స్నేహానికీ డేటింగ్‌ యాప్స్‌

డేటింగ్‌ చేయడానికి డేటింగ్‌ యాప్స్‌ అనేది పాత మాట. ఇప్పుడు ట్రెండ్‌ మారింది బాస్‌. స్నేహం చేయడానికీ డేటింగ్‌ యాప్‌లను ఉపయోగించుకుంటోంది జనరేషన్‌ జడ్‌.

Published : 05 Aug 2023 00:06 IST

డేటింగ్‌ చేయడానికి డేటింగ్‌ యాప్స్‌ అనేది పాత మాట. ఇప్పుడు ట్రెండ్‌ మారింది బాస్‌. స్నేహం చేయడానికీ డేటింగ్‌ యాప్‌లను ఉపయోగించుకుంటోంది జనరేషన్‌ జడ్‌. ఈ వాడకం మామూలుగా ఉండటం లేదు. వలపు కేంద్రాలు, పెళ్లి మార్గాలైన ఈ డేటింగ్‌ యాప్‌లలో స్నేహం వెల్లివిరియడం అనే ట్రెండ్‌ కరోనా కాలంలోనే ఎక్కువైంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌, భౌతిక దూరం కారణంగా యువత ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు డేటింగ్‌ యాప్‌లలో ఫ్రెండ్షిప్‌ బాట పట్టడం ఎక్కువైందట. అప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లాంటి సామాజిక మాధ్యమాలతోపాటూ టిండర్‌, బంబుల్‌లాంటి వాటి వెంట పడ్డారు. ఆ సమయంలో పదిమందిలో తొమ్మిది మంది డేటింగ్‌ యాప్‌లను స్నేహానికి ఒక దారిగా భావించారట. బయట కొత్తగా స్నేహితులను వెతుక్కోవడం కన్నా.. ఇక్కడే తేలికగా ఉందని 68శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. 35శాతం మంది ఈ రెండేళ్లలోనే మాకు కొత్త స్నేహితులు దొరి కారని సెలవిచ్చారు. ‘వన్‌ పల్స్‌’ పేరుతో జరిపిన ఈ అధ్యయనంలో కుర్రకారు ఇలా అభిప్రాయాలు వెలిబుచ్చారు.

నెంబర్‌ ఎంత?

వాట్సప్‌లో స్టేటస్‌ పెడితే మూడొందల మందైనా చూస్తారు. కామెంట్‌ చేసే జిగిరీలు ఓ యాభై మంది. ఫేస్‌బుక్‌లో వెయ్యిమంది స్నేహితులు. ఇన్‌స్టాలో ఫాలో అయ్యే దోస్త్‌లు రెండు వేలు. ఈకాలం యూత్‌ ఎక్కడా తగ్గడం లేదు. డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరికీ స్నేహితులు సంఖ్య సెంచరీలు దాటుతోంది. మరి బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి వచ్చేది ఎంతమంది? పుట్టినరోజో.. పెళ్లిరోజునో.. నేరుగా కలిసి.. ప్రేమారా ఆళింగనం చేసుకునేది ఎంతమంది? ఏది నిజమైన స్నేహం? ఎవరిది నిఖార్సైన దోస్తీ? అసలు ఎంతమంది స్నేహితులుంటే గొప్ప? వీటన్నింటిపై రాయల్‌ సొసైటీ అనే సంస్థ అధ్యయనం చేసింది. వేలమంది అమ్మాయిలు, అబ్బాయిలతో మాట కలిపింది. ఆఖరికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు సన్నిహిత మిత్రులు ఉన్నవారు సంతోషం అంచులు చూడొచ్చని తేల్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని