మిలీనియలా.. జనరేషన్‌ జడ్‌నా?

కుర్రకారంటే ఎవరు? ఆకాశానికి నిచ్చెన వేసేవారు.. ఉత్సాహాన్ని గుప్పిట బంధించేవారు.. సృజనాత్మకతని జేబులో వేసుకొని తిరిగేవారు.

Published : 19 Aug 2023 00:53 IST

మిలీనియల్స్‌-జనరేషన్‌ జడ్‌ మధ్య వారధిగా ఉన్న తరం‘జనరేషన్‌ ఎక్స్‌’.
జనరేషన్‌ జడ్‌ తర్వాత తరాన్ని ‘బేబీ బూమర్స్‌’ అంటున్నారు.

కుర్రకారంటే ఎవరు? ఆకాశానికి నిచ్చెన వేసేవారు.. ఉత్సాహాన్ని గుప్పిట బంధించేవారు.. సృజనాత్మకతని జేబులో వేసుకొని తిరిగేవారు. కానీ ఈ యూత్‌లోనే మిలినీయల్స్‌, జనరేషన్‌ జడ్‌ అని రెండు రకాలుంటారని మీకు తెలుసా? ఎవరి దూకుడు ఎంత? ఎవరిది ఎలాంటి వ్యక్తిత్వం అంటే.. ఇదిగో ఇవీ లక్షణాలు.

సంప్రదాయ దూకుడు                  

  • 1980 నుంచి 1995 మధ్యకాలంలో కేర్‌మన్నవాళ్లు మిలీనియల్‌్్స. ప్రపంచవ్యాప్తంగా వీళ్ల సంఖ్య నూటా ఎనభై కోట్లు ఉంటుందని అంచనా.
  • పని, సరదాల్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలనుకునేవాళ్లు. అవకాశాల్ని వెతుక్కుంటూ ఎంతదూరమైనా వెళ్తారు. కెరియర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆస్కార్‌ గెలిచినంత సంబరపడతారు. జట్టుగా పని చేయడం ఇష్టం. సుస్థిరంగా ఉండే కొలువు కోరుకుంటారు.
  • సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధులు. డిజిటల్‌, టెక్నాలజీలపై మంచి పట్టు ఉంటుంది. వేటిని ఎలా ఉపయోగించాలో తెలుసు. దైనందిన సమస్యలకు డిజిటల్‌ పరిష్కారాలు వెతకడంలో ముందుంటారు. వీళ్లకి డీవీడీ ప్లేయర్లు, భారీ పర్సనల్‌ కంప్యూటర్లు, బుల్లి స్క్రీన్‌ సెల్‌ఫోన్లు తెలుసు.
  • మిలీనియల్స్‌కి ఎడాపెడా ఖర్చు పెట్టడమే కాదు.. అవసరమైతే పొదుపు పాటించడమూ తెలుసు.    ఆర్థిక మాంద్యం, విపరీతమైన నిరుద్యోగంతో అత్యధికంగా ప్రభావితం అయింది ఈ జనరేషనే.
  • సామాజిక మాధ్యమాల్ని అలవోకగా వాడేస్తుంటారు. భారత్‌లోని మొత్తం యువతలో 30శాతం మంది మిలీనియల్స్‌ ఏదో ఒక సోషల్‌ మీడియాని వాడుతున్నామని చెప్పారు. వీళ్లలో అత్యధికులకు ఇష్టమైనవి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌.

ఆధునికతకు చిరునామా

  • 1996 తర్వాత పుట్టిన వాళ్లు జనరేషన్‌ జడ్‌. వీరి సంఖ్య 110 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
  • సరదాల్ని స్ట్రా వేసుకొని మరీ పీల్చేయాలని భావించే రకం. కెరియర్‌తోపాటు.. వ్యక్తిగత జీవితానికీ పెద్దపీట వేస్తారు. నేనే రాజు నేనే మంత్రి అనుకునే రకం. బాస్‌ పెత్తనాన్ని సహించరు. ఆంక్షల్లేని ఉద్యోగాలంటేనే ఇష్టం. మల్టీటాస్కింగ్‌ వీరి ప్రత్యేకత. ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్షణాలు ఎక్కువ. స్టార్టప్‌లు పెట్టి సత్తా నిరూపించుకోవాలనుకుంటారు.
  • వీళ్లు టెక్‌ సావీలు. చేతిలో సెల్‌ఫోన్‌.. చెవిలో ఇయర్‌ ఫోన్‌.. చంకలో ల్యాపీ.. ఐప్యాడ్‌.. అపరిమితమైన వై-ఫై వాడకం.. వీరి తీరు. ఇహలోకంలో కన్నా అంతర్జాలంలోనే అధికంగా తచ్చాడుతుంటారు. వీళ్లది అచ్చమైన స్మార్ట్‌ఫోన్‌ లోకం.
  • అందరూ కాదుగానీ.. అత్యధికులు, ఉన్నదంతా ఊడ్చెయ్‌.. సరదాలకు ఓటేసెయ్‌.. అనే రకం ఈ జనరేషన్‌ జడ్‌. ఫ్యాషన్లు, గ్యాడ్జెట్ల కోసం అత్యధికం ఖర్చు చేస్తుంటారు. మార్కెట్‌లోకి ఏదైనా కొత్త ఫోన్‌ వచ్చిందా.. వీళ్ల చేతిలో పడాల్సిందే. సంప్రదాయ పొదుపు బాటలకి భిన్నంగా షేర్‌మార్కెట్‌లో పెట్టుబడుల వైపు చూస్తుంటారు.
  • పడక దిగడం ఆలస్యం.. సెల్‌ఫోన్‌ చేతిలోకి తీసుకొని సామాజిక మాధ్యమాల్లో గడుపుతుండటం.. జనరేషన్‌ జడ్‌ నైజం. వీళ్లకి బాగా ఇష్టమైనవి ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని