రండి.. స్నేహించుకుందాం!

‘స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం’ అనే కుర్రాళ్లుంటారు.. శెభాష్‌! ‘దోస్త్‌లే.. నాకున్న ఆస్తులు’ అని పంచ్‌ డైలాగులు విసిరేవాళ్లు తక్కువేం కాదు.. సూపర్‌!!

Published : 05 Aug 2023 00:05 IST

రేపే స్నేహితుల దినోత్సవం


కడగండ్ల జీవితంలో మోముపై  చిరునవ్వుకి కారణమయ్యేవాడు స్నేహితుడు. కారుచీకట్లు ముసురుకుంటున్న వేళ.. కాంతిరేఖై వెలుగు పంచేవాడు ఫ్రెండ్‌. సరదాల కుర్ర ప్రాయానికి మరిన్ని తీపి సొబగులు అద్దేవాడు మిత్రుడు. ఆస్తుల్లేని యువత ఉండొచ్చుగానీ.. దోస్తుల్లేనివారు అరుదు. కాలాలెన్ని మారినా కలకాలం నిలిచే ఉండే ఆ భావోద్వేగాన్ని ఓసారి మననం చేసుకుందాం.


‘స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం’ అనే కుర్రాళ్లుంటారు.. శెభాష్‌! ‘దోస్త్‌లే.. నాకున్న ఆస్తులు’ అని పంచ్‌ డైలాగులు విసిరేవాళ్లు తక్కువేం కాదు.. సూపర్‌!! ‘వాడిపోనిదీ.. వీడిపోనిదీ స్నేహమొక్కటే..’ అని నమ్మి పాటించే వాళ్లూ ఎక్కువే.. వెరీగుడ్‌!! మరి మీతో మీరు ఎప్పుడైనా స్నేహం చేశారా? ఫ్రెండ్షిప్‌ కోసం త్యాగాలు చేసే మీరు.. మీకోసం
ఏం వదులుకున్నారు? మనల్ని మనం బాగా ప్రేమించుకున్నప్పుడే.. పక్కవాడినీ పట్టించుకో గలుగుతాం అంటుంటారు... అందుకే పదండి.. మనల్ని మనం స్నేహించుకుందాం.


బెడ్డు దిగగానే వాట్సప్‌లో ఫ్రెండ్‌కి పలకరింపు.. వారాంతాల్లో వాళ్లతోనే ఔటింగ్‌లు.. పార్టీ పెడితే పదుల సంఖ్యలో పోగయ్యే గుంపు.. ఎక్కువశాతం మిలీనియల్‌ మొనగాళ్లు, జనరేషన్‌ జడ్‌ అమ్మాయిల తీరింతే. వాళ్ల జిందగీ స్నేహానికి చిరునామాలా గడిచిపోతుంటుంది. అయితే ఇప్పుడో పని చేయండి. కళ్లు మూసుకొని మీరు బాగా ఇష్టపడే ఓ నలుగురు మిత్రుల పేర్లు రాయండి. అందులో మీరూ లేకుంటే.. డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే! మీతో మీరు దోస్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైనట్టే! అసలెందుకు ఈ దోస్తీ.. ఏంటట ఈ స్నేహం గొప్ప? అంటే.. ఈకాలం యువత అస్సలు ఊరుకోదు. మనం గెలిచినప్పుడు అభినందించే.. ఓడినప్పుడు ఓదార్చే నలుగురు స్నేహితులు లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అంటుంది. సూటిగా చెప్పాలంటే.. ఆపదల్లో ఆదుకోవడానికి.. మంచి చేస్తే గుర్తించడానికి.. కష్టాల్లో అండగా నిలవడానికి స్నేహితులు కావాలి.
అందం.. సాయం చేసే గుణం.. మంచితనం.. ప్రతిభ.. అభిప్రాయాలు.. వీటిలో ఏదైనా నచ్చితేనే.. ఒక అబ్బాయి లేదా అమ్మాయితో పరిచయం పెంచుకోవాలనుకుంటారు. స్నేహం కోసం ఎదురు చూస్తారు. మరి మనతో మనకు పరిచయం ఎలా? అంటే.. ముందు మనల్ని మనం ఒక ఉత్తమ వ్యక్తిగా పరిచయం చేసుకోవాలి. మనలోని మంచీచెడుల్నీ అంగీకరించాలి. గౌరవించుకోవాలి. నా రంగు తక్కువ.. అందంగా ఉండను.. ప్రతిభ లేదు.. చదువు రాదు.. నలుగురిలో మాట్లాడలేను.. ఆస్తుపాస్తుల్లేవు.. ఇలాంటి అభిప్రాయాలుంటే పక్కన పడేయాలి. మనకు మనమే మొదటి ప్రాధాన్యం కావాలి. అబ్దుల్‌ కలాం అందంగా ఉండరు. అయినా అందరికీ ఇష్టమైన వ్యక్తిలా మారలేదా? బిల్‌ గేట్స్‌ కాలేజీ మెట్లైనా ఎక్కలేదు. అయినా అపర కుబేరుడు అయ్యారుగా. అందుకే మనపై మనకున్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకున్నప్పుడే మనతో మనకి దోస్తీ కుదురుతుంది. నేను బాగా చదవలేదు.. అందుకే ఐఐటీ రాలేదు. పేరెంట్స్‌ చెప్పింది వినలేదు.. పెద్దగా సంపాదించలేదు. అనుకుంటూ ఎప్పుడో జరిగిన పొరపాట్లను పదేపదే తలచుకొని అపరాధభావంతో కుంగిపోతుంటే.. మన స్నేహం ముందుకు సాగదు. ఇలాంటి విషయాల్లో మనల్ని మనం క్షమించుకోవాలి.
సాధారణంగా ఫ్రెండ్‌ బాగుండాలి.. బాగు పడాలి అని కోరుకుంటాం. కానీ మనమేమో ఆన్‌లైన్‌లో అదేపనిగా బాతాఖానీ కొడుతుంటాం. ఆఫీసులో ఓటీలు చేస్తూ ఆకలి, దాహం, నిద్ర, విశ్రాంతిలాంటివి మర్చిపోతుంటాం. స్నేహం పేరుతో మందూ, విందులకు ముందుంటాం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తాం. దోస్త్‌కి ఆరోగ్యం సరిగా లేకపోతే తల్లడిల్లిపోయే మనమే అనారోగ్యాన్ని ఆహ్వానిస్తాం. ఇలా చేసినప్పుడు మన అంతర్గత మిత్రుడికి ఏం విలువ ఇచ్చినట్టు? బండిపై మేఘాల్లో తేలిపోవడం.. సెల్ఫీలంటూ కొండ అంచున నిలబడి ఫొటోలు తీసుకోవడం.. ఇవన్నీ మన మిత్రుడికి కీడు చేసే వ్యాపకాలే. ఇదిగాక మన స్నేహంలో మానసిక అవసరాలూ ముఖ్యమే. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం బుజ్జగించుకోవాలి. మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. మనోడు ఎవరైనా చెడ్డ వ్యక్తికి దగ్గరవుతుంటే.. ‘రేయ్‌.. వాడితో స్నేహం అంత మంచిది కాదురా’ అని హెచ్చరిస్తాం. కానీ మనమేమో విషం చిమ్మే స్నేహితుల్ని మొహమాటంతో కొనసాగిస్తాం. మనలోని స్నేహితుడికి విలువ ఇవ్వాలంటే.. దుష్ట స్నేహాలకు నిర్మొహమాటంగా బైబై చెప్పేయాల్సిందే. ఫ్రెండ్‌ బాధ పడితే జోకర్‌లా మారి నవ్వించే.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఏటీఎం యంత్రంలా మారే మనమే.. మనలోని ఫీలింగ్స్‌ని ఎందుకు పట్టించుకోవద్దు? అలాగే మనం ర్యాంక్‌ కొడితే స్నేహితులకు ట్రీట్‌ ఇస్తాం. ప్రమోషన్‌ వస్తే పార్టీకి పిలుస్తాం. పుట్టినరోజు, పెళ్లిరోజు.. ప్రతీ సందర్భాన్నీ వేడుక చేసుకుంటాం. వాళ్లపై మనకున్న అభిమానాన్ని చాటుకుంటాం. అలాగే మనకే ఏదైనా మంచి జరిగితే.. విజయం సాధిస్తే.. మనకు మనమే బహుమానం ఇచ్చుకోవాలి. తీయని వేడుక చేసుకోవాలి. మనల్ని మరింత దగ్గరవడానికి ఇదో దారి. మనకు మనమే బెస్టీగా మారడానికిదో ఉత్తమ మార్గం.


మనతో మనం

పొద్దునే ఆన్‌లైన్‌లో గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి.. ఆపద వస్తే పక్కనుండాలి. టూర్‌కి వెళ్తే తోడు రావాలి.. ఇలాంటివి మనం స్నేహితుల నుంచి ఆశిస్తాం. అందిస్తాం. దాన్ని మనకు మనం ఆపాదించుకోవడమే.. సెల్ఫ్‌ ఫ్రెండ్షిప్‌. సమయం వచ్చినప్పుడల్లా మనకు మనమే ఓదార్చుకోవాలి. తోడుండాలి. సంతోషాలు షేర్‌ చేసుకోవాలి. మన బెస్ట్‌ఫ్రెండ్‌కి సమస్య వస్తే.. ‘అధైర్య పడొద్దు.. సమస్యలు ఎల్లకాలం ఉండవు. నీకు ఏదైనా చేయడానికి నేనున్నానుగా..’ అని ఒక భరోసా ఇస్తాం. కష్ట సమయాల్లో మనలోని స్నేహితుడికీ ఇలాగే చెప్పగలగాలి. మనకి మనమే ఓదార్చుకోవాలి. సెల్ఫ్‌ ఫ్రెండ్షిప్‌ పెరగడానికి మేం ఈమధ్యే ఒక ప్రయోగం చేశాం. సాధారణంగా ఈ కాలం యువత ఆన్‌లైన్‌లో బాగా యాక్టివ్‌గా ఉండటం సహజమే. స్నేహితుల ప్రతి విషయాల్లో వాళ్లు స్పందిస్తారు. సలహాలిస్తారు. ఎమోజీలు పంపుతారు. ఫొటోలు పంచుకుంటారు. అలా మనతో మనం మాట్లాడుకోవడానికి.. మనలోని స్నేహం దృఢమవడానికి.. మనకున్న రెండు ఫోన్‌ నెంబర్లతో మనమే ఒక వాట్సప్‌ గ్రూప్‌ సృష్టించాలి అని యువతకి చెప్పాం. అందులో మనకి మనమే చాట్‌ చేసుకోవాలి. కష్టసుఖాలు పంచుకోవాలి. పోట్లాడాలి.. పొగడ్తలు ముంచెత్తాలి. బహు మానాలు ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో గణనీయమైన సానుకూల ఫలితాలు వస్తాయి.  ఒత్తిడి దూరమవుతుంది.


- డా.గీతా చల్లా, మానసిక నిపుణురాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని