సోలో లవ్వే..సో బెటరు!

పాతికేళ్ల శ్రేయస్‌ అందగాడూ.. ఆరంకెల జీతం అందుకునే కుర్రాడు. వారాంతాల్లో ఖరీదైన రెస్టరంట్లకు వెళ్తాడు. థీమ్‌పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తాడు. మ్యూజియమ్‌లు సందర్శిస్తాడు

Published : 02 Sep 2023 00:22 IST

పాతికేళ్ల శ్రేయస్‌ అందగాడూ.. ఆరంకెల జీతం అందుకునే కుర్రాడు. వారాంతాల్లో ఖరీదైన రెస్టరంట్లకు వెళ్తాడు. థీమ్‌పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తాడు. మ్యూజియమ్‌లు సందర్శిస్తాడు. పార్టీలూ.. పబ్‌లూ సరేసరి. ఇవన్నీ చేసేది జంటగా కాదు.. ఒంటరిగానే! అంతేనా.. అప్పుడప్పుడూ తనకు తానే ఖరీదైన బహుమానాలు ఇచ్చుకుంటాడు. ఏంటీ తీరు? అంటే సెల్ఫ్‌ లవ్‌.. దీన్నే ‘మాస్టర్‌ డేటింగ్‌’ అంటున్నారు. అంతర్జాలంలో, వాట్సప్‌ బృందాల్లో ఎక్కువగా ఇదే చర్చ నడుస్తోంది ఇప్పుడు.

మనదాకా వచ్చేసింది

అమ్మాయి, అబ్బాయి కలిసి చేస్తేనే డేటింగ్‌ అనేది పాత ముచ్చట. అమ్మాయి లేదా అబ్బాయి ఒంటరిగా తనని తాను ప్రేమించుకునే డేటింగ్‌ ట్రెండ్‌ జోరందుకుంటోంది. సోలో బతుకే సో బెటరూ.. అనుకునే చుక్కనమ్మలూ, సక్కనయ్యలూ.. లవర్‌ కోసం సమయం కేటాయించలేని పిసినారులూ.. ‘నచ్చినవాళ్లని ప్రేమించడం తర్వాత.. ముందు నాకు నేనే నచ్చాలిగా’ అనుకునే తెలివైన ప్రేమికులూ ఈ ధోరణికి జై కొడుతున్నారు. వయసుకొచ్చినా జంట కట్టని ఒంటరులదీ ఇదే బాట. ఇదే కాన్సెప్ట్‌తో టిక్‌టాక్‌లో ఓ బుల్లి వీడియో వస్తే అది కోటిమంది కుర్రకారు సెల్‌ఫోన్లలో చక్కర్లు కొట్టింది. టిక్‌టాక్‌ ఇండియాలో నిషేధంలో ఉందిగానీ.. లేకపోతే మరింత వేగంగా ముందుకెళ్లేదే! అసలు ఈ సోలో డేటింగ్‌తో లాభాలేంటి అని ఎంబీఏ విద్యార్థి మణిని అడిగితే.. ‘మాస్టర్‌ డేటింగ్‌తో మస్త్‌ లాభాలున్నాయి. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా ఉండటమెలాగో తెలుస్తుంది. మనకి మనం బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు వాటిని చేరుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని మనం లవ్‌ చేసుకున్నప్పుడే ఇతరుల్నీ బాగా అర్థం చేసుకోవచ్చు’ అంటున్నాడు. అయితే ఈ సోలో లవ్వే సో బెటరూ అనుకునేవాళ్లలో అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. మాస్టర్‌ డేటింగ్‌ అనే పదం పాశ్చాత్య ప్రపంచంలో మొదలైనా.. ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లాంటి భారతీయ మెట్రో నగరాల్లోనూ బాగా వినిపిస్తోంది. ఈ తరహా డేటింగ్‌ ప్రతి కుర్రకారుకూ అవసరమే అంటున్నారు సైకాలజిస్టులు. వారంలో ఒక్కరోజైనా సెల్ఫ్‌ డేటింగ్‌కి వెళ్తుంటే.. మనసుకి ఉల్లాసం.. ఉత్సాహం ఉంటుందంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని