Waterfalls: ప్రకృతి సోయగం.. ఇదో అద్భుత దృశ్యం.. ‘రివర్స్‌ ఫ్లో’ జలపాతం చూశారా..?

వేసవి వెళ్లిపోయి రుతుపవనాలు రాగానే వృక్షజాలం, జంతుజాలం​తిరిగి జీవం పోసుకుంటుంది. వర్షపు చినుకులు కొత్తందాలకు రూపం పోస్తాయి........

Published : 13 Jul 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వేసవి వెళ్లిపోయి రుతుపవనాలు రాగానే వృక్షజాలం, జంతుజాలం​ తిరిగి జీవం పోసుకుంటుంది. వర్షపు చినుకులు కొత్తందాలకు రూపం పోస్తాయి. వాగులు, వంకలు, జలపాతాలు ఇలా.. ఎన్నో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మహారాష్ట్ర నానేఘాట్‌లోని ఓ జలపాతం విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కొండపై నుంచి జాలువారే జలపాతం కిందకు పారుతుంది.. కానీ, నానేఘాట్‌లోని ఈ జలపాతం నీరు మాత్రం పైకి వెళ్లడం విశేషం. జలపాతం ఎత్తులో ఉండటం, తీవ్ర గాలుల కారణంగా నీరు నేరుగా కిందపడకుండా పైకి వెళుతూ నెమ్మదిగా కిందపడుతోంది.

‘గాలి వేగం పరిమాణం సమానంగా.. గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు పశ్చిమ కనుమల పరిధి నానేఘాట్‌లోని ఈ జలపాతం అద్భుతం’  అంటూ ఓ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి సుసాంతా నందా ట్విటర్‌లో పంచుకున్నారు. చుట్టూ పచ్చదనం, ఆ జలపాతం సోయగాలను చూసిన నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 3.6లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘నేను ఈ ప్రాంతాన్ని సందర్శించా. ఇది భూతల స్వర్గం’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఒక్కసారైనా ఈ ప్రాంతంలో పర్యటించాలి’ అని మరికొందరు తమ కోరికను వెలిబుచ్చుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని