తెరపై కుస్తీ.. జీవితంలో దోస్తీ

సినిమాల్లో పోటీదారులు.. నటనతో తామేంటో నిరూపించుకోవాలని తహతహలాడే నాయికలు! కానీ ఒక్కసారి పేకప్‌ చెప్పి బయటికొస్తే.. జిగిరీ దోస్త్‌లు.

Published : 05 Aug 2023 00:06 IST

సినిమాల్లో పోటీదారులు.. నటనతో తామేంటో నిరూపించుకోవాలని తహతహలాడే నాయికలు! కానీ ఒక్కసారి పేకప్‌ చెప్పి బయటికొస్తే.. జిగిరీ దోస్త్‌లు. భుజం భుజం రాసుకుంటూ టూర్లకు వెళ్లే సన్నిహితులు. వాళ్లే సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌లు. చిత్ర పరిశ్రమలో వాళ్ల ప్రస్తావన లేకుండా ఫ్రెండ్షిప్‌ డే ముగియదు. ఈ బీఎఫ్‌ఎఫ్‌ల కథేంటంటే..

  • ఈ ముద్దుగుమ్మల స్నేహం గోవాలో విచ్చుకుంది. 2015లో కొన్నాళ్లపాటు ఇద్దరూ అక్కడే ఉండేవాళ్లు. అప్పుడే ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం మొదలైంది. మొదటిరోజే తెల్లవారేదాకా సాగాయట ముచ్చట్లు. ఇరు కుటుంబాల సంగతులు, సినిమా కబుర్లు, ఇష్టాలు, అభిరుచులు, నటన.. అన్నీ చెప్పుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కావాల్సినంత ఏకాంతం దొరికి బెస్టీలయ్యారు.
  •  కొత్త ప్రదేశాలను చుట్టిరావడం అంటే ఇద్దరికీ ఇష్టం. ఏమాత్రం ఖాళీ దొరికినా.. టూర్లకు చలో అంటుంటారు. ఇద్దరూ కలిసి మొదటిసారి అమెరికాలోని డిస్నీలాండ్‌కి వెళ్లారు. ప్రతిచోటా.. చాంతాడంత వరుస. జాన్వీ వణికిపోతుంటే.. సారా చాకచక్యంగా టికెట్లు తీసుకురావడంతో సహా అన్ని పనులూ చక్కబెట్టేదట. దీంతో జాన్వీ పూర్తిగా ఫిదా అయిపోయింది. తర్వాత వీళ్లు దోహా, ప్యారిస్‌, కేదార్‌నాథ్‌ ట్రిప్‌లకూ వెళ్లొచ్చారు.
  •  కలిసి పార్టీలు చేసుకోవడం, దీపావళి వేడుకలు జరుపుకోవడం.. చిత్రోత్సవాలకు జంటగా వెళ్లడం.. సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం.. వీళ్ల దోస్తీకి కొన్ని గుర్తులు. కరణ్‌జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’, రణ్‌వీర్‌ షోలలో సైతం ఈ ఇద్దరూ జంటగా వచ్చారు. తమ మధ్య అల్లుకున్న స్నేహం, చిలిపి తగాదాలు, వ్యక్తిగత విషయాలూ పంచుకున్నారు.
  •  ‘జాన్వీ అచ్చం నాలాగే ఆలోచిస్తుంది. కేరింగ్‌గా ఉంటుంది. నా మూడ్‌ని ఇట్టే అర్థం చేసుకుంటుంది అందుకే తనకి సన్నిహితం కాగలిగా’ అని సారా అలీఖాన్‌ చెబుతుంటే.. ‘సారా డియర్‌ సూపర్‌ కూల్‌. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. తన చొరవ నాకిష్టం’ అంటోంది జాన్వీ. ఎనిమిదేళ్ల నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. వీళ్లిద్దరికీ  కామన్‌ స్నేహితురాలుగా ఉన్న మరో భామ అనన్య పాండే. ‘లైగర్‌’ హీరోయిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని