Published : 14 May 2022 00:40 IST

నవ్విస్తూ.. నీళ్లు తాగిస్తాడు!

ఎండలు మండిపోతున్నాయి.. జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ ప్రమాదం ఉంది. ఈ సమస్యకి పరిష్కారమేంటి? ఎక్కువగా నీళ్లు తాగడమే! ఇదే విషయాన్ని కాస్త వెరైటీగా మీమ్స్‌ రూపంలో చెబుతున్నాడు తిరుపతి యువకుడు మాధవ్‌ సాయి జశ్వంత్‌. ‘వాటర్‌ తాగండి ఫ్రెండ్స్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాడు.. తన సత్ప్రయత్నాన్ని సెలెబ్రిటీలు సైతం పంచుకుంటున్నారు.. సామాజిక మాధ్యమాలతో మంచి పనులు కూడా చేయొచ్చు అని నిరూపిస్తున్న అతగాడు ఈతరంతో మాట కలిపాడు.

మంచి నీటికే మనసుంటే.. దానికే గనక మాట వస్తే.. ఏమవుతుంది? తనని నిర్లక్ష్యం చేస్తున్నవాళ్లని ఏకి పారేస్తుంది. తన ప్రాధాన్యం తెలియనివాళ్లకి మొట్టికాయలు వేస్తుంది. ఇదే కాన్సెప్ట్‌తో హాస్యం, సదాశయం మేళవించి వేలకొద్దీ మీమ్స్‌ రూపొందిస్తున్నాడు మాధవ్‌. అందులో చాలావరకు వైరల్‌ అయ్యాయి. సెల్‌ఫోన్లకు అతుక్కుపోయి నీళ్లు తాగడమే మర్చిపోయే యువతకు ఇవి వినోదం పంచుతూనే బీ2వీ ఆవశ్యకతని గుర్తు చేస్తున్నాయి.

ఇలాంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అని మాధవ్‌ని అడిగితే... ‘నాకు తరచూ నోరు పూసేది. బాగా అలసిపోయేవాణ్ని, కళ్లు పొడిబారేవి. వైద్యుడి దగ్గరికెళ్తే.. ‘సమస్యేం లేదు.. బాగా నీళ్లు తాగితే సరిపోతుంది’ అన్నారు. ఇదేసమయంలో వడదెబ్బతో జనం కొందరు చనిపోవడం గమనించాను. నేను ఇంతకుముందు ‘వాట్‌ మాధవ్‌’, ‘1995 మోడల్‌ బ్రెయిన్‌’ పేరుతో రెండు ఇన్‌స్టా పేజీలు నిర్వహిస్తున్నా. ఈసారి సరదా, మంచి పని కలిసి ఉండేలా పేజీ ప్రారంభించాలనుకున్నా. నీరే ఒక మనిషైతే ఎలా ఆలోచిస్తుంది? అని ఊహించుకొని కొన్ని పంచ్‌ డైలాగ్‌లు రాసుకోవడం మొదలుపెట్టాను. స్నేహితులకి చెబితే చాలా బాగున్నాయన్నారు. అలా ఆ ఆలోచనల్లోంచి మొదలైందే.. ‘వాటర్‌ తాగండి ఫ్రెండ్స్‌’ (డబ్ల్యూటీఎఫ్‌). కొద్దిరోజుల్లోనే పేజీకి 15వేల మంది ఫాలోయర్లు వచ్చారు. ‘సాధారణంగా మనం ఒక మంచి మాట చెప్పినా యూత్‌ పెద్దగా పట్టించుకోరు. వాళ్లకి ఆసక్తి కలిగించేలా మీమ్స్‌ రూపొందించడం మొదలుపెట్టాను. ఉదాహరణకు టాలీవుడ్‌ ప్రభాస్, బాలీవుడ్‌ దీపికా పదుకొనే కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? దీనికి తాగునీరు ముడిపెడుతూ ఓ సరదా మీమ్‌ చేశాను. క్రికెట్, రాజకీయాలు, ప్రేమ, సామాజిక మాధ్యమాలు.. ఇలా అన్ని అంశాలు తీసుకుంటాను’ అంటాడు మాధవ్‌. ఈ మీమ్స్‌ని చూస్తే ఎవరికైనా నీరు తాగాలనే విషయం గుర్తొచ్చి తీరుతుందంటాడు. తన మీమ్స్‌ నచ్చి రష్మిక మందన్న, నిధి అగర్వాల్, బాలాదిత్య, వర్ష బొల్లమ్మ, సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకుడు వినోద్‌లాంటి వాళ్లు మంచి ప్రయత్నమని మెచ్చుకున్నారు. తమ సామాజిక మాధ్యమ వేదికలపై పంచుకున్నారు.

అన్నికాలాలకూ..

మీమ్స్‌ సూటిగా, సుత్తి లేకుండా ఉంటాయి.. ఆ సరదా సంభాషణలు యువత మనసుల్లోకి దిగిపోతాయి సరే.. వేసవి తర్వాత ఈ ప్రచారం ఉంటుందా అంటే.. ‘ఒక వ్యక్తికి అన్నికాలాల్లోనూ తగినంత నీరు తీసుకోవడం అవసరం. చలి, వర్షాకాలంలో అయితే కనీసం గోరువెచ్చని నీరైనా తాగాలి. ఎండ బాగా ఉన్నప్పుడు ఒంట్లో నీరు తక్కువైతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. ఇది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. నీటిశాతం తగినంత లేకపోతే అజీర్తి, చర్మ, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఇవన్నీ నేను చాలామంది వైద్యులతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు సరదాగానే చెబుతున్నా.. నా పని అన్నికాలాలకూ పనికొస్తుంది’ అని వివరించాడు మాధవ్‌. బీటెక్‌ పూర్తి చేసిన మాధవ్‌ ప్రస్తుతం ఒక ఆన్‌లైన్‌ మీడియా సంస్థలో పని చేస్తున్నాడు. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts