పద్ధతి పాటిస్తేనే ఫిట్‌నెస్‌ హిట్‌!

కసరత్తులు చేయడం.. కండలు పెంచడం.. ఫిట్‌నెస్‌ సాధించడం.. అందరికీ ఇష్టమే. కానీ దీనిపై చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అవేంటి? అసలు కథేంటి? అంటే...

Published : 21 May 2022 00:54 IST

కసరత్తులు చేయడం.. కండలు పెంచడం.. ఫిట్‌నెస్‌ సాధించడం.. అందరికీ ఇష్టమే. కానీ దీనిపై చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అవేంటి? అసలు కథేంటి? అంటే..

ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం.. వ్యాయామంలో హార్డ్‌వర్క్‌ కన్నా స్మార్ట్‌వర్క్‌ బాగా పని చేస్తుంది. ఎంత ఎక్కువసేపు కసరత్తులు చేశాం అన్నది కాదు.. ఎంత ప్రభావవంతంగా, పద్ధతిగా చేశామన్నదే ముఖ్యం. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. 

కసరత్తులు చేయడానికి ఉదయమే ఉత్తమం.. ఎనిమిది గంటల నిద్ర తర్వాత ఉదయం వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న చాలామంది భావన. చుట్టుపక్కల వాతావరణం బాగుంటే, ఏకాగ్రతను దెబ్బ తీయని పరిస్థితులైతే సమయం ఏదైనా ఫర్వాలేదు. క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయం ఎంచుకుంటే మేలు. 

డైట్‌ సరిగా పాటించకపోయినా మంచి వ్యాయామం చేస్తే ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది.. స్వీట్లు, నూనె పదార్థాలు, మసాలాలు, జంక్‌ ఫుడ్‌ బాగా తీసుకొని జిమ్‌లో చెమట్లు చిందిస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు సరైన ఆహారం తీసుకుంటేనే మంచి ఫలితాలొస్తాయి.

కసరత్తులు చేసి ఒంట్లో ఎక్కడంటే అక్కడ కొవ్వు కరిగించుకోవచ్చు. కోరుకున్న చోటే ఒళ్లు పెంచొచ్చు, తగ్గించొచ్చు.. కాస్త కష్టపడితే కండలు పెంచేయొచ్చు, సిక్స్‌ప్యాక్‌గా మలిచేయొచ్చు అనుకుంటారు చాలామంది. కానీ, అంత దృశ్యం లేదు. ఒంట్లోని కండరాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. క్రంచెస్‌ చేస్తుంటే బెల్లీ తగ్గడమే కాదు.. తొడలపై ప్రభావం పడుతుంది. షోల్డర్‌ ప్రెస్‌ వ్యాయామాలు చేతులు, భుజాల్ని దృఢం చేయడమే కాదు.. వీపు కండరాలపై ప్రతికూలంగా పని చేస్తాయి.

వ్యాయామానికి ముందు స్ట్రెచింగ్‌ చేస్తే.. గాయాలు తగ్గిపోతాయి.. ఎలాంటి ఇబ్బందులుండవు.. కసరత్తులకు శరీరం సిద్ధమవడం కోసం చిన్నచిన్న సాగతీత వ్యాయామాలు చేయాలని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇది మంచి అలవాటే. కానీ ఇదొక్కటే గాయాలు, కండరాలు పట్టేయడాన్ని తగ్గించలేదు. సరైన పద్ధతుల్లో కసరత్తులు చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే గాయాల పాలు కాకుండా చేస్తుంది.     

- దినేష్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని