మోనికా.. చదువుల్లో టాప్‌..సరదాలకు మేరీ జాన్‌

‘సరయు చదువులో పూర్‌ అయితే నేను మాత్రం టాపర్‌ని’ అంటోంది రెబా మోనికా జాన్‌. మలయాళంతో మొదలుపెట్టి తమిళ, కన్నడ పరిశ్రమలు చుట్టేసి.. తెలుగులోనూ ‘సామజవరగమన’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిందీ భామ

Updated : 29 Jul 2023 02:20 IST

‘సరయు చదువులో పూర్‌ అయితే నేను మాత్రం టాపర్‌ని’ అంటోంది రెబా మోనికా జాన్‌. మలయాళంతో మొదలుపెట్టి తమిళ, కన్నడ పరిశ్రమలు చుట్టేసి.. తెలుగులోనూ ‘సామజవరగమన’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిందీ భామ. సినిమాలోలాగే నా జీవితంలో సరదాలు, నవ్వులు, స్నేహాలకు అధిక ప్రాధాన్యం అంటున్న తను ‘ఈతరం’తో పంచుకున్న ముచ్చట్లివి.

దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించాగానీ.. ఆ మాట కొస్తే నేను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అదలా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను ‘సామజవరగమన’లో సరయులా మొద్దుని కాదు. చదువులో ఫస్ట్‌. పాటలు పాడతాను. డ్యాన్స్‌ కూడా వచ్చు. స్కూల్‌, కాలేజీలో ఏ పోటీ జరిగినా  బహుమతులన్నీ నావే. కానీ ఎందుకో స్టేజీ ఎక్కాలంటే భయం ఉండేది. ఇదిలా ఉండగా.. ఓసారి మా బంధువొకరు ఫోన్‌ చేశారు. ‘‘మిడుక్కి’ అనే రియాలిటీ షో కోసం నీలాగా మల్టీ టాలెంట్‌ ఉన్న అమ్మాయి కావాలంటున్నారు. ప్రయత్నించొచ్చు కదా’ అన్నారు. నాకు ఆసక్తి లేదన్నా బలవంతం చేశారు. దాంతో వెళ్లక తప్పలేదు. పెద్దగా ప్రయత్నించకుండానే ఎంపికయ్యాను. అక్కడ  నటించేదేమీ ఉండదు. మనం మనలాగే ఉండాలంతే. ఎనిమిది నెలలు సాగిన షోలో రన్నరప్‌గా నిలిచాను.
తెరంగేట్రం: ఆ షోతో చెప్పలేనంత పేరొచ్చింది. ఆ వెనకే టీవీ యాడ్స్‌ అవకాశాలు వరుస కట్టాయి. డబ్బు, పేరూ వస్తాయి కదా! సరదాగా నేనూ ఒప్పుకున్నా. అలా ఓ వాణిజ్య ప్రకటన చేస్తుండగా దాని దర్శకుడు ఓ సినిమా అవకాశం గురించి చెప్పారు. అప్పటికి నా చదువింకా పూర్తి కాలేదు. అమ్మానాన్నల్ని అడిగితే.. ‘నీ ఇష్టం. ఏదైనా బాగా ఆలోచించి చెయ్‌’ అన్నారు. ఓసారి వెళ్లి ప్రయత్నిస్తే లక్కీగా ఎంపికయ్యా. అలా ‘జాకబింతే స్వర్గరాజ్యం’తో తెరంగేట్రం చేశా. అది పెద్ద హిట్‌ అయ్యింది. హాలీడేస్‌లోనే షూటింగ్‌ ఉండటంతో చదువుకేమీ ఇబ్బంది కాలేదు. ఆపై మరిన్ని ఛాన్సులొచ్చాయి.

కాలేజీ ముచ్చట్లు: సొంత రాష్ట్రం కేరళ అయినా మేం బెంగళూరులో స్థిరపడ్డాం. చదువంతా అక్కడే సాగింది. బెంగళూరు క్రైస్ట్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అనలిటికల్‌ సైన్స్‌ చదివా. అన్నింట్లో ముందుండటంతో టీచర్లకు నేనంటే బోలెడు అభిమానం. అలాగని నేను మరీ పుస్తకాల్లోనే మునిగి తేలే రకం కాదు. అప్పుడప్పుడూ క్లాసులు ఎగ్గొట్టి స్నేహితులతో సినిమాలకు, షికార్లకూ వెళ్లేదాన్ని. అందరితో ఫ్రెండ్లీగా ఉండటంతో చాలామంది అబ్బాయిలు ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్‌ చేశారు. నేను లైట్‌ తీసుకొని సున్నితంగా ‘నో’ చెప్పేదాన్ని. నా మనసంతా పరిశోధనలపై ఉండేది. ఈమధ్యలోనే సినిమా అవకాశాలు వచ్చిపడటంతో చదువు, సినిమా సమాంతరంగా సాగుతుండేవి. తమిళ ‘బిగిల్‌’ మంచి పేరు తేవడం, అప్పటికి ఎమ్మెస్సీ పూర్తవడంతో పూర్తిగా చిత్రరంగం వైపు వచ్చేశా.

మా ప్రేమకథ: చాలా ప్రేమకథల్లో నటించిన నాకూ ఓ ప్రేమ కథ ఉందండోయ్‌. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా జో పరిచయమయ్యాడు. నన్ను అర్థం చేసుకొని.. బాగా ప్రోత్సహించే వ్యక్తి తను. ఇద్దరిదీ ఒకేరకమైన మనస్తత్వం. సరదాగా ఉంటాడు. బాగా చదువుకున్నాడు. ఓసారి ‘మోనికాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అన్నాడు. నాదీ అలాంటి ఫీలింగే. తర్వాత అదే ప్రేమగా మారింది. మా ఐదేళ్ల ప్రేమ ఏడాదిన్నర కిందట పెళ్లిగా మారింది. మా ఇద్దరి అభిరుచులకు అనుగుణంగా ఓ ఆర్గానిక్‌ ఫామింగ్‌ కంపెనీ పెట్టబోతున్నాం.

* నటి కాకపోయి ఉంటే: టీచింగ్‌ చేసేదాన్ని. పరిశోధనల వైపు వెళ్లేదాన్ని.
* ఎవరి దర్శకత్వంలో మెరవాలనుంది?: ఎస్‌ఎస్‌ రాజమౌళి.
* ఇష్టమైన నటులు: నేను కలిసి నటించిన అందరూ.
* కలిసి నటించాలనుకునేది: మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌
* ఖాళీగా ఉంటే: గిటార్‌ వాయిస్తా. పాటలు పాడతా. కొత్త ప్రదేశాలు తిరుగుతా. పుస్తకాలు చదువుతా.
* బెస్ట్‌ ఫ్రెండ్స్‌: ఇప్పటికీ స్కూల్‌, కాలేజీ రోజులనాటి స్నేహితులే.
* ఫ్యాషన్ల సంగతేంటి?: సౌకర్యంగా ఉండేదే స్టైల్‌. జీన్స్‌ ధరిస్తా. చీర కట్టడమూ ఇష్టమే.
* యువతకో సలహా: బయట బోలెడు అవకాశాలున్నాయి. అందాలంటే కష్టపడటం ఒక్కటే మార్గం. మనకంటూ ఓ ప్రత్యేకత ఉన్నప్పుడే గుర్తింపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని