ఒంటరైనా.. ఓటమైనా వీడిపోని బంధమొకటే..

నవ్వించే ఫ్రెండ్స్‌.. కవ్వించే ఫ్రెండ్స్‌.. ఆదుకునే ఫ్రెండ్స్‌.. ఆడుకునే ఫ్రెండ్స్‌.. స్నేహితుల్లో చాలా రకాలే ఉంటారు.

Published : 05 Aug 2023 00:05 IST

నవ్వించే ఫ్రెండ్స్‌.. కవ్వించే ఫ్రెండ్స్‌.. ఆదుకునే ఫ్రెండ్స్‌.. ఆడుకునే ఫ్రెండ్స్‌.. స్నేహితుల్లో చాలా రకాలే ఉంటారు. సందర్భం, అవసరం, అనుబంధం..  వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా విభజించుకోవచ్చు. ఇలా..

  • బెస్ట్‌ ఫ్రెండ్‌: కడుపులో బాధని కక్కేయడానికి.. మనసులోని సంతోషం పంచుకోవడానికి వెంటనే గుర్తొచ్చే ఒకరో, ఇద్దరో స్నేహితులే ఈ బెస్టీలు. కష్టాల్లో ఆదుకొని కన్నీళ్లు తుడవడానికి, ఛీర్స్‌ చెప్పి అన్నీ షేర్‌ చేసుకునే ఈ స్నేహితుడు/స్నేహితురాలు.. ఎప్పుడూ మన ఫోన్‌లో ఫేవరిట్‌ జాబితాలో ఉంటారు. వీళ్లతో ఎక్కువ సమయం గడిపినా, గడపకపోయినా.. అవసరం, ఆపద, సంతోషాల్లో వచ్చి వాలతారు.
  • సోషల్‌ ఫ్రెండ్స్‌: అంతర్జాలం స్నేహితులు. వీళ్లు జీవితంలో మనకు ఎదురు పడొచ్చు.. పడకపోవచ్చు. కానీ మనతో వాదిస్తారు.. విబేధిస్తారు.. ఏకీభవిస్తారు.. సరదాలు పంచుతారు.. చిరాకు తెప్పిస్తారు.. రహస్యాలూ పంచుకుంటారు. వీళ్లు జిగిరీలూ కావొచ్చు.. కాకపోవచ్చు. మన జీవితంలో వీళ్లకంటూ ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది.
  • గ్రూప్‌ ఫ్రెండ్స్‌: ప్రత్యేక సమయం, సందర్భాల్లోనే ఈ స్నేహం విరబూ స్తుంది. వీళ్లంతా వ్యక్తిగతంగా కాకుండా.. బృందంగా ఉన్నప్పుడే స్నేహంలోని మజాని ఆస్వాదిస్తుంటాం. ఇలా ఆసక్తి ఉన్న గ్రూపు దోస్తులంతా ఒక్కచోట చేరినప్పుడు రచ్చ మామూలుగా ఉండదు.
  • సందర్భోచిత స్నేహితులు: ప్రత్యేకమైన సమయం, సందర్భాల్లో కలిసే స్నేహితులు వీళ్లు. ఆ స్నేహం అక్కడే గుబాళిస్తుంది. యోగా, సంగీతం తరగతులు, జిమ్‌ సెంటర్లు, షాపింగ్‌ మాళ్లు, బస్టాపులు, మెట్రో స్టేషన్లు.. ఇలా. ఈ స్నేహానికి పరిమితులుంటాయి.
  • సహోద్యోగులు: ఒకరకంగా చెప్పాలంటే వీళ్లూ సందర్భోచిత స్నేహితులే. కానీ కెరియర్‌ మొదలయ్యాక అత్యధిక సమయం గడిపేది వీళ్లతోనే. వీళ్లలో ఎక్కువమంది బెస్టీలు అయ్యే అవకాశం ఉంటుంది.
  • జీవితాంతం తోడుగా: చెడ్డీలు వేసుకునే దగ్గర్నుంచి చితికి చేరేదాకా.. కలకాలం నిలిచి ఉండే స్నేహితులు. ఈ దోస్త్‌లు రోజూ కలవొచ్చు, కలవకపోవచ్చు. కష్టసుఖాల్లో పక్కనుండొచ్చు.. ఉండకపోవచ్చు.. అయినా స్నేహం కలకాలం కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని