్లా మిర్చిని రెండంగుళాల సైజు ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరవాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి, పసుపు, దనియాలపొడి, యాలకులు, దాల్చినచెక్క ముక్క, కారం, ఎండుమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి వేగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత మిర్చి ముక్కలు, పెరుగు వేసి సుమారు ఐదు నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి. చల్లారిన తరవాత అన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు వేసి ఓ రెండుమూడు నిమిషాలు వేగిన తరవాత సుమారు రెండున్నర కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా తిప్పుతుండాలి. అవి ఉడికిన తరవాత రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికి నూనె బయటకు వస్తుండగా దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు