ఉద్యోగాల గ్యారేజీ..

బోయపల్లి.. కనీస సౌకర్యాలూ లేని చిన్న ఊరు... అయితే ఏంటట? ఇది ప్రభుత్వ ఉద్యోగాల గ్యారేజీ... ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇక్కడ ఏకంగా 48 మంది సర్కారీ కొలువులు సాధించారు... అదీ నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లకుండానే.. వేలకు వేలు ఖర్చు చేయకుండానే...

Published : 15 Feb 2020 01:06 IST

విన్నర్స్‌

బోయపల్లి.. కనీస సౌకర్యాలూ లేని చిన్న ఊరు... అయితే ఏంటట? ఇది ప్రభుత్వ ఉద్యోగాల గ్యారేజీ... ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇక్కడ ఏకంగా 48 మంది సర్కారీ కొలువులు సాధించారు... అదీ నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లకుండానే.. వేలకు వేలు ఖర్చు చేయకుండానే... నలుగురు యువకుల ఆలోచన, కృషికి ప్రతిఫలంగా  ఆ ఊరు కొలువుల ఖిల్లాగా మారింది.

ది మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి ఘనత. చదువుకుని ముప్ఫై, నలభై ఏళ్లు వచ్చినా ఉద్యోగాలు లేని వారు ఇక్కడ పట్టుమని పదిమంది ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంతటి   ఘనత సాధిస్తున్న గ్రామం, ఇక్కడి యువత, ఉద్యోగాలు సాధిస్తున్న తీరు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఆచరించేలా చేస్తోంది. ఓ పాత ఇంట్లోనే ఉద్యోగ సాధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఊర్లోనే ఉంటూ ఉద్యోగ సాధనలో విజేతలుగా నిలుస్తున్నారు. పోటీ పరీక్ష ఫలితాలు వచ్చిన ప్రతిసారీ ఈ గ్రామం నుంచి ఒకరో, ఇద్దరో తప్పకుండా ఎంపికవుతారు. గ్రామంలోని ప్రతి    34 మందిలో ఒకరు ప్రభుత్వోద్యోగి. ఈ విజయ పరంపర ఎలా సాధ్యమైందంటే..?

గ్రామానికి చెందిన సిరికొండ సంతోష్‌, మల్లేష్‌, భాస్కర్‌, రాజేశం అనే నలుగురు యువకులు కొన్నాళ్ల కిందట అటవీశాఖ ఉద్యోగాల కోసం ప్రయత్నం ప్రారంభించారు. ఇందులో భాగంగానే గ్రామంలోని ఒక ఖాళీ ఇంటిని వేదికగా చేసుకుని సాధన మొదలుపెట్టారు. వారు సొంతంగా తయారు చేసుకున్న పరీక్షల మెటీరియల్‌తో కలిసి సాధన ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైంది వీరి ఉద్యోగాల ప్రస్థానం. ఆ గది ఇప్పటివరకు 48 మందికి ఉద్యోగాల దిక్సూచిలా మారింది. బయటి నుంచి చూస్తే అది పాత ఇంటిలానే ఉంటుంది కానీ అదో విజ్ఞాన భాండాగారం. నలుగురితో మొదలై.. ఉద్యోగాలు సాధించేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఏవైనా ఫలితాలు వస్తే చాలు..‘బోయపల్లి నుంచి ఎంత మంది?’ అనేంత ప్రత్యేకతను తీసుకొచ్చారు ఇక్కడి యువత.

సీనియర్ల సలహాలు.. విజేతల సహకారం
ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. సీనియర్లు, గత విజేతలే పోటీ పరీక్షార్థులకు శిక్షకులు, మార్గదర్శకులు. సలహాలు, సూచనలు, పాఠాలు, నమూనా పరీక్షలు అన్నీ వారే. తొలి విడత విజేతల నుంచి ఇప్పటి వరకూ ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరూ తమ సాధన కేంద్రానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. వారికి కనిపించిన పోటీ పరీక్షల పుస్తకాలను కొని కేంద్రంలో ఉంచుతారు. అన్ని పరీక్షలకు సంబంధించిన పెద్దపెద్ద కోచింగ్‌ సెంటర్ల మెటీరియల్‌ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఎవరికి వీలైన సమయంలో వారు వచ్చి బోధన చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఇక్కడ చదువుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు. బృందచర్చలపై శిక్షణనిస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా
వారి గెలుపు పాఠాలను ఔత్సాహికులకు చెబుతూనే ఉంటారు.

- డి.శ్రీనివాసరావు, ఆదిలాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు