క్యాప్సికమ్‌తో కమ్మకమ్మగా..!

బాణలిలో టేబుల్‌స్పూను నీళ్లు పోసి కాగాక క్యాప్సికమ్‌ ముక్కలు వేసి, ఉప్పు చల్లి ఓ రెండు నిమిషాలు ఉడికించి తీసి పక్కన ఉంచాలి.

Published : 26 Jun 2021 17:03 IST

ఆలూ క్యాప్సికమ్‌

కావలసినవి
బంగాళాదుంపలు: రెండు, క్యాప్సికమ్‌: పావుకిలో, టొమాటో: రెండు, ఉల్లిపాయలు: రెండు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, అల్లం తురుము: అర టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, దనియాలు: టేబుల్‌స్పూను,
జీలకర్ర: అరటీస్పూను, గరంమసాలా: 2 టీస్పూన్లు, కారం: 4 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
* మిక్సీ జార్‌లో టొమాటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, దనియాలు, జీలకర్ర అన్నీ వేసి పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
* బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను నీళ్లు పోసి కాగాక క్యాప్సికమ్‌ ముక్కలు వేసి, ఉప్పు చల్లి ఓ రెండు నిమిషాలు ఉడికించి తీసి పక్కన ఉంచాలి.
* తరవాత మిగిలిన నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు, గరంమసాలా వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన టొమాటో ముద్ద కూడా వేసి సిమ్‌లో  పెట్టి అంచుల్లో నూనె తేలే వరకూ మగ్గనివ్వాలి.
తరవాత ఉడికించి పక్కన ఉంచిన బంగాళాదుంప, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి, పావు కప్పు నీళ్లు పోసి మీడియం మంటమీద దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించాలి.

క్యాప్సికమ్‌ టొమాటో

కావలసినవి
క్యాప్సికమ్‌: నాలుగు, టొమాటోలు: ఆరు, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, ఉప్పు: తగినంత, దనియాల పొడి: టీస్పూను, కారం: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కొబ్బరితురుము: ముప్పావుకప్పు, అల్లం తురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, జీలకర్ర: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. క్యాప్సికమ్‌, టొమాటోలు చిన్న ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరవాత ఉప్పు వేసి కలిపి టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు దనియాలపొడి, కారం, పసుపు వేసి కలిపి మూతపెట్టి టొమాటోలు ఉడికేవరకూ ఉంచాలి. తరవాత కొబ్బరి ముద్ద వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసి కలపాలి. అవి కాస్త మగ్గిన తరవాత కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టి ఉడికించాలి. అవి కాస్త ఉడికిన తరవాత అవసరమైతే మరో పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.

క్యాప్సికమ్‌ మసాలా కూర

కావలసినవి
క్యాప్సికమ్‌: పావుకిలో, దనియాలు: రెండు, కొబ్బరి తురుము: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: నాలుగు, నువ్వులు: టేబుల్‌స్పూను, పల్లీలు: పావుకప్పు, జీలకర్ర: అరటీస్పూను, ఉల్లిపాయ: రెండు, వెల్లుల్లి: పది రెబ్బలు, కారం: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, నిమ్మరసం: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* దనియాలు, కొబ్బరితురుము, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ సిమ్‌లో వేయించి తీయాలి. పల్లీలు కూడా వేయించాలి. ఇవన్నీ చల్లారాక పొడి చేయాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు వేసి ఉప్పు చల్లి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరవాత పసుపు, కారం వేసి కలపాలి. మసాలాపొడి కూడా వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు వేగాక సుమారు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా దించేముందు నిమ్మరసం పిండాలి.

కార్న్‌ క్యాప్సికమ్‌ పనీర్‌ మసాలా

కావలసినవి
స్వీట్‌కార్న్‌ గింజలు: కప్పు, పనీర్‌: 200గ్రా., క్యాప్సికమ్‌: రెండు, ఉల్లిపాయలు: రెండు, టొమాటో గుజ్జు: అరకప్పు, అల్లంవెల్లుల్లి: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, కసూరి మెంతి: టేబుల్‌స్పూను, పంచదార: అరటీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
* స్వీట్‌కార్న్‌ గింజలు ఉడికించి దించాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, దనియాలపొడి వేసి ఓ నిమిషం వేగాక టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. తరవాత ఉడికించిన స్వీట్‌కార్న్‌, పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. తర్వాత ఉప్పు, పంచదార, గరంమసాలా వేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోసి కసూరి మెంతి చల్లి మూతపెట్టి దగ్గరగా అయ్యేవరకూ సిమ్‌లో ఉడికించి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని