చింతచిగురు... నోరూరు!

వేసవిలోనే దొరికే ఆహార పదార్థాల్లో మొదటిది మామిడి అయితే రెండోది  చింతచిగురు. దాంతో పప్పు ఒక్కటే కాదు మరికొన్ని పదార్థాలను కూడా చేసుకోవచ్చు తెలుసా...

Published : 24 Jun 2021 19:36 IST

వేసవిలోనే దొరికే ఆహార పదార్థాల్లో మొదటిది మామిడి అయితే రెండోది  చింతచిగురు. దాంతో పప్పు ఒక్కటే కాదు మరికొన్ని పదార్థాలను కూడా చేసుకోవచ్చు తెలుసా...


చింతచిగురు కొబ్బరి పచ్చడి

కావలసినవి
చింతచిగురు: కప్పు, తాజా కొబ్బరి ముక్కలు: కప్పు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: అయిదు, ఎండుమిర్చి: ఏడు, ఆవాలు:అరచెంచా, మినప్పప్పు: చెంచా, మెంతులు: కొద్దిగా, ఇంగువ: చిటికెడు, నూనె: మూడు చెంచాలు.
తయారీ విధానం : స్టౌమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక చింత చిగురు, కొబ్బరి ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని ఎర్రగా వేయించుకుని స్టౌ కట్టేయాలి. ఈ తాలింపు వేడి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. ఇందులో మిగిలిన పదార్థాలు వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకుని తీసుకోవాలి.


పొడి

కావలసినవి
ఎండబెట్టిన చింతచిగురు: కప్పు, ఎండుమిర్చి: పది, వెల్లుల్లిరెబ్బలు: అయిదారు, ఎండుకొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: రెండు చెంచాలు, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి.. నూనె వేయాలి. అది వేడెక్కాక చింత చిగురు, ఉప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా వేయించాలి. ఈ తాలింపు వేడి చల్లారాక మిక్సీలో తీసుకుని చింతచిగురు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి తీసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది.


రొయ్యలతో...

కావలసినవి
రొయ్యలు: పావుకేజీ, చింతచిగురు: కప్పు, దనియాలపొడి: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ ముక్కలు: ముప్పావుకప్పు, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, నెయ్యి: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, కొబ్బరిపొడి: చెంచా.
తయారీ విధానం: స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక రొయ్యలు వేసి వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, పసుపు, ఉప్పు, కారం, దనియాలపొడి, చింతచిగురు, కరివేపాకు, పచ్చిమిర్చి ముద్ద వేసి అన్నింటినీ బాగా కాలపాలి. ఇది కూరలా అయ్యాక కొబ్బరిపొడి చల్లి దింపేయాలి.


పులిహోర

కావలసినవి
బియ్యం: కప్పు, చింతచిగురు: కప్పు, నూనె: మూడుటేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, పచ్చిమిర్చి: మూడు, పల్లీలు: పావుకప్పు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, పసుపు: పావుచెంచా, ఇంగువ: కొద్దిగా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి ఒకటి ముప్పావుకప్పు నీళ్లు పోసి పొడిపొడిగా వండిపెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, సెనగపప్పు, ఇంగువ వేసి అన్నింటినీ వేయించుకోవాలి. ఆ తాలింపును అన్నంపైన వేయాలి. ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి, పసుపు, సన్నగా తరిగిన చింతచిగురు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక ఈమిశ్రమాన్ని కూడా అన్నంపైన వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.


చికెన్‌ ఫ్రై

కావలసినవి
బోన్‌లెస్‌ చికెన్‌: అరకేజీ, చింతచిగురు: ఒకటింబావుకప్పు, కొబ్బరి తురుము: రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: మూడు, పసుపు: పావుచెంచా, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, దాల్చినచెక్క: రెండు ముక్కలు, యాలకులు: రెండు, లవంగాలు: మూడు.
తయారీ విధానం: చింతచిగురును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అవి బాగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. అయిదు నిమిషాలయ్యాక పసుపు, కారం, తగినంత ఉప్పు, దనియాలపొడి, కొబ్బరి తురుము, గరంమసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక చింతచిగురు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌని సిమ్‌లో పెట్టి... మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి కూర పొడిపొడిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని