విలువల వృక్షం... గోద్రెజ్‌ కుటుంబం!

విభజన అనివార్యం అయినప్పుడు..చిరునవ్వుతో విడిపోవాలి. పంపకం తప్పనిసరి అయినప్పుడు.. ఆస్తుల్ని మిఠాయిల్లా పంచుకోవాలి. ఎవరి బిజినెస్‌ వారిదే. కానీ, ఎవరూ ఎవరికీ శత్రువు కాదు. ఎవరి ఎదుగుదల వారిదే. కానీ, ఎవరూ ఎవర్ని చూసీ అసూయపడరు.

Updated : 26 May 2024 08:26 IST

విభజన అనివార్యం అయినప్పుడు..చిరునవ్వుతో విడిపోవాలి. పంపకం తప్పనిసరి అయినప్పుడు.. ఆస్తుల్ని మిఠాయిల్లా పంచుకోవాలి. ఎవరి బిజినెస్‌ వారిదే. కానీ, ఎవరూ ఎవరికీ శత్రువు కాదు. ఎవరి ఎదుగుదల వారిదే. కానీ, ఎవరూ ఎవర్ని చూసీ అసూయపడరు. రెండు వ్యాపార సామ్రాజ్యాలు, ఒకటే ఆత్మ. ఇదే, గోద్రెజ్‌ నినాదం! ఆస్తిపాస్తుల్ని పంచుకున్న విధానం!

ఉమ్మడి కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు.. కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తాయి. అన్నదమ్ములు ఆగర్భశత్రువుల్లా మారిపోతారు. జానెడు భూమి జగడాలకు కారణం అవుతుంది. తులం బంగారం తీవ్ర వైరానికి ఉసి గొల్పుతుంది. తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. హద్దులు మీరిన ఆవేశంలో హత్యలకు తెగబడతారు. ఆపైన తీరిగ్గా కోర్టుల చుట్టూ తిరుగుతారు. సంపద విలువ పెరిగేకొద్దీ విభజన ప్రక్రియ మరింత సంక్లిష్టం అవుతుంది. ఇక, వ్యాపార కుటుంబాల్లో అయితే.. పంపకాలు పతనానికి తొలిమెట్టు అవుతున్నాయి. తాత దార్శనికుడు, తండ్రి కుబేరుడు, పిల్లలు దివాలాకోర్లు.. అన్నట్టుగా తయారవుతోంది వ్యవహారం. రాజకీయాల్లో హత్యలేకాని ఆత్మహత్యలు ఉండవని అంటారు. ఈ మాట వ్యాపార పరివారాలకూ వర్తిస్తుంది. ఎవరి కొమ్మను వాళ్లే నరుక్కుంటున్నారు. చేజేతులా మహావృక్షాన్ని కూల్చేసుకుంటున్నారు. మురుగప్ప, బిర్లా, కిర్లోస్కర్‌, ఫినలెక్స్‌... వారసుల గొడవలతో రచ్చకెక్కిన కంపెనీలు చాలానే ఉన్నాయి. నూటపాతికేళ్ల గోద్రెజ్‌ కుటుంబంలోనూ ఏదో ఒకరోజు తలనొప్పులు మొదలవుతాయనీ, దాయాదులు సిగపట్లు పట్టుకుంటారనీ కార్పొరేట్‌ ప్రత్యర్థులు ఆశగా ఎదురు చూశారు. కానీ, అత్యంత సున్నితమైన ఆస్తుల విభజన ఘట్టం చాలా ప్రశాంతంగా ముగిసిపోయింది. గొడవల్లేవు. గోలల్లేవు. వివాదాల్లేవు. విమర్శల్లేవు. ద్రోహం చేశారంటూ కళ్లెర్రజేయడాలూ, వెన్నుపోటు పొడిచారంటూ ముక్కు చీదుకోవడాలూ అస్సలు లేవు. పంపకాల్లోని ఆ పరిణతికి కారణం.. విలువలతో కూడిన పెంపకం. బంధాల పట్ల నమ్మకం. వారసత్వమంటే గౌరవం. నాలుగుతరాల గోద్రెజ్‌ వ్యాపార సామ్రాజ్యానికి కుటుంబమే కేంద్రబిందువు. ‘మై ఫ్యామిలీ ఈజ్‌ ద మోస్ట్‌ ఇంపార్టెంట్‌ థింగ్‌ ఇన్‌ మై లైఫ్‌’ అంటారు గోద్రెజ్‌ పరివార భీష్మ పితామహుడు ఆది బుర్జోర్జీ గోద్రెజ్‌.      

పూల్‌ మఖానా... పోషకాలు తెలిస్తే అస్సలువదలరు

అనుభవాలే పాఠాలు

గోద్రెజ్‌ కాలుపెట్టని రంగం లేదు. చేపట్టని వ్యాపారం లేదు. ఎందుకో, ఓ దశలో సౌందర్య సాధనాల విభాగంలో అమ్మకాలు మందగించాయి. దిగ్గజాలంతా ఓ దగ్గర కూర్చుని ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. వాణిజ్య ప్రకటనలు హోరెత్తించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను గోద్రెజ్‌ కుటుంబంలోని కొత్తతరం మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్‌కు అప్పగించారు. ఆ యువకుడు కొన్ని కాన్సెప్ట్స్‌ సిద్ధం చేసుకుని చైర్మన్‌ను కలవడానికి వెళ్లాడు. వాటిని చాలాసేపు పరిశీలించాక.. గొంతు సవరించుకున్నారాయన. ‘‘ఓ విషయం చెప్పమంటావా? అప్పటికింకా దేశానికి స్వాతంత్య్రం రాలేదు. మన వ్యవస్థాపకులు.. అర్దేశిర్‌ గోద్రెజ్‌ శస్త్రచికిత్స ఉపకరణాల వ్యాపారం చేసేవారు. ఆ రోజుల్లో, ‘మేడ్‌ ఇన్‌ గ్రేట్‌ బ్రిటన్‌’ ముద్ర లేకపోతే ఎంత నాణ్యమైన సరుకైనా నాసిరకం కిందే లెక్క. మనవేమో మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులు. దీంతో గోద్రెజ్‌ ఉపకరణాల్ని వైద్యులు దూరం పెట్టేవారు. ఫలితంగా విక్రయాలు పడిపోయాయి. ఏదో ఓ బ్రిటన్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని.. మీరు కూడా మేడ్‌ ఇన్‌ ఇంగ్లండ్‌ ముద్ర వేసుకోవచ్చు కదా!.. అని సలహా ఇచ్చారు చాలామంది. అయినా అర్దేశిర్‌ ఒప్పుకోలేదు. దుకాణం మూసుకున్నారే కానీ, దారి మార్చుకోలేదు. నమ్మిన విలువలను వదులుకోలేదు. అందమైన భాషలో చెప్పినా అబద్ధం అబద్ధమే. వ్యాపారంలో పారదర్శకత ముఖ్యమని గుర్తుంచుకో.. మై డియర్‌ యంగ్‌ ఫ్రెండ్‌!’’ అంటూ ఆ కాగితాల్ని వెనక్కి ఇచ్చారు. సుతిమెత్తగానే అయినా, సూటిగా విలువల పాఠం బోధించారు. గోద్రెజ్‌ పెద్దలు తమ వారసులకు నాయకత్వ సూత్రాలు నేర్పించే పద్ధతి ఇలానే ఉంటుంది.

ఓ శతాబ్దపు ప్రయాణం

నూట ఇరవై ఏడేళ్ల క్రితం.. అర్దేశిర్‌ బి. గోద్రెజ్‌ అనే న్యాయవాది గోద్రెజ్‌ వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు వేశారు. మొదట్లో చాలా వ్యాపారాలే చేశారాయన. కానీ, ఒక్కటీ నిలబడలేదు. సరిగ్గా ఆ సమయంలోనే, ముంబయి నగరంలో దొంగతనాలు పెచ్చుపెరిగాయి. మార్కెట్‌ను నాణ్యమైన తాళాల కొరత వేధిస్తోందని అర్దేశిర్‌కు అర్థమైపోయింది. తమ్ముడి వరుసైన పిరోజ్‌ షాతో కలిసి అడుగు ముందుకేశారు. ఆ తర్వాత ఇనప్పెట్టెల తయారీ మొదలు పెట్టారు. అర్దేశిర్‌కు వారసుల్లేరు. పిరోజ్‌ షాకు మాత్రం నలుగురు కొడుకులు. వారిలో ఒకరికి సంతానం లేదు. మిగిలిన ముగ్గురి పిల్లలు, ఆ పిల్లల పిల్లలు.. మొత్తంగా నాలుగుతరాలు పుట్టుకొచ్చాయి. వ్యాపారం తోపాటు పరివారమూ పెరిగిపోయింది. ప్రస్తుతం, మూడోతరానికి చెందిన తోబుట్టువులు ఆది-నదీర్‌ గోద్రెజ్‌ సంతానం ఒక పక్షంగా, వారి చిన్నాన్న పిల్లలు జంషెడ్‌-స్మిత వారసులు మరో పక్షంగా ఆస్తుల పంపకాలు జరిగాయి. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, గోద్రెజ్‌ ఎంట్రప్రైజెస్‌ గ్రూప్‌గా సంస్థను విభజించుకున్నారు. లిస్టెడ్‌ కంపెనీలు, నాన్‌లిస్టెడ్‌ కంపెనీలు, ముంబయి శివార్లలోని మూడువేలా నాలుగొందల ఎకరాల భూమి, వివిధ నగరాల్లోని భవనాలు, వెండి- బంగారాలు.. ఇలా సమస్త సంపదనూ వివాదాలకు తావులేకుండా
పంచుకున్నారు. కంపెనీ లోగోపైన ఇరు వర్గాలకూ హక్కు ఉంటుంది. దాంతోపాటే గోద్రెజ్‌ ప్రమాణాల్ని నిలబెట్టాల్సిన బాధ్యతా ఉంటుంది. ‘నిజానికి ఇది ఆస్తుల పంపకం కాదు. కాలానికి తగినట్టు పునర్వ్యవస్థీకరణ మాత్రమే’ అని స్పష్టం చేసింది గోద్రెజ్‌ కుటుంబం తన పత్రికా ప్రకటనలో సబ్బులు, దోమల నివారిణులు, జుత్తు రంగులు తదితర వినియోగ వస్తువుల తయారీ మొదలు.. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌, హెల్త్‌కేర్‌ ఎక్విప్‌మెంట్‌ వరకూ అనేక రంగాలకు విస్తరించింది గోద్రెజ్‌. టాటాలూ, అంబానీలతో పోలిస్తే.. గోద్రెజ్‌ మార్కెట్‌ వాటా కొంత తక్కువే కావచ్చు. అంత మాత్రాన అది మందగమనం కానేకాదు, ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న విధానం. ‘ఎంత వేగంగా వెళ్లామన్నది కాదు. ఎంత బలంగా అడుగులు వేశామన్నదే ముఖ్యం’ అని వివరిస్తారు నదిర్‌ గోద్రెజ్‌.

సాధారణ జీవనశైలి..

గోద్రెజ్‌ కుటుంబం విలాసాలను ఇష్టపడదు. ఖరీదైన జీవనశైలి పట్ల మక్కువా తక్కువే. వాణిజ్య రాజధానిలో సర్వసాధారణమైన సెలెబ్రిటీ పార్టీలకు సాధ్యమైనంత దూరంగా ఉంటుంది. విందులైనా, వినోదాలైనా.. కుటుంబ సభ్యుల మధ్యనే. ప్రతి ఒక్కరూ జొరాస్ట్రియన్‌ సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు. మాంసం ముట్టుకోరు. అందులోనూ ఆది గోద్రెజ్‌ జీవనశైలి మరింత నిరాడంబరం. వీలైనంత వరకూ ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. తన లగేజీ తానే మోస్తారు. ‘ఆయన మధ్యాహ్న భోజనం కూడా క్యాంటీన్‌లోనే. యజమాని, ఉద్యోగి ఒకే టేబుల్‌ మీద కూర్చుని తినే అరుదైన దృశ్యాన్ని గోద్రెజ్‌ కార్యాలయంలో చూడొచ్చు’ అంటారు గోద్రెజ్‌ కన్‌జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మాజీ ఎండీ వివేక్‌ గంభీర్‌. ‘ప్రతి ప్రాణికీ జీవించే స్వేచ్ఛ ఉంది. మన పొట్ట నింపుకోడానికి ఇంకో జీవి కడుపు కోయడం న్యాయమేనా? మన ముత్తాతలు దేశంలోనే మొట్టమొదటి శాకాహార సబ్బును తయారు చేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌. అనీబిసెంట్‌ కూడా ప్రచారం చేశారు. ఇంతకీ ఆ సబ్బు పేరేమిటో తెలుసా? చవీ. అదే ఆ తర్వాత సింథాల్‌గా ప్రసిద్ధమైంది’ అంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పిల్లలకు శాకాహార ప్రాధాన్యాన్నీ, కుటుంబ విలువల గొప్పతనాన్నీ బోధిస్తుంటారు గోద్రెజ్‌ అమ్మలూ, నానమ్మలూ.

ఎవరైనా సరే..

గోద్రెజ్‌ పరివారం వ్యాపారాన్నీ, కుటుంబాన్నీ వేరు చేసి చూస్తుంది. ఏ హార్వర్డ్‌ నుంచో పట్టా అందుకుని వచ్చేసరికి.. వారసుల కోసం కంపెనీలు సిద్ధం చేసి పెడుతుంటాయి కొన్ని వ్యాపార కుటుంబాలు. ఇక్కడ మాత్రం అలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు. ఎవరైనా సరే,  ట్రైనీగా చేరాల్సిందే. శిక్షణ సమయంలో పనితీరు సంతృప్తికరంగా అనిపిస్తే.. ఓ కుటుంబ పెద్ద, ఓ సీనియర్‌ ఉద్యోగి, ఓ బయటి నిపుణుడు.. మెంటారింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు. లేకపోతే అదీ లేదు. ఇప్పటికే ఆ కుటుంబ పాఠశాల చాలామందిని తీర్చిదిద్దింది. ఆది గోద్రెజ్‌ ముగ్గురు పిల్లలూ ఆ కార్ఖానాలో మెరుగులు దిద్దుకున్న మేలిమి మాణిక్యాలే. తాన్యా బ్రాండింగ్‌ నిపుణురాలు. అనేక గ్రూప్‌ కంపెనీలకు డైరెక్టర్‌. సరుకుల డెలివరీ సంస్థ.. బిగ్‌ బాస్కెట్‌ తన ఆలోచనతోనే ప్రాణం పోసుకుంది. నిసాబా హార్వర్డ్‌లో ఎంబీఏ చేసింది. వినియోగ వస్తువుల వ్యాపారాన్ని పర్యవేక్షిస్తోంది. గోద్రెజ్‌ గ్రూప్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఆమె కెరీర్‌ ఆరంభమైంది. తనయుడు పిరోజ్‌.. రియల్‌ ఎస్టేట్‌ బాధ్యతలు చూస్తున్నాడు. నాలుగో తరానికి చెందిన నైరికా హోల్కర్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకుని వచ్చి.. కంపెనీ న్యాయ వ్యూహాలకు పదునుపెడుతోంది. ‘ఫలానా బాధ్యతలు స్వీకరించమనో, ఫలానా సీట్లో కూర్చోమనో మేం ఎవరినీ ఒత్తిడి చేయం. ఆసక్తి ఉంటేనే అవకాశం ఇస్తాం. తమను తాము నిరూపించుకుంటేనే పదోన్నతి కల్పిస్తాం’ అని స్పష్టం చేస్తారు ఆది గోద్రెజ్‌. ఆ స్వేచ్ఛ ఉండబట్టే.. గోద్రెజ్‌ పరివారంలో మూడోతరానికి చెందిన రిషద్‌ (వ్యవస్థాపకుడు పిరోజ్‌ షా మనవడు) కార్పొరేట్‌ ప్రపంచానికి దూరంగా బతికేస్తున్నారు. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. రచయితగా గౌరవం సంపాదించారు. అలా అని గోద్రెజ్‌ కుటుంబ పెద్దలు ఆయన్ని చిన్నచూపు చూడలేదు. న్యాయంగా రావాల్సిన ఏడువేల కోట్ల రూపాయల వాటాను పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. బ్రహ్మచారి అయిన రిషద్‌ తన ఆస్తిలో చాలా భాగాన్ని కుటుంబ సభ్యులకు రాసిచ్చాడు. మిగిలిన మొత్తంతో సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనేది తన ఆలోచన.

బంధాలు పదిలం

కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో.. వ్యాపార సమస్యలు కుటుంబంలోకి చొచ్చుకొస్తాయి. కుటుంబ సమస్యలు వ్యాపారంలోకి చొరబడతాయి. ఫలితంగా బ్రాండ్‌ విలువ దెబ్బతింటుంది. బంధాలు బీటలువారతాయి. ఆ అసంతృప్తినీ, ఆవేశాన్నీ మనసులో మురగబెట్టుకున్నా కష్టమే. ఏదో ఒకరోజు ఆ ఉద్వేగాలు లావాలా పెల్లుబుకుతాయి. సమస్య అంతవరకూ రాకుండా గోద్రెజ్‌ పరివారం ఓ స్పీడ్‌ బ్రేకర్‌ను తయారు చేసుకుంది. ఫ్యామిలీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసింది. ప్రతి గురువారం మధ్యాహ్నం గోద్రెజ్‌ కుటుంబ సర్వ సభ్య సమావేశం జరుగుతుంది. బోర్డ్‌ మీటింగ్‌ను వాయిదా వేసుకుని అయినా సరే అందరూ హాజరవుతారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అందులో సభ్యులే. సంస్థ నిర్వహణ, నిర్ణయాలు, వైఫల్యాలు.. ఇలా అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఏ చిన్న సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. కొత్త ఆలోచనలుంటే పంచుకోవచ్చు. సమాధానం చెప్పాల్సినవాళ్లు చెబుతారు. వివరణ ఇవ్వాల్సినవాళ్లు ఇస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి ఏ కుటుంబంలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమే. గోద్రెజ్‌ పరివారమూ అందుకు మినహాయింపు కాదు. కొన్నిసార్లు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో కూడా సమస్యకు పరిష్కారం దొరకదు. మరింత లోతైన చర్చ అవసరం అవుతుంది. ఇంకొంత స్పష్టత తప్పదనిపిస్తుంది. అలాంటప్పుడు, బయటి నిపుణుల సహకారం తీసుకుంటారు. కొన్నాళ్ల క్రితం, ముంబయి శివార్లలోని వేలాది ఎకరాల భూమి విషయంలో దాయాదులు తలో వాదనా లేవనెత్తారు. దీంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ సూచనల ఆధారంగా సమష్టి నిర్ణయం తీసుకున్నారు.

సెలెబ్రిటీల ఇంట్లో మనమూ ఉందామా!

చాలా వ్యాపార పరివారాలు అంతర్జాతీయ నిపుణులతో కుటుంబ రాజ్యాంగం రాయించుకుంటాయి. లాభాల పంపకం నుంచి ఆస్తుల విభజన వరకూ ఆ ప్రకారమే వెళ్తారు. గోద్రెజ్‌ పెద్దలకు ఆ పద్ధతి నచ్చదు. ‘వ్యాపారానికైనా, కుటుంబానికైనా మరీ అంత కచ్చితమైన నియమావళి అవసరం లేదు. మార్పుచేర్పులకు అవకాశం ఉండాలి’ అంటారు ఆది. నిజమే, ఆ మార్పు తీర్పును గౌరవించడానికే.. గోద్రెజ్‌ తనను తాను రెండుగా విభజించుకుంది. వ్యాపారంగా విడిపోయినా.. కుటుంబంగా కలిసుండాలని నిర్ణయించుకుంది.

 

పంచసూత్రాలు!

మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌ వ్యాపార విజయానికి ఏం చేయాలో చెబుతాయి. కానీ, గోద్రెజ్‌ కుటుంబం ఏం చేయకూడదో కూడా బోధిస్తుంది. ముత్తాతలు, తాతలు.. విలువలకు కట్టుబడిన తీరును వివరిస్తుంది. ‘మా వారసత్వమే మాకు బలం. ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు మేం మాలాగా ఆలోచించం. మా పూర్వీకుల్లా ఆలోచిస్తాం. మా స్థానంలో వాళ్లే ఉంటే ఎలా స్పందిస్తారనే కోణంలో ఆలోచిస్తాం’ అంటారు మూడోతరానికి చెందిన నిసాబా గోద్రెజ్‌. ఆ కుటుంబం మూలాలను అంతగా గౌరవిస్తుంది. గోద్రెజ్‌ కుటుంబానికి ఓ నైతిక నియమావళి ఉంది. అలా అని, ఎవరూ దాన్ని పాఠంలా బోధించరు. కూర్చోబెట్టి బట్టీ పట్టించరు. పెద్దలు కచ్చితంగా ఆచరిస్తారు. పిల్లలు స్వచ్ఛందంగా అనుసరిస్తారు. గోద్రెజ్‌ పంచసూత్రాలు ఇవే.

నమ్మకం.. మనల్ని మనం నమ్మినంతగా తోటి మనుషుల్నీ నమ్మాలి. ఏ బంధానికైనా నమ్మకమే ప్రధానం.
గౌరవం.. వయసు, విద్యార్హత, నైపుణ్యం, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తీ గౌరవనీయుడే.
బాధ్యత.. విజయాన్ని నలుగురితో పంచుకోవాలి. వైఫల్యానికి మాత్రం మనమే బాధ్యత తీసుకోవాలి.
సంతృప్తి.. వ్యాపారంలో అంకెలు కీలకమే. కానీ, సంతృప్తి అంతకంటే ముఖ్యం.
ధైర్యం.. నీ ఆలోచనల్లో చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. దేనికీ bభయపడాల్సిన పన్లేదు.

గోద్రెజ్‌ కుటుంబ సమావేశాలన్నీ పార్సీ సంప్రదాయ ప్రార్థన తర్వాతే ఆరంభం అవుతాయి. ఆ ప్రార్థనలో ‘ప్రభూ! మాకు ఉన్నతమైన ఆలోచనలు ప్రసాదించు. ఆ ఆలోచనలు అత్యుత్తమ నిర్ణయాలకు స్ఫూర్తినిచ్చేలా చూడు’ అని పరమాత్మను వేడుకుంటారు.


ఎన్నో ప్రత్యేకతలు

తొలి సార్వత్రిక ఎన్నికలకు వాడిన బ్యాలెట్‌ బాక్సులను గోద్రెజ్‌ సంస్థే తయారు చేసి ఇచ్చింది.

  • స్ప్రింగు ఉపయోగించకుండా తాళాన్ని తయారు చేసిన తొలి సంస్థ గోద్రెజ్‌. ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ పేటెంట్‌ తీసుకుంది.
  • ఒక తాళం, రెండు చెవులు.. గోద్రెజ్‌ వినూత్న సృష్టి. రెండు చెవులూ ఉంటేనే ఆ తాళాన్ని తీయగలం. భాగస్వామ్య వ్యాపారాలకు బాగా పనికొస్తుంది.
  • గోద్రెజ్‌ అత్యుత్తమ పని ప్రదేశాల జాబితాలో ముందువరుసలో ఉంటుంది.
  • తొలి భారతీయ టైప్‌ రైటర్‌, తొలి దేశీ రిఫ్రిజిరేటర్‌ గోద్రెజ్‌ కానుకలే.
  • తొలి హెయిర్‌ డై కూడా గోద్రెజ్‌ ఉత్పత్తే.
  • గోద్రెజ్‌ వ్యవస్థాపకులు స్వాతంత్య్ర పోరాట సమయంలో తిలక్‌ నిధికి  మూడు లక్షలు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం.
  • భారత సర్కారు ఇద్దరు గోద్రెజ్‌ పెద్దలు... షోరబ్‌ పిరోజ్‌ షా, ఆది గోద్రెజ్‌లను పద్మభూషణ్‌తో ఘనంగా గౌరవించింది.
  • 1997లో గోద్రెజ్‌ వందేళ్ల పండుగ జరుపుకొంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..