Viral Video: ‘జూ’లో జంతువులనూ ఎత్తుకెళ్లారు.. వీడియోలు వైరల్‌!

దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ నుంచి రష్యన్‌ సేనలు ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే. అప్పటికే నగరంలో విధ్వంసం సృష్టించిన మాస్కో బలగాలు.. చివరకు స్థానిక ‘జూ’ నుంచి జంతువులనూ ఎత్తుకెళ్లడం గమనార్హం. తోడేళ్లు, నెమళ్లు, రకూన్‌లు, లామాలు, గాడిదలు తదితర జంతువులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు.

Published : 16 Nov 2022 02:18 IST

కీవ్‌: దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ నుంచి రష్యన్‌ సేనలు ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే. అప్పటికే నగరంలో విధ్వంసం సృష్టించిన మాస్కో బలగాలు.. చివరకు స్థానిక జూ(Kherson Zoo)  నుంచి జంతువులనూ ఎత్తుకెళ్లడం గమనార్హం. తోడేళ్లు, నెమళ్లు, రకూన్‌లు, లామాలు, గాడిదలు తదితర జంతువులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు మూగ జీవాలతో రష్యన్‌ సైనికులు ప్రవర్తించిన తీరును ఉక్రెనియన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వాటితో క్రూరంగా వ్యవహరించినట్లు విమర్శిస్తున్నారు.

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రికి సలహాదారుగా ఉన్న అంటన్ గెరాష్చెంకో సైతం ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. లామా అనే జంతువును ఓ వాహనంలో ఎక్కిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. స్థానిక జూ నుంచి ఓ రకూన్‌ను ఎత్తుకెళ్లడం.. అత్యంత విలువైన దోపిడీగా ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు.. నగరంలోనూ రష్యా బలగాలు అందినకాడికి విలువైన వస్తువులు దోచుకుని పారిపోయినట్లు స్థానిక అధికారులు ఆరోపిస్తున్నారు. ‘జంతువులే కాదు.. వస్తు ప్రదర్శనశాలల నుంచి అనేక కళాఖండాలు, ఆర్ట్‌ గ్యాలరీల్లోని పెయింటింగ్స్‌, గ్రంథాలయాల్లోని చారిత్రక పుస్తకాలు, ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలు, ఇలా.. అన్నింటినీ ఎత్తుకెళ్లారు’ అని తెలిపారు.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని