వర్క్‌ ఫ్రం హోం.. తీరు మార్చేద్దాం

కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చాలానే. దాంతోపాటు వర్క్‌ ఫ్రం హోం అనే ట్రెండ్‌ని పరుగులు పెట్టించిందీ ఆ మహమ్మారే. కొవిడ్‌ మనల్ని వదిలినా.. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు ఉద్యోగులతో ఇంటి నుంచి పనినే కొనసాగిస్తున్నాయి.

Published : 24 Jun 2023 00:21 IST

కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చాలానే. దాంతోపాటు వర్క్‌ ఫ్రం హోం అనే ట్రెండ్‌ని పరుగులు పెట్టించిందీ ఆ మహమ్మారే. కొవిడ్‌ మనల్ని వదిలినా.. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు ఉద్యోగులతో ఇంటి నుంచి పనినే కొనసాగిస్తున్నాయి. ఎప్పుడూ ఇంట్లోంచే అంటే బోర్‌గా ఫీలయ్యేవారు కొత్తగా ఇలా ప్రయత్నించి చూస్తే పోలా...

కాఫీషాప్‌లు: ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండి పని చేయాలంటే ఎవరికైనా బోరే. అందుకే ల్యాపీ పట్టుకొని అలా కెఫేకో, కాఫీషాప్‌కో వెళ్లండి. కళ్లకింపుగా చాలామంది కనిపిస్తారు. కొన్నిచోట్ల ఉచితంగా వై-ఫై సౌకర్యం ఉంటుంది. కాఫీ సిప్‌ చేస్తూ.. స్నాక్స్‌ నములుతూ.. పని చేస్తుంటే.. ఆ మజానే వేరు.


స్నేహితుడి గది: అసలు ఫ్రెండ్‌ పక్కనుంటేనే చెప్పలేనంత హాయి. తన ఇంట్లో ఉండి పని చేస్తుంటే ఇంకెంత బాగుంటుందో. అక్కడ ఏ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు. అప్పుడప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.సందేహాలు తీర్చుకోవచ్చు. ఓమాటలో చెప్పాలంటే ఎంచక్కా కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోవచ్చు.


గ్రంథాలయం: అలికిడి, హడావుడి కాకుండా చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఉద్యోగులూ ఉంటారండోయ్‌. అలాంటివారికి గ్రంథాలయాలు అనువైన ప్రదేశాలు. అక్కడ ఏదో ఒక మూలన కూర్చొని ల్యాప్‌టాప్‌ తెరిస్తే.. మిమ్మల్ని అడిగేవారు ఎవరుంటారు?


కోవర్కింగ్‌ స్పేస్‌: చాలా నగరాల్లో కో-వర్కింగ్‌ ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. ఇదొక తాత్కాలిక కార్యాలయంలాంటిది. ఇంటినుంచి పని చేసే కొంతమంది ఉద్యోగులు కలిస్తే.. ఎంచక్కా అక్కడ ఓ స్పేస్‌ని బుక్‌ చేసుకోవచ్చు. డెస్క్‌లు, ప్రింటర్లు, సమావేశ గదులు.. వీటన్నింటినీ చూస్తుంటే అచ్చంగా ఆఫీసులో ఉన్న అనుభూతే కలుగుతుంది.


అందరికీ దూరంగా: సముద్రం ఒడ్డునో.. ప్రకృతి ఒడిలోనో.. ఏ హోటల్‌ గదిలోనో ఉండటం కొందరికి బాగా నచ్చుతుంది. అక్కడే హాయిగా ఆడుతుపాడుతూ హాయిగా పని చేసుకునే వర్క్‌ ఫ్రం డెస్టినేషన్‌ ధోరణి పెరుగుతోంది. వీలైతే మీరూ అందులో చేరిపోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని