తుంటరిగా.. ఒంటరిగా!

ముద్దూముచ్చటా లేక నిస్సారంగా సాగుతున్న నా జీవితంలో.. అప్సరసలాంటి నిన్ను చూడగానే అమాంతం నాదాన్ని చేసుకోవాలనే కోరిక మొదలైంది. నీతో పెళ్లి కోసం ఇంట్లో పెద్ద లొల్లినే చేశాను.

Published : 24 Jun 2023 00:27 IST

ఫాస్ట్‌ సుందరి శ్రీలేఖకు.. సాఫ్ట్‌వేర్‌ వెంకీ ప్రేమలేఖ
వెరైటీ ప్రేమలేఖ

ముద్దూముచ్చటా లేక నిస్సారంగా సాగుతున్న నా జీవితంలో.. అప్సరసలాంటి నిన్ను చూడగానే అమాంతం నాదాన్ని చేసుకోవాలనే కోరిక మొదలైంది. నీతో పెళ్లి కోసం ఇంట్లో పెద్ద లొల్లినే చేశాను. మావాళ్లు ఏవో సాకులు చెబుతుంటే.. చాకులా ఉన్న నిన్ను వదల్లేనని సూటిగా చెప్పేశాను. మీ ఇంటికి వచ్చాకగానీ తెలియలేదు మావాళ్లు చెప్పినట్టు నువ్వు మహా స్పీడని. ‘వంటలొచ్చా?’ అని అడగకముందే నువ్వు చేసిన గంపెడు పిండివంటలు తీసుకొచ్చి మా ముందు పెట్టావు. నిన్ను కనీసం ఓరకంట ఓ తుంటరి చూపైనా చూడకముందే.. నాతో ఒంటరిగా మాట్లాడాలని అందరిముందూ అడిగేశావు. నేను నోరు తెరవకముందే.. నువ్వే నా ప్యారీ అని చెప్పి షాదీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశావు. నిశ్చితార్థ వేడుక కోసం నిమిషాల్లో ముస్తాబైన నిన్ను చూసి నోరెళ్లబెట్టాను. చుట్టాల ముందు ముడుచుకుపోయి నేనుంటే.. పక్కవాళ్లను నెట్టేసి మరీ పార్టీ సాంగ్‌ డ్యాన్స్‌తో కుమ్మేశావు. మొహమాటానికి చిరునామా నేనైతే.. ఉత్సాహానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ నువ్వు. ఏదేమైనా మనసులు కలిసి మనం ఒకటయ్యే సమయం వచ్చేసింది. కానీ ముహూర్తం దగ్గరయ్యేకొద్దీ నాకంతా ఏదేదోలా ఉంది. హల్దీ ఫంక్షన్‌కి నన్ను పసుపులో ముంచేస్తావని లోలోపల అలజడిగా అనిపిస్తోంది. పెళ్లి ఫొటోషూట్‌లని చెప్పి కొండలెక్కిస్తావని కోపంగా ఉంది. భరించలేని బైక్‌ స్టంట్‌లు చేయిస్తావని భయమేస్తోంది. ముందే చెబుతున్నా చెలీ.. ఈ సాహసాలు చేసే ఓపిక నాకు లేదు. బుల్లెట్టు ఎక్కి నేను ఠీవీగా పెళ్లి మండపానికి వస్తాను. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా..’ పాటకు నీకు నచ్చిన స్టెప్పులతో ఇరగదీయ్‌. అంతటితో సరిపెట్టుకొని అందరి ఆశీర్వాదం తీసుకుందాం. అప్పటిదాకా నీ స్పీడుకు బ్రేక్‌లు వెయ్‌. పెళ్లి తంతు ముగిశాక.. టాప్‌గేర్‌లో సంతోషాల రైడ్‌ చేద్దాం.

నల్లపాటి సురేంద్ర, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని