ముద్దంటే.. చేదే!

ఓ అమ్మాయి పెదాలను సున్నాలా చుట్టి.. వాటికి చేతులు తాకించి.. ఓ ముద్దుని గాల్లోకి విసిరితే ఎంతటి మగాడైనా చిత్తైపోవాల్సిందే. ముద్దుకున్న మహత్తు అలాంటిది

Updated : 12 Aug 2023 06:58 IST

ఓ అమ్మాయి పెదాలను సున్నాలా చుట్టి.. వాటికి చేతులు తాకించి.. ఓ ముద్దుని గాల్లోకి విసిరితే ఎంతటి మగాడైనా చిత్తైపోవాల్సిందే. ముద్దుకున్న మహత్తు అలాంటిది. ప్రేమతో ఇచ్చినా.. పెదవి విరుస్తూ విసిరినా.. తమకంగా తమవారికి అప్పజెప్పినా.. దాని కథే వేరు. అన్నట్టు ముద్దు ఇద్దరి మధ్య మురిపెం తీర్చడమే కాదు.. తేడా వస్తే అగ్గీ రాజేస్తుంది. కిస్సుపై సదభిప్రాయం లేనప్పుడు కస్సుబుస్సులు తప్పవు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఫ్ల్లయింగ్‌ కిస్‌లు విసిరేటప్పుడు కాస్త జాగ్రత్త పడాల్సిందే. లేదంటే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీలా చిక్కుల్లో పడిపోతాం. లోక్‌సభలో తన వాణి వినిపించి.. ఆఖర్న సరదాగా ఫ్లైయింగ్‌ కిస్‌ విసిరారాయన. అదేం పద్ధతంటూ.. ఆయనంటే నచ్చని వాళ్లంతా ఆడిపోసుకుంటున్నారు.

ఆ సంగతి అలా ఉంచితే.. మొన్నటి టీ20 ప్రపంచకప్పులో నటాషా అనే అమ్మాయి గాల్లోకి ముద్దులు విసిరి రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యింది. ప్రేక్షకుల గ్యాలరీల్లోంచి ఆ సుందరి వదిలిన కిస్‌లు.. మైదానంలో బ్యాట్‌తో చితక్కొడుతున్న బాబర్‌ ఆజంకి చేరాయో, లేదోగానీ ఆ ముద్దుని టీవీల్లో చూసిన లక్షలమంది కుర్రాళ్లు క్లీన్‌బౌల్డ్‌ అయ్యారు. ఆమె వీడియో తెగ వైరల్‌ అయ్యింది. మన విషయానికొస్తే.. ముద్దులు విసరడంలో మొనగాడు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లినే. సెంచరీ కొట్టినా, భారత్‌ విజయం సాధించినా.. తప్పకుండా స్టాండ్స్‌లోకి ఓ ఫ్లైయింగ్‌ కిస్‌ పంపిస్తాడు. చాలా సందర్భాల్లో ఆ ముద్దులు తన నెచ్చెలి అనుష్క శర్మకి చేరతాయి. చాన్నాళ్లు అతగాడు వందకు దూరం కావడంతో.. ‘వీ వాంట్‌ సెంచరీ.. వీ వాంట్‌ ఫ్ల్లయింగ్‌ కిస్‌’ అని అమ్మాయిలు ప్లకార్డులు పట్టుకొని మరీ అడిగారు. ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి.. చిన్నగా బ్యాటుతో గాల్లోకి ముద్దులు రువ్వాడు. ఈసారి ప్రేక్షకుల గ్యాలరీలో అనుష్క లేకపోవడంతో ఆ ముద్దు ఎవరికోసం అనే సందేహాలు వెల్లువెత్తాయి. ఇవన్నీ చూస్తుంటే ముద్దుకు హద్దులుంటే మంచిదనీ, అది అన్నివేళలా ఆకట్టుకోదనీ అర్థం కావట్లేదూ?

అసలు ముద్దంటే ఏంటి? అని ఎవరైనా లవ్వాలజిస్టులను అడిగారనుకోండి.. అది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం, ఇష్టాన్ని చూపించే కొలమానం అంటుంటారు. ఆ ఆపేక్ష చూపించేవారు దూరంగా ఉంటే ముద్దుని గుప్పిట్లో బంధించి అలా గాల్లోకి వదులుతుంటారు. ఇది కుర్రది-కుర్రాడు, ఆడామగా మధ్యే ఇచ్చిపుచ్చుకోవాలనే నిబంధనేం లేదు. ఓ తారక తన అభిమానులకు అందించొచ్చు. ఓ తండ్రి.. ప్రియమైన కూతురికి ఇవ్వొచ్చు. అయినా ఇది మన సంస్కృతే కాదు.. మన ఇంటాఒంటా లేనే లేదు అని ఎవరైనా వాదిస్తే ఆ మాట ఒప్పుకొని తీరాల్సిందే. మార్సెల్‌ డానేసి అనే రచయిత ‘ది హిస్టరీ ఆఫ్‌ ది కిస్‌’ అనే పుస్తకం రాశారు. అందులో ఈ ఫ్లయింగ్‌ కిస్‌ ట్రెండ్‌ 425 ఏళ్ల కిందట ఇరాక్‌లో మొదలైందన్నారు. అక్కడి భక్తులు.. తమ ఇష్టాన్ని, భక్తిని చెప్పడానికి భగవంతుడికి గాల్లోకి ముద్దులు విసిరే వారట. కుర్రాళ్లూ.. అదన్నమాట ఈ ముద్దుముచ్చట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని