పాతబస్తీలో.. కొత్త గీతం

రాయిలోకి నీరు పంపాలంటే..? ఎడారిలో మొక్కను పెంచాలంటే..? శూన్యంలో పూలు పూయించాలంటే...........? విజ్ఞానమనే నీరు పంపి... నైపుణ్యమనే మొక్క నాటి... ప్రగతి పూలు పూయించే సాహసం చేస్తున్నాడో యువకుడు...

Updated : 31 Dec 2018 16:45 IST

రాయిలోకి నీరు పంపాలంటే..? ఎడారిలో మొక్కను పెంచాలంటే..? శూన్యంలో పూలు పూయించాలంటే...........? విజ్ఞానమనే నీరు పంపి... నైపుణ్యమనే మొక్క నాటి... ప్రగతి పూలు పూయించే సాహసం చేస్తున్నాడో యువకుడు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు అర్షద్‌ షేక్‌. ‘టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోన్న అర్షద్‌.. చిన్నారులు, యువతలో కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నాడు. విద్యావిధానంలో మార్పులకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దిశగా ఎన్నో అడుగులు ముందుకేశాడు. వేస్తున్నాడు.  ఆ అడుగుల వెనుక ఉన్న తపన, కష్టం... విజయం చదివేయండి.

పాతబస్తీలో.. కొత్త గీతం

మనదేశంలో రెండుకోట్ల మంది మదర్సాల్లో చదువుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 20 లక్షల మంది మదర్సాల్లో ఉండొచ్చు. పాత బస్తీలో ఐదువందల మదర్సాలుంటాయి. ఒక్కో దానిలో డెబ్బై నుంచి వంద మంది వరకూ ఉంటారు. ఎనిమిదేళ్ల నుంచి 22 ఏళ్ల వయసు వరకూ విద్యార్థులు చదువుకుంటుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. మనం ఇంటర్‌ డిగ్రీ చదివినట్లు వీళ్లు అరబిక్‌లోనే పీహెచ్‌డీ వరకూ చదువుతారు. చదువయ్యాక వీళ్లు మసీద్‌లకు ఇమామ్‌లు అవ్వొచ్చు, మదర్సాల్లో ఉపాధ్యాయులుగా పని చేయవచ్చు. ఈ చదువులకు సాధారణ యూనివర్సిటీలతో సంబంధం ఉండదు. బయట ఉద్యోగవకాశాలుండవు. ఈ విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు చేయడానికి నడుంబిగించాడు అర్హద్‌. తన టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఓ రిఫరెన్స్‌తో ద్వారా 2015 చివర్లో పాతబస్తీకి వెళ్లగలిగాడు. ‘మేం చదువుకున్నాం. ఇలా ఉన్నాం..’ అని అక్కడివాళ్లకు నచ్చచెబితే ఎవరూ పట్టించుకోలేదు. అయినా వెనుకడగువేయలేదు. పాతిక మదర్సాలకు తిరిగాడు. ఫలితం లేదు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చారని కొందరు అడిగారు. నిరాశకు గురయ్యాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉమన్‌ ట్రాఫికింగ్‌ మీద పనిచేసే సునీత కృష్ణన్‌ ‘కాస్త జాగ్రత్త’ అని చెప్పారు. మొత్తానికి ఇలాంటి క్లిష్టమైన చోటనే పనిచేయాలనుకున్నాడు. ఫౌండేషన్‌ తరఫున వలంటీర్లు వెళ్తే స్థానికులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నవారు భయపడేవారు. అక్కడేం చేసినా రాజకీయం అవుతుందనే వారు. అక్కడ ఉండే కొంతమంది తెలిసిన పెద్దలతో చర్చించాడు. వారి చుట్టూ తిరగ్గా, తిరగ్గా ఆర్నెళ్ల తర్వాత ఆదివారాల్లో సాయంత్రం పిల్లలు ఆడుకునే సమయంలో మీరేదైనా చెప్పుకొంటే చెప్పుకోండని అనుమతిచ్చారు. వెంటనే వాళ్లకు కంప్యూటర్‌, ఇంగ్లీషు మూలాలు నేర్పించే ప్రయత్నం చేశాడు అర్షద్‌. ఒక మదర్సాలోకి ఇతరులను తీసుకెళ్లటానికి రెండేళ్ల సమయం పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారానికి గంటపాటు సమయం అడిగిన అర్షద్‌ తన బృందంతో ఇపుడు పదిహేను కేంద్రాల్లో, పదిహేను మంది టీచర్లతో 450 మందికి ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్పగలుగుతున్నాడు. కంప్యూటర్స్‌, ఇంగ్లీషు వస్తే బయట ఎక్కడైనా ఉపాధి పొందవచ్చనే విషయాన్ని చెబుతున్నారు.

మాలోని ఇరవై మంది స్నేహితులం నెలకు రెండువేలు నుంచి ఐదువేల వరకూ జమ చేసి మూడేళ్లు పనిచేశాం. ఇపుడూ చేయగలుగుతున్నాం. ఇపుడిపుడే మాపై నమ్మకంతో సాయం చేయటానికి కొందరు దాతలు ముందుకొస్తున్నారు. వచ్చే ఏడాది యువతపై దృష్టిపెడతాం. యువత ఖాళీగా ఉండటం వల్ల పెడధోరణి పడుతున్నారు. వారిలోని సామర్థ్యాలను మెరుగు పరచడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. మా వెనకాల మరిన్ని స్వచ్ఛంద సంస్థలు పాతబస్తీకి రావాలి. అన్ని మదర్సాల్లో మార్పు తేవాలి. బాల్యానికి సరైన మార్గనిర్దేశనం చేయాలి. భవిష్యత్తులో పాతబస్తీ సుఖ,సంతోష, శాంతుల నిలయం కావాలి.       - అర్షద్‌

అర్షద్‌ షేక్‌.. విజయవాడకి చెందిన అబ్బాయి. బీటెక్‌ చేశాక ‘యూత్‌ ఫర్‌ సేవ’ అనే ఆర్గనైజేషన్‌లో చేరాడు. పాతబస్తీలాంటి ప్రాంతంలో చురుగ్గా పని చేసే స్వచ్ఛంద సంస్థలు తక్కువని గుర్తించాడు. టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌ స్థాపించాడు. మదర్సాల్లో పూర్తిగా అరబిక్‌లో చదువు కొనసాగుతుంది. ఎనిమిది ఏళ్ల నుంచి పదిహేనేళ్ల పిల్లలకు నూతన విద్యావిధానంలో భాగమైన కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లీషు నేర్పాలన్న లక్ష్యంతో సాగుతున్నాడు.

 

పాతబస్తీలో.. కొత్త గీతం

మార్పు కన్పిస్తోంది 
పార్ట్‌టైం వలంటీర్లు రెండువందల మంది ఫౌండేషన్‌ కోసం పనిచేస్తున్నారు. వీరు వారానికి రెండుసార్లు పిల్లలకు బోధించడానికి వస్తారు. ప్రత్యేక సందర్భాల్లో వచ్చి పనిచేయడానికి రెండువేల మంది వరకూ సహకరిస్తున్నారు. రియల్‌ పేజ్‌ అనే కంపెనీ ద్వారా మదర్సాలకు కంప్యూటర్లు అందాయి. ప్రతి మదర్సాల్లో మూడు నుంచి నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఎమ్‌.ఎస్‌.ఆఫీస్‌, పెయింటింగ్‌ నేర్పిస్తున్నారు. పిల్లలకు ఇంగ్లీషులో చదవటం, రాయటం బోధిస్తున్నారు. ఏడాది క్రితం ‘టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌’ సొంతంగా పదిహేను కేంద్రాలను ప్రత్యేకంగా ప్రారంభించింది. దీని ద్వారా అక్కడ ఉండే పిల్లలు, బడిమానేసిన వారు, మదర్సాలకు వెళ్లే పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం చేపట్టారు. ఈ బృహత్తర బాధ్యతను అక్కడే ఉండి డిగ్రీ చదివే పేద ముస్లిం యువత అప్పచెప్పారు. వారికి నెలనెలా పదిహేను వందల రూపాయలు వేతనంగా చెల్లిస్తున్నారు. వారు కాలేజీ అయిపోయాక సాయంత్రం పిల్లలకు ఇంగ్లీషు నేర్పించేట్లు చేశారు. దీంతోపాటు కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వారాంతాల్లో వలంటీర్లుగా పాతబస్తీకి వస్తుంటారు. టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌ కేంద్రాలతో పాటు ఉర్దూమీడియం పాఠశాలల్లోనూ నెలకు రెండుసార్లు వారాంతాల్లో విజ్ఞాన తరగతులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ కేంద్రాల సంఖ్యను 50 పెంచాలని అనుకుంటున్నాడు. ఇందుకు తగిన ఆర్థిక సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇపుడిపుడే పిల్లల్లో మార్పు వస్తోంది. ఫలానా కోర్సు చదివితే బావుంటుందా? అని అడుగుతున్నారు. వారిలో ఈ మార్పు వచ్చి సమాజంలో మరింత ఉన్నతంగా జీవించే ఆలోచన పుట్టాలనేది ఫౌండేషన్‌ ఆశయం. దీని కోసం ఓ బ్లాగ్‌ నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో విజయం సాధించిన వ్యక్తుల గురించి ఇందులో రాస్తుంటారు. వలంటీర్లు గొప్ప వ్యక్తుల జీవనపోరాటలు వివరిస్తుంటారు. వాళ్లలో స్ఫూర్తినింపాలనే లక్ష్యంతో పనిచేస్తుంటారు.

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని