మహిళా బిల్లుకి.. కథానాయికల వందనం!

అమ్మాయిలు అన్నాక సౌందర్యవతులు ఉంటారు.. ఐశ్వర్యవంతులూ కనిపిస్తారు. కానీ రాజకీయంగా వాళ్ల ప్రాతినిధ్యం స్వల్పం. అది మారాలంటే.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒక్కటే పరిష్కారం!

Updated : 23 Sep 2023 06:31 IST

భారతీయ మహిళలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఆ సంతోషంలో కథానాయికల పేర్లతో ఓ అమ్మాయి సరదాగా రాసిన లేఖ..

అమ్మాయిలు అన్నాక సౌందర్యవతులు ఉంటారు.. ఐశ్వర్యవంతులూ కనిపిస్తారు. కానీ రాజకీయంగా వాళ్ల ప్రాతినిధ్యం స్వల్పం. అది మారాలంటే.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒక్కటే పరిష్కారం! చరిత్ర తిరగేస్తే.. ప్రతి రంగంలో మహిళలది ప్రధాన భూమికనే. మాకు అప్పగించిన పనిని నిత్యము సమర్థంగా చేస్తూనే ఉంటాం. ఈ సమాజం అభివృద్ధి దిశగా ముందుకెళ్లడానికి అందరితో స్నేహపూర్వక పోటీలో ఉంటాం. అందుకే ఇది మాకు ప్రీతిపాత్రమైంది. మా కీర్తిప్రతిష్ఠలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు మహిళలందరికీ విజయము, శాంతి  చేకూర్చుతుంది. ఎన్నాళ్లుగానో మేం అంకితభావంతో పోరాడితే, ఎట్టకేలకు మా మొర ఆలకించారు. అదృష్టం, రాశిఫలాలు కలిసొచ్చి ఇన్నాళ్లకు మా ఆశయం నెరవేరింది. ఈ బిల్లు రాధా?.. రాధిక.. అని అలసిపోయిన మాకు శుభవార్త చెప్పారు. అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ మద్దతుతో, సంయుక్తంగా ఓటేశారు. దశాబ్దాల కిందటే ఇది అమలవ్వాల్సింది. అప్పుడు బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ మేం లక్షలాది కరదీపికలు పంచాం. విద్యా సంస్థల్లో సమావేశాలు ఏర్పాటు చేశాం. చేసిన పూజలు లెక్కే లేదు. ఏదేమైనా అనుకున్నది జరిగింది. ఈ మహిళా బిల్లు అన్నివిధాలా మాకు సురక్షితమైనది. ఇది మా భవిష్యత్తుని రోజాపువ్వులా వికసింపజేయిస్తుంది. ఏదేమైనా అనుకున్నదే తడవుగా.. మీనమేషాలు లెక్కించకుండా.. ఆమోదించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సంతోషంలో భవిష్యత్తులో జరగబోయే మంచిని తలచుకుంటూ ఊహల్లో ఊరేగుతాం. శుభఫలితాలకై ఆర్తిగా ఎదురు చూస్తాం. ఈ బిల్లుకి ఏ ఆటంకాలూ ఎదురుకాకుండా అంతా జయప్రదంగా అమలు జరగాలని ప్రార్థిస్తున్నాం.
పంపినవారు: జముళ్లముడి ఆల్‌ఫ్రెడ్‌ గజ్జలకొండ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని