సొగసులకి గొడుగు పడదాం

వానాకాలం జోరందుకుంది. కుర్రకారు సొగసుల్ని పరుగులు పెట్టిస్తూనే.. సౌకర్యమూ చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Published : 22 Jul 2023 00:52 IST

వానాకాలం జోరందుకుంది. కుర్రకారు సొగసుల్ని పరుగులు పెట్టిస్తూనే.. సౌకర్యమూ చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సీజన్‌లో స్టైల్‌గా ఉండాలంటే ఇంతకీ మనం ఏమేం ధరించాలి? వేటికి దూరంగా ఉండాలి? ఫ్యాషన్‌ గురూలు చెబుతున్నారిలా...

ఫ్యాబ్రిక్‌: చిటపట చినుకులు పడుతున్నప్పుడు చిందులేయాలని కొందరికి ఉంటుంది. ఫ్రెండ్‌ లేదా మనసుకి నచ్చినవాళ్లతో అలా బయటికి వెళ్లి కాఫీనో, టీనో తాగాలనుంటుంది. అలాంటప్పుడు వర్షంలో తడిస్తే.. దుస్తులు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే డిజైన్స్‌, రంగులతో సంబంధం లేకుండా కాటన్‌, ఖాదీ, రేయాన్‌లాంటి ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే తేలికగా ఆరతాయి.

రంగులు: ఈ కాలంలో మరీ నిండైన దుస్తులు ధరించడం అంత సౌకర్యంగా ఉండదు. స్కర్టులు, కుర్తాలు, కుర్తీలు, బెర్ముడా షార్ట్‌లు.. ఇవి సౌకర్యంగా ఉంటాయి. స్టైల్‌గా కనిపిస్తాయి. ఎండ లేని ఈ సమయంలో యెల్లో, ఆరెంజ్‌, నియాన్‌ గ్రీన్‌, పింక్‌లాంటి ముదురు వర్ణాలు, కళ్లకింపుగా ఆకట్టుకునేలా ఉంటాయి. తెలుపు, లేత రంగులు వేస్తే త్వరగా మురికిగా తయారవుతాయి.

పాదరక్షలు: వర్షాకాలంలో ఎక్కువగా తడిచిపోయేవి పాదరక్షలే. తడిచిన వాటిని ఎక్కువ సమయం ధరిస్తే చిరాకుగా ఉంటాయి. త్వరగా ఆరిపోయే ఫ్లిప్‌ఫ్లాప్స్‌ ఎంచుకోవచ్చు. స్పోర్ట్స్‌ షూలు, లెదర్‌ షూలు త్వరగా ఆరవు, దుర్వాసన వస్తుంటాయి. తప్పనిసరిగా షూలు ధరించాల్సి వస్తే.. మార్కెట్లో దొరికే వాటర్‌ప్రూఫ్‌ సాక్సులు ధరించడం మేలు.

ఇవొద్దు: తెలుపు రంగు దుస్తులు, సిల్క్‌, లెదర్‌, జార్జెట్‌, షిఫాన్‌, వెల్వెట్‌లకు నీటిని పీల్చుకొని, ఎక్కువసేపు తేమగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కడికెళ్లినా రెయిన్‌కోట్‌, ట్రెంచ్‌ కోట్‌, ప్లాస్టిక్‌ పోంచోస్‌.. మనతోపాటు ఉంచుకోవాలి. ఇందులోనూ తేలికైన రకం ఎంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని