సొరకాయ్‌... కోసెయ్‌..!

సెనగపప్పుని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, అల్లం, మంచినీళ్లు వేసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. తరవాత పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర, పలావు ఆకులు వేసి ..

Published : 26 Jun 2021 16:56 IST

సొరకాయ-సెనగపప్పు


కావలసినవి

సొరకాయ: అరకిలో, సెనగపప్పు: కప్పు, మంచినీళ్లు: మూడు కప్పులు, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, అల్లంతురుము: టేబుల్‌స్పూను, వెన్న లేదా నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, పలావు ఆకులు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, టొమాటో ముక్కలు: అరకప్పు, గరంమసాలా: అరటీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు 

తయారుచేసే విధానం
*సెనగపప్పుని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, అల్లం, మంచినీళ్లు వేసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. తరవాత పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర, పలావు ఆకులు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి నూనె తేలేవరకూ వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, గరంమసాలా, దనియాలపొడి, కారం వేసి కలపాలి. తరవాత సొరకాయ ముక్కలు వేసి కలిపి, ఉడికించిన సెనగపప్పు కూడా వేసి సిమ్‌లో ముక్కలు ఉడికేవరకూ ఉంచి కొత్తిమీర తురుముతో అలంకరించాలి.

సొరకాయ పొరియల్‌

కావలసినవి
సొరకాయ: పావుకిలో, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: కట్ట, ఆవాలు: పావు టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, పసుపు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, మసాలా కారం: 2 టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: టేబుల్‌స్పూను మసాలాకారం కోసం: ఎండుకొబ్బరి: టేబుల్‌స్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: టేబుల్‌స్పూను, మెంతులు: చిటికెడు, ఎండుమిర్చి: నాలుగు, 
జీలకర్ర: టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: రెండు

తయారుచేసే విధానం
* వెల్లుల్లి తప్ప మిగిలినవన్నీ బాణలిలో వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించి తీసి చల్లారాక పొడి చేయాలి.
* సొరకాయ తొక్కు తీసి ముక్కలు కోయాలి. మందపాటి బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగాక సొరకాయ ముక్కలు, పసుపు వేయాలి. నెమ్మదిగా తిప్పతూ ఐదు నిమిషాలు వేగాక మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు పూర్తిగా మగ్గిన తరవాత వేపుడు కారం, కొబ్బరి తురుము వేసి కలిపి దించాలి.

సొరకాయ-వడియాల కూర

కావలసినవి
సొరకాయ: అరకిలో, టొమాటోలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, 
అల్లంతురుము: టీస్పూను, పసుపు: అర టీస్పూను, జీలకర్ర: టీస్పూను, కారం: టీస్పూను, గుమ్మడి లేదా మినప వడియాలు: కొన్ని, మంచినీళ్లు: కప్పు, ఉప్పు: తగినంత, గరంమసాలా: అరటీస్పూను, 
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఓ బాణలిలో తగినంత నూనె వేసి వడియాలు వేయించి పక్కన ఉంచాలి.
* సొరకాయ తొక్కు తీసి ముక్కలు కోయాలి. 
* ప్రెషర్‌ కుక్కర్‌లో జీలకర్ర వేసి వేగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. 
*తరవాత అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. 
* టొమాటో ముక్కలు ఉడికిన తరవాత వేయించిన వడియాలు వేసి పసుపూ కారం చల్లి కలపాలి. తరవాత సొరకాయ ముక్కలు కూడా వేసి ఓ నిమిషం వేగాక మంచినీళ్లు పోసి ఉప్పు సరిచూసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి దించితే సరి.

సొరకాయ కోఫ్తా

కావలసినవి
కోఫ్తాల కోసం: సొరకాయ: ఒకటి, సెనగపిండి: పావుకప్పు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: 
2 టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: పావుటీస్పూను, నూనె: సరిపడా, మసాలాముద్ద కోసం: ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి: టీస్పూను, టొమాటోలు: రెండు, జీడిపప్పు: పది, నూనె: 2 టీస్పూన్లు; 
కూర కోసం: జీలకర్ర: అరటీస్పూను, పలావు ఆకు: ఒకటి, పసుపు: టీస్పూను, 
కారం: 2 టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, ఉప్పు: తగినంత, పెరుగు: పావుకప్పు, కసూరిమెంతి: టీస్పూను, గరంమసాలా: టీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* ముందు సొరకాయ తొక్కు తీసి సన్నగా తురిమి నీళ్లు పిండి, ఆ నీళ్లను పక్కన ఉంచాలి. తురుములో సెనగపిండి, ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలిపి ఉండల్లా చుట్టి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి. 
*  నాన్‌స్టిక్‌ పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత టొమాటోలు కూడా వేసి వేయించాలి. చల్లారాక ముద్దలా నూరాలి. పాన్‌లో నూనె వేసి జీలకర్ర, పలావుఆకు వేసి వేగాక పసుపు, కారం వేసి కలపాలి. తరవాత టొమాటో పేస్టు వేసి వేయించాలి. ఇప్పుడు దనియాలపొడి, ఉప్పు వేసి పిండిన సొరకాయ నీళ్లు, పెరుగు వేసి కలుపుతూ ఉడికించాలి. చివరగా కసూరిమెంతి, గరంమసాలా వేసి దించాక అందులో వేయించిన కోఫ్తాలు వేసి కొత్తిమీర తురుము చల్లితే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని