సరిగమల సాధనకు.. నీరసపడిపోయాను!

సవీ.. చిన్నప్పుడే నీ స్వర సాగర మథనం మొదలైందని తెలిశాక.. నీ తపన చూసి నా నరాలు జల్లుమన్నాయి. ఆ వయసులో పిల్లలంతా చెమ్మచెక్క, దాగుడు మూతలు, కోతికొమ్మచ్చి ఆడుతుంటే.. నువ్వు సరిగమల సాధన చేయడం చూసి నాలో నీపై ఇష్ట వేణువులు మోగాయి.

Published : 26 Aug 2023 00:11 IST

వెరైటీ ప్రేమలేఖ

స్వరాల సరితకు..

సవీ.. చిన్నప్పుడే నీ స్వర సాగర మథనం మొదలైందని తెలిశాక.. నీ తపన చూసి నా నరాలు జల్లుమన్నాయి. ఆ వయసులో పిల్లలంతా చెమ్మచెక్క, దాగుడు మూతలు, కోతికొమ్మచ్చి ఆడుతుంటే.. నువ్వు సరిగమల సాధన చేయడం చూసి నాలో నీపై ఇష్ట వేణువులు మోగాయి. సరిగమపదనిలలో ఉండే షడ్జమం అంటే నెమలి క్రీంకారమనీ, రిషభం అంటే ఎద్దు రంకె అనీ, గాంధర్వం అంటే మేక అరుపు అనీ, మధ్యమం అంటే క్రౌంచ పక్షి కూతనీ, పంచమం అంటే కోయిల గానమనీ, దైవతం అంటే గుర్రం సకిలింత అనీ, నిషాదం అంటే ఏనుగు ఘీంకారం అని నువ్వు చెబుతూ ఉంటే.. నీ సంగీత పరిజ్ఞానానికి పరవశించి నా ఆలి నువ్వేనని తాళం వేశాను. సులువుగా సావేరీ రాగం.. భయం లేకుండా భైరవి.. తేలికగా శివరంజని రాగాలు ఎత్తుకుంటుంటే నా దృష్టిలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు. నేను ఆలపించిన ప్రేమ రాగం నీకు నచ్చి.. మనం పల్లవి, చరణాల్లా కలిసి ఉందాం అన్నప్పుడు... నీతో పాణిగ్రహణం అయినట్టుగా కలలు కన్నాను. నీ దరహాసపు సవ్వడికి తలొగ్గి నీ సంగీత సాధనకు చేదోడుగా ఉండాలనుకున్నాను. జంట స్వరాలు అయ్యాకే మనం జంటగా మారదాం అనేసరికి తలాడించాను. సస రిరి గగ మమ పప దద నిని సస అంటుంటే నీ స్వరానికి చప్పట్లు చరిచాను. సస నిని దద పప మమ గగ రిరి సస, సస రిరి గగ మమ రిరి గగ దద మమ పప.. అని ఎంతకీ ఆపకుండా సాధన చేస్తూనే ఉంటే నీరస పడిపోయాను. నువ్వు ఎనిమిదో జంట స్వరం నేర్చుకునేసరికే నా ప్రేమ పంట పండేదెప్పుడనే వైరాగ్యంలో పడిపోయాను. అవేం పట్టించుకోకుండా.. సరళీ స్వరములు, హెచ్చుస్థాయి స్వరములు, దాటు స్వరములు అని ఏవేవో చెబుతుంటే.. ఈ జన్మకి నువ్వు నాకు పెళ్లి వరమీయవేమో అనే అనుమానం కలిగింది. చెలీ.. ఇకనైనా నీ సరిగమల ప్రవాహం చాలించు. మనకు పెళ్లై పిల్లలు పుట్టాక.. లాలీ జో అంటూ పాటలు పాడు. అప్పటిదాకా మనం యుగళ గీతాలు పాడుకుంటూ ప్రేమ లోకంలో విహరిద్దాం.

నల్లపాటి సురేంద్ర, అచ్యుతాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని