కాలేజీ దాటాం..కొలువూ.. మురిపిద్దాం!

కొందరు క్యాంపస్‌ దాటకుండానే కొలువు సాధిస్తారు. ఇంకొందరు ఎన్నో దండయాత్రలు చేస్తేగానీ ఉద్యోగం దక్కించుకోరు. ఎవరెలా గమ్యం చేరినా.. ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో కొలువు ఒక కీలక మైలురాయి. ఈ దశలో అడుగులు సరిగా పడితేనే.. కెరియర్‌ పరుగులు పెడుతుంది

Updated : 23 Sep 2023 06:26 IST

నిన్నటిదాకా పుస్తకాలతో కుస్తీలు... నేటి నుంచి ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లతో దోస్తీ! ప్రేమలు, ఫ్రెండ్షిప్పులూ, సరదాలు.. గతం. బరువులు, బాధ్యతలు, టార్గెట్లు.. వర్తమానం! కాలేజీ దాటి, కొలువులో చేరిన కుర్రకారు పరిస్థితి ఇది. ఈ కొత్త పాత్రలో కుదురుకోవడానికి కొందరు నానా హైరానా పడుతుంటారు. ఇదే సమస్యని నిపుణుల ముందుంచాం. మొదటి అడుగు నుంచే మంచి ఉద్యోగిగా మారే మతలబేంటో వారు సెలవిస్తున్నారిలా.

కొందరు క్యాంపస్‌ దాటకుండానే కొలువు సాధిస్తారు. ఇంకొందరు ఎన్నో దండయాత్రలు చేస్తేగానీ ఉద్యోగం దక్కించుకోరు. ఎవరెలా గమ్యం చేరినా.. ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో కొలువు ఒక కీలక మైలురాయి. ఈ దశలో అడుగులు సరిగా పడితేనే.. కెరియర్‌ పరుగులు పెడుతుంది. జీవితం మంచి మలుపు తీసుకుంటుంది. కానీ.. ఈ మార్పు స్వీకరించడంలో కొందరు తడబడతారు. మరికొందరు అనవసర కలతకు లోనవుతారు. నిజానికి ఉద్యోగంలో చేరడం అనేది ఎవరికైనా వేడుక చేసుకునే సందర్భం. అది సానుకూలంగా మొదలైతేనే కెరియర్‌కి శుభప్రదం.

మీదైన ముద్ర: కాలేజీ కుర్రాడు ఎవరైనా.. నచ్చిన సినిమా కొత్త థియేటర్‌లో ఆడుతుంటే.. అక్కడికెళ్లి కామ్‌గా ఉంటాడా? పక్క కాలేజీలో స్పోర్ట్స్‌ మీట్‌ జరుగుతుంటే ప్రతాపం చూపించకుండా వదిలేస్తాడా? ఎక్కడైనా రచ్చ రచ్చ చేసేస్తారు. ఇక్కడా అంతే. ఆఫీసుకి కొత్త అనుకొని బెరుకుగా ఉండాల్సిన పనిలేదు. మొదటి రోజు నుంచే అల్లుకుపోవాలి. ఉత్సాహం ఉట్టి పడాలి. అప్పుడే యాజమాన్యం దృష్టిలో పడతాం. చొరవ తీసుకుంటుంటేనే పరపతి పెంచుకోగలుగుతాం. అలాగని మరీ అతి చేయడం అంత ఆరోగ్యకరమేమీ కాదు. కార్యాలయంలో సీనియర్లతో గౌరవ పలకరింపులు, సాటి ఫ్రెషర్లతో కరచాలనాలు.. ఈ కలుపుగోలు పద్ధతికి ఎవరైనా ఫిదా అయిపోతారు. వాళ్ల మనసుల్లో మనకు పాజిటివ్‌ స్థానం కట్టబెట్టేస్తారు.

పక్కా ప్రణాళికతో: కాలేజీకెళ్లడానికి విద్యార్థికి ప్రత్యేక ప్రణాళికలేవీ ఉండవు. బెల్‌ కొట్టే సమయానికి క్లాసులో ఉండాలి. లెక్చరర్‌ చెప్పింది వినాలి. అసైన్‌మెంట్లు పూర్తి చేయాలి. గురువులే పట్టుబట్టి మరీ సబ్జెక్ట్‌ నేర్పిస్తారు. గుంపులో గోవిందయ్యలా ఉన్నా ఎవరేమీ అనరు. అత్తెసరు మార్కులతో పాసైనా అడిగేవాళ్లుండరు. ఇక మనకి ఏకాస్త సమయం దొరికినా చెలరేగిపోతుంటాం. ఉద్యోగిగా ఇదే తీరు కొనసాగిస్తానంటే కుదరదు. మీ పనిని భూతద్దంలో చూసి బేరీజు వేసేవాళ్లుంటారు. తప్పులు చేస్తే నిఘా వేసి పట్టేస్తారు. అది గమనించాలి. కాలేజీలోలాగా ఎప్పుడు పడితే అప్పుడు క్లాసులకు డుమ్మా కొట్టినట్టు ఆఫీసుకి సెలవులు పెడతానంటే కుదరదు. పంక్చువాలిటీని పాకెట్లో పెట్టుకొని తిరగాలి. అప్పజెప్పిన పనిని ఆడుతూపాడుతూ చేస్తావా.. పక్కా ప్రణాళికతో ముందే ముగిస్తావా అన్నది నీ ఇష్టం. ఇక్కడ మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. బాస్‌ని మెప్పించేలా తొలిరోజు నుంచే మీ ముద్ర వేయాలి.

హుందాతనం ఉట్టిపడేలా: క్లాస్‌రూంలో కథే వేరుగా ఉంటుంది. బాతాఖానీ ఎంతైనా వేసుకోవచ్చు. అడుగు బయట పెడితే ఏమైనా చేయొచ్చు. కానీ ఉద్యోగి అయ్యాక సీన్‌ పూర్తిగా మారిపోతుంది. మీకంటూ ఓ గౌరవప్రదమైన స్థానం వస్తుంది. అప్పటిదాకా మిమ్మల్ని చిన్న పిల్లాడిలా చూసినవాళ్ల పలకరింపులో తీరు మారుతుంది. మొత్తానికి మీ ఫేస్‌ వాల్యూ పెరుగుతుంది. దానికి తగ్గట్టే మీరూ మారాలి. చిలిపి చేష్టలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. హుందాతనాన్ని ఒంట్లోకి జొప్పించుకోవాలి. అలాగని సరదాలన్నీ మానుకొని రాత్రికి రాత్రే రాముడు మరీ మంచి బాలుడిలా మారిపోనక్కర్లేదు. సరదాలకు గిరి గీసుకొని హద్దుల్లో ఉంటే హుందాగా ఉంటుంది. మనం ఒక సంస్థ ప్రతినిధులం అన్న సంగతి మరవొద్దు.

సానుకూలంగా: కాలేజీ స్నేహితులతో కలిసి తిరుగుతాం.. కష్టసుఖాలు పంచుకుంటాం. ఎవడైనా నష్టం కలిగిస్తే.. ‘ఎంతైనా నా ఫ్రెండేగా’ అని సర్దుకుపోతాం. అంతా మనవాళ్లే అనుకుంటాం. ఆఫీసులోనూ అదే సూత్రం పాటించాలి. ఇక్కడ స్నేహితుల్లాంటి పోటీదారులుంటారు. మంచి మాటలు చెబుతూనే ముంచే సహోద్యోగులుంటారు. ప్రతి చోటా ఇది సహజం. పని చేయకుండానే పదోన్నతులు అందుకునేవాళ్లని చూసి రగిలిపోవాల్సిన పని లేదు. చాడీలు చెప్పి ఎడాపెడా ఎదిగిన వాళ్లపై ఏడవాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేసే పనిలో మనకు సంతృప్తి ఉందా, లేదా అన్నదే ప్రధానం. మనం నిబద్ధతకు నిలువుటద్దంలా ఉంటే.. సానుకూలతల్ని సొంతం చేసుకుంటే.. చెడు రాజకీయాలకు దూరంగా ఉంటే.. గుర్తింపు దానికదే వెంట పడి మరీ వస్తుంది.  
అప్రమత్తంగా: కళాశాలలో నిర్ణీత సమయంలోనే పరీక్షలు. చదువుకోవడానికి మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు ఉంటాయి. మల్టీపుల్‌ ఛాయిస్‌లు, నాలుగు ప్రశ్నల్లో నచ్చిన రెండింటికీ సమాధానాలివ్వడం.. ఇదీ వరస. ఆఫీసులో అయితే ప్రతిరోజూ పరీక్షే. అన్ని ప్రశ్నల్నీ అటెంప్ట్‌ చేయాల్సిందే. మనం చేసే ఓ పొరపాటే కెరియర్‌ని ఫెయిల్‌ చేయొచ్చు. ఒక్కోసారి సంజాయిషీ ఇచ్చుకునే అవకాశమూ దొరకదు.

అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్నచిన్న తప్పుల మరకలే ఉద్యోగం నుంచి తప్పుకునేలా చేస్తాయి.
అందుకని కళాశాల దశకి, వృత్తిగత ప్రారంభానికి వారధి సరిగా ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. మనం ఉత్తమ విద్యార్థి అయినా, కాకపోయినా కొలువులో కుదురుకోగలుగుతాం. మంచి ఉద్యోగి అనిపించుకోవాలంటే మాత్రం ఉత్తమంగా ఉండాల్సిందే. ఆల్‌ ది బెస్ట్‌.


ఇష్టంతోనే ముందుకు

కాలేజీ నుంచి ఉద్యోగంలోకి వచ్చారంటే.. యువత రంగుల ప్రపంచం దాటి.. వాస్తవిక జీవితంలోకి అడుగు పెట్టినట్టే. కెరియర్‌ ద్వారా గుర్తింపు, గౌరవంతోపాటు సవాళ్లు కాచుకొని ఉంటాయి. చేరాల్సిన లక్ష్యాలు గాబరా పెడుతుంటాయి. మనపై పెత్తనం చేసేవాళ్లు వస్తుంటారు. ఆందోళన అవసరం లేదు. ముందు చేస్తున్న పని మీద ప్రేమ, ఇష్టం పెంచుకుంటే సగం సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి. అనారోగ్యకరమైన పోటీకి దూరంగా ఉండటం, సమయ పాలన, పని పట్ల నిబద్ధత, యాజమాన్యం మేలు కోరుకోవడం, సంస్థ నిబంధనలకు లోబడి పని చేయడం.. ఈ అంతర్గత లక్షణాలను అందిపుచ్చుకుంటే మంచి ఉద్యోగిగా ప్రస్థానం మొదలవుతుంది. పని చేసే రంగంలో మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం.. బహిర్గతమైన మంచి లక్షణాలు. కొత్తగా కెరియర్‌ ప్రారంభించిన అమ్మాయి లేదా అబ్బాయి వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదగడానికి లెర్నింగ్‌, అన్‌లెర్నింగ్‌, రీ లెర్నింగ్‌.. అనే పద్ధతి అనుసరించాలి. నిరంతరం నేర్చుకోవడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం లెర్నింగ్‌. చేసిన తప్పులు, జరిగిన పొరపాట్ల నుంచి ఏం నేర్చుకోకూడదో తెలుసుకోవడం అన్‌లెర్నింగ్‌. ఈ రెండింటినీ సమ్మిళితం చేసి, ఆ అనుభవం ద్వారా పాఠాలు నేర్చుకోవడం రీ లెర్నింగ్‌.
ప్రొ.బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


ఆస్వాదించాల్సిందే..

ఆగస్టులో ఉద్యోగంలో చేరా. కాలేజీలో రోజూ సరదాల పండగలా ఉండేది. అక్కడ మార్కుల కోసం కష్టపడేవాళ్లం. ఇక్కడ డెడ్‌లైన్లు చేరడానికి శ్రమిస్తున్నాం. అక్కడ టీచర్లే అన్నీ నేర్పించేవాళ్లు.. ఇక్కడ నాకు నేనే అన్నీ నేర్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ పని ఒత్తిడి ఉన్నా.. ప్రాజెక్టు పూర్తైనప్పుడు, టార్గెట్లు చేరుకున్నప్పుడు, బాస్‌లు మెచ్చుకున్నప్పుడు కలిగే సంతోషం చాలా బాగుంది. కాలేజీలో మనకు నచ్చినట్టుగా ఉండేవాళ్లం. ఇక్కడ బాస్‌ని మెప్పించేలా పని చేయాలి అని అర్థమవుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్యోగంతో కుటుంబానికి అండగా ఉన్నామనే గర్వం కలుగుతోంది. ఏదేమైనా.. అన్ని పాత్రల్నీ ఆస్వాదిస్తేనే మనం ముందుకెళ్లగలుగుతాం.
రిషితారెడ్డి, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని