తోటకూర కమ్మకమ్మగా..!

తోటకూర అనగానే వేయించడమో లేదా పప్పులో వేయడమో చేస్తుంటాం. కానీ దాన్ని రకరకాలుగా అదీ పోషకాలు పోకుండా కూడా వండుకోవచ్చు అంటున్నారు ఈతరం షెఫ్‌లు.

Updated : 21 Oct 2021 16:20 IST

తోటకూర అనగానే వేయించడమో లేదా పప్పులో వేయడమో చేస్తుంటాం. కానీ దాన్ని రకరకాలుగా అదీ పోషకాలు పోకుండా కూడా వండుకోవచ్చు అంటున్నారు ఈతరం షెఫ్‌లు.

 

తోటకూర పెరుగు

కావలసినవి
తోటకూర: 4 కట్టలు(సన్నవి), పెరుగు: 3 కప్పులు, కొబ్బరి తురుము: కప్పు, పచ్చిమిర్చి: ఆరు, నువ్వులు: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* తోటకూర కడిగి సన్నగా తరిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఆకులు మరీ మెత్తగా కాకుండా చూడాలి.
* బాణలిలో టీస్పూను నూనె వేసి నువ్వులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత రెండింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా కలిపి అందులో ఉడికించిన తోటకూర, రుబ్బిన పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు విడిగా చిన్న బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు చేసి పెరుగులో కలిపితే సరి.


కలగలుపు ఆకుకూర

కావలసినవి
చుక్కకూర, మెంతికూర, తోటకూర: ఒక్కో కట్ట చొప్పున, పాలకూర: రెండు కట్టలు, కొత్తిమీర: కట్ట, సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి తురుము: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తురుము: టేబుల్‌స్పూను, దనియాలపొడి: టేబుల్‌స్పూను, అల్లం తురుము: టేబుల్‌స్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం
* సెనగపప్పు ముందే నానబెట్టాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి. ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగాక నానబెట్టిన సెనగపప్పు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మెంతికూర, చుక్కకూర, తోటకూర వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరవాత పాలకూర, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. అది ఉడికి నూనె బయటకు వస్తుండగా దనియాలపొడి, కొత్తిమీర తురుము చల్లి దించాలి.


తోటకూర- కొబ్బరి

కావలసినవి
తోటకూర: 4 కట్టలు, కొబ్బరితురుము: ముప్పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: ఏడు, జీలకర్ర: పావుటీస్పూను, పసుపు: టీస్పూను, కారం: ఒకటింపావు టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, నూనె:టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* తోటకూరను సన్నగా తరగాలి.
* మిక్సీలో కొబ్బరి తురుము, వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, పసుపు, కారం వేసి వేయించాలి.
* పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు వేయాలి. తరవాత కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు తోటకూర కూడా వేసి రెండు నిమిషాలు వేగాక ఉప్పు వేసి కలపాలి. తరవాత కొబ్బరి మిశ్రమం కూడా వేసి బాగా వేయించి తీయాలి.


తోటకూర మసాలా పప్పు

కావలసినవి
తోటకూర: 4 కట్టలు (సన్నవి), పెసర పప్పు: కప్పు, వెల్లుల్లి: ఎనిమిది, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంతురుము: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను,
దనియాలపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కారం: టీస్పూను, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారుచేసే విధానం
* పెసరపప్పుని కడిగి విడిగా ఉడికించి ఉంచాలి.
* మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లం తురుము, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కారం, దనియాలపొడి, చిదిమిన వెల్లుల్లి వేసి కలపాలి. తరవాత సన్నగా తరిగిన తోటకూర వేసి, తగినన్ని నీళ్లు పోసి ఆకు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీర తురుము చల్లి దించితే సరి.

(9 జూన్‌ 2019)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని