ఇంట్రావర్ట్‌, ఎక్స్‌ట్రావర్ట్‌.. అయిపోదాం యాంబీవర్ట్‌

పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా ఉండేది.. ఇంట్రావర్ట్‌! ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవాడు.. ఎక్స్‌ట్రావర్ట్‌! ఈ ఇద్దరూ కాకుండా మరొకరూ ఉన్నారండోయ్‌.

Updated : 01 Jul 2023 02:55 IST

పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా ఉండేది.. ఇంట్రావర్ట్‌! ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవాడు.. ఎక్స్‌ట్రావర్ట్‌! ఈ ఇద్దరూ కాకుండా మరొకరూ ఉన్నారండోయ్‌.. తనే ‘యాంబీవర్ట్‌’... జనరేషన్‌ జడ్‌ కాలంలో ఈ మనస్తత్వమే యువతకి సక్సెస్‌ మంత్ర అన్నది పెద్దల మనోగతం.

మనకి ఇంట్రావర్ట్‌లు తెలుసు. ఎక్స్‌ట్రావర్ట్‌లూ తెలుసు. కొత్తగా ఈ యాంబీవర్ట్‌ ఎవరంటారా? ఆ ఇద్దరిలోని లక్షణాలను ఒంట పట్టించుకున్న వాడు. అంతర్ముఖుడిలా మూతి ముడుచుకొని ఉండటం.. సమయం వచ్చినప్పుడు బహిర్ముఖుడిలా చెలరేగిపోవడం తన స్టైల్‌. ఇంకొన్ని లక్షణాల విషయానికొస్తే..
* ఎక్స్‌ట్రావర్ట్‌లు అలుపే లేకుండా మాట్లాడతారు. ఇంట్రావర్ట్‌లు పలకరిస్తేగానీ మాట కలపరు. యాంబీవర్ట్‌లు ఎదుటివాళ్లు చెప్పింది బాగా వింటారు. సందర్భం వచ్చినప్పుడు ఎదుటివాళ్లను మెప్పించేలా మాట్లాడతారు.
* అన్నీచోట్లా ఒకటే మంత్రం పని చేయదు. పని జరగాలంటే కొందరితో ఎక్కువ మాట్లాడాలి. ఇంకొందరు చెప్పేది సావధానంగా వినాలి. సమయానుకూలంగా ఆ రెండూ యాంబీవర్ట్‌లు చేయగలరు.
* వీళ్లు నలుగురిని కూడగట్టడంలో ముందుంటారు. అవసరమైతే తనకు అప్పగించిన పనుల్ని ఒక్కరే సొంతంగా చేయగలరు. ఈ గుణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు దోహద పడుతుంది.
* అంతర్ముఖులకు నలుగురిలో కలవాలంటే చిరాకు. బహిర్ముఖులకు ఒంటరితనం అంటే భయం. ఈ రెండింటినీ ఎంజాయ్‌ చేసే మనస్తత్వం మన యాంబీవర్ట్‌లది.
* మార్కెటింగ్‌, బోధన, సమష్టిగా పని చేసే రంగాలు, నాయకత్వ చొరవ అవసరం అయ్యే ఉద్యోగాల్లో యాంబీవర్ట్‌లు అత్యధికంగా రాణించే అవకాశం ఉంటుంది.
* వీళ్లు నేర్చుకునేందుకు బాగా ఇష్టపడతారు. అవసరం ఉంటే చొరవ ప్రదర్శిస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చరు.
* బహిర్ముఖులు ఇతరులను తేలికగా నమ్మేస్తారు. ఎవరితోనైనా తొందరగా స్నేహం చేస్తారు. అంతర్ముఖులు ఒకరితో స్నేహం చేయాలంటే చాలా సమయం పడుతుంది. యాంబీవర్ట్‌లు ఎదుటివాళ్ల మనస్తత్వానికి అనుగుణంగా వాళ్లతో దూరంగా ఉండటం లేదా కలిసిపోవడం చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని