రింగ్‌తో.. డేటింగ్‌కి

కళాశాలలో కళ్లూకళ్లూ కలుసుకోవచ్చు...సామాజిక మాధ్యమాల్లో సావాసం ప్రేమగా మారొచ్చు...డేటింగ్‌ యాప్స్‌తో పరిణయం పరుగులు పెట్టొచ్చు...

Updated : 15 Jul 2023 00:46 IST

కళాశాలలో కళ్లూకళ్లూ కలుసుకోవచ్చు...
సామాజిక మాధ్యమాల్లో సావాసం ప్రేమగా మారొచ్చు...
డేటింగ్‌ యాప్స్‌తో పరిణయం పరుగులు పెట్టొచ్చు...

ఒక అమ్మాయి, అబ్బాయి జోడీ కట్టడానికి ఎన్నెన్నో దారులు. ఇప్పుడు అందులోకి మరొకటి వచ్చి చేరింది. అదే పియర్‌ రింగ్‌. దీన్ని ధరిస్తే ఇక డేటింగ్‌ యాప్స్‌ అవసరమే ఉండదు అంటోంది తయారీదారు.
‘ప్రపంచంలో 120 కోట్ల మంది బ్రహ్మచారులున్నారు. తమ మనసుని అర్థం చేసుకునే జోడీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో చాలామంది డేటింగ్‌ యాప్స్‌ వెంట పడుతున్నారు. డబ్బులు కోల్పోతున్నారు. చాలారకాలుగా మోసానికి గురవుతున్నారు. వీళ్లంతా చేతికి ఈ పచ్చరంగు ఉంగరం ధరిస్తే.. ఇంక డేటింగ్‌ యాప్స్‌ అవసరమేముంది?’ అంటున్నారు ఆవిష్కర్తలు.  

అసలేంటిది?: చేతి వేలికి ధరించే ఒక ఉంగరంలాంటి సిలికాన్‌ పరికరం ఇది. ఎమరాల్డ్‌ గ్రీన్‌ రంగులో ఉంటుంది.
కథేంటి?: ఈడు రాగానే జోడు కోసం వెతికే కుర్రకారు కోకొల్లలు. అలాంటివాళ్లు ఈ రింగ్‌ని ధరిస్తే చాలు. మేం సింగిల్‌.. మింగిల్‌ కావడానికి సిద్ధం అనే సంకేతం ఇచ్చినట్టుగా ఉంటుంది. అదే ఉద్దేశంతో ఉన్నవాళ్లు అల్లుకుపోవచ్చు. పరిచయం, ప్రేమ, పెళ్లితో ముందుకెళ్లిపోవచ్చు.
ఆహ్వానం: పియర్‌ రింగ్‌ గ్యాడ్జెట్‌ మాత్రమే కాదు.. ఇదొక సామాజిక ప్రయోగం అని అభివర్ణిస్తోంది తయారీదారు. ‘పియర్‌ ఫెస్ట్‌’ పేరుతో తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ పియర్‌ ఉంగరాలు ధరించిన వారందరూ ఆహ్వానితులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన దగ్గర జరిగే వివాహ పరిచయ వేదికలాంటిదట.
భారత్‌లోకి: అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఇప్పటికే మిలియన్లకొద్దీ పియరియన్స్‌ ఉన్నారు. ఈ ‘ది పియర్‌ రింగ్‌’ వెబ్‌సైట్‌ త్వరలోనే భారత్‌లోనూ కుర్రకారుని కట్టిపడేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని