Published : 17 Sep 2022 00:40 IST

క్లిక్‌మనిపిస్తూ.. క్లిక్కయ్యాడు

పొద్దునే లేవడం.. కెమెరా పట్టుకొని అడవికి బయల్దేరడం. ఇరవై ఆరేళ్ల ఇనేష్‌ సిద్ధార్థకి ఐదేళ్లుగా ఇదే పని. అక్కడ గంటలకొద్దీ మాటు వేసి అరుదైన దృశ్యాల్ని క్లిక్‌మనిపిస్తాడు. అదీ సెల్‌ఫోన్‌తో. ఈ మైక్రో ఫొటోగ్రఫీకి మంచి గుర్తింపు దక్కడమే కాదు.. బోలెడంత ఆదాయమూ వస్తుందంటున్నాడు.

సిద్ధార్థది తిరుపతి. చిన్నప్పుడు వాళ్ల నాన్న రీల్‌ కెమెరాతో ఫొటోలు తీసేవారు. అది చూసి తానూ సరదాగా క్లిక్‌క్లిక్‌మనిపిస్తూ ఆసక్తి పెంచుకున్నాడు. కెమెరా సెల్‌ఫోన్లు వచ్చాక వాటితో ప్రకృతి దృశ్యాల్ని బంధించడం మొదలు పెట్టాడు. ఇదేసమయంలో తిరుపతిలో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌లు జరుగుతుండేవి. హాజరవుతూ మెలకువలు నేర్చుకునేవాడు. ఈ క్రమంలో మైక్రో ఫొటోగ్రఫీపై ఎక్కువమంది దృష్టి పెట్టరని తెలిసింది. అందులోనే తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. ఒక ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొని దానికి స్కైవిక్‌ అనే మ్యాక్రో లెన్స్‌, సోనీ 25 లెన్స్‌ బిగించి ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఇవి చిన్నచిన్న కీటకాల కళ్లను సైతం స్పష్టంగా చిత్రాలు తీస్తాయి. వీటిలో ప్రావీణ్యం సంపాదించడానికి నాలుగేళ్లు కష్టపడ్డాడు. ప్రొఫెషనల్‌గా మారాక అరుదైన పక్షులు, తూనీగలు, సీతాకోకచిలకలు, కీటకాల వేట మొదలుపెట్టాడు. వీటికోసం రోజూ శేషాచలం అడవుల్లోకి వెళ్లడం దినచర్యగా మలచుకున్నాడు. ఐదారేళ్లలో వెయ్యికిపైగా ఫొటోలు తీశాడు. అందులో 12 రకాల కొత్త తూనీగలను తన కెమెరాలో బంధించగలిగాడు. ఓసారి తమిళనాడులోని తిరుత్తణి వెళ్లి రెండు అరుదైన సాలీడులను గుర్తించి ఫొటో తీశాడు. ఇది గతంలో జపాన్‌లో మాత్రమే ఒకసారి కనిపించింది.

గంటలకొద్దీ ఎదురుచూస్తూ..
ఒక మంచి ఫొటో రావడానికి, అరుదైన జీవిని గుర్తించడానికి రోజు ఐదు నుంచి పది గంటల సమయం వెచ్చిస్తానంటున్నాడు సిద్ధార్థ. శేషాచలం అడవిలోనే తీసిన రెడ్‌ డ్రాగన్‌ తూనీగ కోసం ఏడుగంటలు కష్టపడ్డాడట. ఈ జీవి తనపై నీళ్లు పడినప్పుడు కాళ్లతో తుడుచుకునే 9 సెకన్ల వీడియో తీశాడు. దీనికి అటవీశాఖ అధికారులు నిర్వహించిన వైల్డ్‌లైఫ్‌ వీక్‌ ఫొటోగ్రఫీ పోటీలో అవార్డు దక్కింది. మొత్తమ్మీద తను దాదాపు 150 రకాల జాతుల తూనీగలను సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడంతో పలు రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఒకవైపు తన ప్యాషన్‌ని కొనసాగిస్తూనే ఫొటోలను కొన్ని యాప్‌లకు విక్రయించడం ద్వారా నెలకి ఐదంకెల్లో ఆదాయం గడిస్తున్నాడు. ఒక ఫొటోనైతే ఏకంగా రూ.60వేలకు అమ్మాడు. ఎప్పటికైనా బీబీసీ, నేషనల్‌ జాగ్రఫీలాంటి ఛానెళ్లకు పని చేయడమే తన లక్ష్యమంటున్నాడు సిద్ధార్థ.

- ఎం. కిరణ్‌కుమార్‌, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts