క్లాస్‌రూం కహానీలు ‘తరగతిలో.. ఈ వేషాలేంటి..?’

మా క్లాస్‌లో ఒకబ్బాయి ఎప్పుడూ మూడీగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఓసారి మా టీచర్‌ పాఠం చెబుతూ తన దగ్గరికి వెళ్లారు.

Updated : 12 Aug 2023 01:20 IST

మా క్లాస్‌లో ఒకబ్బాయి ఎప్పుడూ మూడీగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఓసారి మా టీచర్‌ పాఠం చెబుతూ తన దగ్గరికి వెళ్లారు. అతడు చొక్కాకి రెండు గుండీలు పెట్టుకోకపోవడం గమనించారు. చాలా స్ట్రిక్టుగా ఉండే ఆవిడ ‘బాబూ ఇది క్లాస్‌రూం. పద్ధతిగా ఉండాలి. ఇంకోసారి ఇలా రావొద్దు’ అని చెప్పారు. తను పట్టించుకోనే లేదు. మర్నాడు అదే చొక్కాతో.. అలాగే వచ్చాడు. వాడి పని అయిపోయిందనుకున్నాం. ‘నిన్న చెబితే అర్థం కాలేదా? ఈ వేషమేంటి?’ అని చిరాకు పడ్డారు టీచర్‌. అయినా తన నోట్లోంచి మాట పెగల్లేదు. మూడో రోజూ అదే అవతారం. మేమంతా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంతలో మేడం తన బ్యాగులోంచి సూది, దారం తీసి అప్పటికప్పుడే రెండు గుండీలు కుట్టారు. అలా ఎందుకు చేశారో మాకు తర్వాతే అర్థమైంది. మా క్లాస్‌మేట్‌కి చిన్నప్పుడే నాన్న, ఆరునెలల కిందట అమ్మ చనిపోయారట. పొద్దున ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ.. నానమ్మని పోషిస్తూ చదువుకుంటున్నాడట. ఆ విషయం తెలిశాక మేమూ బాధ పడ్డాం. అన్నట్టు ఆ ఒక్కరోజు సాయం చేయడమే కాదు.. ఇంటర్‌ పూర్తయ్యేదాకా టీచర్‌ వాడిని అమ్మలా చూసుకున్నారు.    

 ఎస్‌.సూరిబాబు, నిడదవోలు
(కాలేజీలో ఇలాంటి అనుభవాలు, సరదా సంఘటనలు మీకూ ఉంటే రాసి పంపండి)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని