Published : 12 Dec 2020 00:57 IST

నవ్వించడంలో..ఎలిమినేట్‌ కాను

నవ్వించేవాళ్లు ఏడుస్తున్నారు. విలన్‌లు హీరోలై పోతున్నారు. అందగత్తె అందరికీ నచ్చట్లేదు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఏం జరుగుతోంది? బయటికొచ్చిన అవినాశ్‌ ఏమంటున్నాడు?
* బిగ్‌బాస్‌ అంటేనే భావోద్వేగాల ఆట. అపరిచితులకి దగ్గరగా, బాహ్య ప్రపంచానికి దూరంగా మూడునెలలు ప్రయాణం చేయాలి. ఇక్కడ నటించడం కుదరదు. కొద్దిరోజులకే అందరి అసలు రూపం బయటికొస్తుంది. కెమెరాలు ఉన్నాయని మొదట్లో నేను జాగ్రత్తగా, బెరుకుగా ఉండేవాణ్ని. తర్వాత అర్థమైంది. మనం మనలాగే ఉండాలని.
* పోటీదారులకు ఇల్లే ప్రపంచం. వేరే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండదు. ఇక్కడున్నవాళ్లే మనవాళ్లు. టాస్కుల ఒత్తిడి ఉంటుంది. ఓట్లు పడతాయో, లేదో అనే టెన్షన్‌ మరోవైపు. ఒక్కసారిగా బరస్ట్‌ అయిపోతాం. బాధగా ఉంటే ఏడ్చేస్తాం. సంతోషం వస్తే బిగ్గరగా నవ్వుతాం. వేరేవాళ్లకిది చిత్రంగా అనిపించవచ్చు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలనుకునే నేను ఫీలింగ్స్‌ని ఆపుకోలేక ఎన్నో సార్లు ఏడ్చేశా.
* ఒకమ్మాయి, అబ్బాయి మధ్య ఆకర్షణ సహజం. ఒకే ఇంటిలో నెలలకొద్దీ ఉన్నప్పుడు, ఎవరైనా మనసుకి నచ్చితే ఇష్టపడటం అంతే సహజం. అది ప్రేమ వరకు వెళ్తుందా.. అభిమానమే చూపించుకుంటారా.. అంటే అది వాళ్లకెదురైన పరిస్థితులు, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయి. అరియానాలో ముక్కుసూటితనం నాకు బాగా నచ్చింది. తను సున్నిత మనస్కురాలు. నాలోనూ తనకూ ఏదో నచ్చి ఉంటుంది. అందుకే మంచి స్నేహితులమయ్యాం.
* నాలాంటి ఆర్టిస్టులకు బిగ్‌బాస్‌ మంచి వేదిక. ఇందులో నా ప్రయాణమంతా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌, బంధాలు, అనుబంధాలతో సాగింది. స్నేహంగా ఉండటం, కష్టాలు పంచుకోవడం, కోపం వ్యక్తం చేయడం, చేసిన తప్పులు దిద్దుకోవడం..లాంటి బతుకు పాఠాలు నేర్చుకున్నా.
* మాది జగిత్యాల జిల్లాలో రాఘవపట్నం. నాకు సినిమా, టీవీలంటే పిచ్చి. అందుకే ఎలాగైనా రాణించాలనుకున్న. మిమిక్రీ నేర్చుకుని, స్టేజీ షోలు ఇస్తూ ముందుకెళ్లా. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డా.
* నేను భగ్న ప్రేమికుడిని. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డా. పెద్దల అంగీకారంతో పెళ్లాడాలనుకున్నాం. తను వెళ్లిపోయింది. ఆ సమయంలో పిచ్చివాడిలా మారిపోయా. తేరుకున్న తర్వాత దూరమైన అమ్మాయి అసూయ పడేలా ఎదగాలనుకున్నా. ఆరోజు తప్పకుండా వస్తుంది.

- తుమ్మల శ్రీనివాస్‌, కరీంనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు