బాధల్ని ఖేర్‌ చేయలేదు..

‘నీ నటన నభూతో..’ అంటూ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ స్వయంగా లేఖ రాసి పంపారు. ‘ఒంటి చేత్తో అలా ఎలా బౌలింగ్‌ చేశావ్‌? ఒక్కసారి స్వయంగా చూడాలని ఉంది’ అంటూ సచిన్‌ తెందుల్కర్‌ ఇంటికి ఆహ్వానించాడు.

Published : 26 Aug 2023 00:21 IST

‘నీ నటన నభూతో..’ అంటూ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ స్వయంగా లేఖ రాసి పంపారు. ‘ఒంటి చేత్తో అలా ఎలా బౌలింగ్‌ చేశావ్‌? ఒక్కసారి స్వయంగా చూడాలని ఉంది’ అంటూ సచిన్‌ తెందుల్కర్‌ ఇంటికి ఆహ్వానించాడు. విమర్శకుల ప్రశంసలకైతే లెక్కే లేదు.. ‘ఘూమర్‌’తో ఇంతలా ఆకట్టుకుంది బాలీవుడ్‌ భామ సయామీ ఖేర్‌. ఈ నేపథ్యంలో సినీప్రయాణం, వ్యక్తిగత కబుర్లు.. సంక్షిప్తంగా...

పరిచయం: నటనతో అందరినీ మెప్పించి, పొగడ్తల్లో తడిసి ముద్దవుతున్న సయామీకి ఇదే తొలి చిత్రం కాదు. మన తెలుగు సినిమా ‘రేయ్‌’తోనే తెరంగేట్రం చేసింది. ఇప్పటికి తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో కలిపి తొమ్మిది సినిమాల్లో నటించింది. సొంతూరు నాసిక్‌. ముంబయిలో స్థిరపడింది.

ఎన్ని కష్టాలో: సినిమా కోసం ఆర్టిస్టులు చాలానే శ్రమిస్తుంటారు. బరువు పెరగడం, తగ్గడం, లుక్‌ పూర్తిగా మార్చడం.. ఇలాంటివి. వాళ్లతో పోలిస్తే సయామీ మరింత శ్రమించింది. ఈ సినిమాలో తను కుడి చేయి కోల్పోయినా పట్టుదలతో ఒంటి చేత్తో బౌలింగ్‌ చేసే క్రీడాకారిణిగా కనిపించింది. అది సహజంగా రావడానికి చేతిని వెనక్కి కట్టుకొని ఉండేది. అలాగే ఉంచి బౌలింగ్‌ చేయడం, పరుగెత్తడం, ఫీల్డింగ్‌ చేయడం.. చేసేది. షూటింగ్‌ గ్యాప్‌లో, తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడూ.. రోజుకి దాదాపు పది గంటలు బాధని పంటి బిగువున భరిస్తూ.. అలాగే ఉండేది. ఈ కష్టాలు ఊరికే పోలేదు. తను అత్యుత్తమ నటన ప్రదర్శించిందనీ, ఉత్తమ నటి అవార్డు గెల్చుకునే అవకాశాలున్నాయి అంటున్నారంతా.

సినిమా బాట: సయామీ నాన్న అద్వైత్‌ మాజీ సూపర్‌ మోడల్‌. అమ్మ ఉత్తర మాత్రే మాజీ మిస్‌ ఇండియా. బామ్మ ఉషాకిరణ్‌ అలనాటి నటి. ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌తోనూ బంధుత్వం ఉంది. దీంతో సహజంగానే సినిమాలపై మోజు మొదలైంది. ముంబయిలో డిగ్రీ పూర్తవగానే మోడలింగ్‌ మొదలు పెట్టింది. లివైస్‌, పాంటలూన్స్‌, లోరియల్‌లాంటి సంస్థల వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ గాళ్‌గానూ తళుక్కుమంది. తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

క్రీడాకారిణి: సయామీ అందగత్తే కాదు.. మంచి ఆటగత్తె కూడా. బ్యాడ్మింటన్‌ జూనియర్‌ నేషనల్స్‌లో ఆడింది. స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇప్పటికీ మంచి ఫ్రెండ్‌. తనతో కలిసి అప్పుడప్పుడు నెట్‌లో ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడింది. మహిళల జాతీయ క్రికెట్‌ జట్టుకి ఎంపికైనా మోడలింగ్‌ అవకాశాలు రావడంతో వెళ్లలేకపోయింది. యూనివర్సిటీ జట్టు తరఫున ఫుట్‌బాల్‌ కూడా ఆడేది.

సచిన్‌కి వీరాభిమాని: ఖేర్‌ సచిన్‌కి భక్తురాలు. ఆయన ప్రతి మ్యాచ్‌ని చూసేది. తరగతులు బంక్‌ కొట్టి ముంబయిలో మ్యాచ్‌లు చూడటానికి వెళ్లిపోయేది. ‘సచిన్‌ నా హీరో, స్ఫూర్తి, నా గురువు’.. అని తరచూ చెప్పేది. తను సినిమాల్లోకి వెళ్తున్నప్పుడు ‘నువ్వు యాక్టింగ్‌తో ఇరగదీయ్‌.. సచిన్‌ నిన్ను ఇంటికి పిలుస్తారేమో’ అని వేళాకోళమాడేవారు స్నేహితులు. చివరికి అదే నిజమైంది. ‘ఘూమర్‌’లో సయామీ చిత్రమైన బౌలింగ్‌ యాక్షన్‌ చూసి తనని స్వయంగా ఇంటికి పిలిచారు. నెట్‌లో ఆమె బౌలింగ్‌ చూసి ఆశ్చర్యపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని