పరిణీతి చెందిన ప్రేమకథ

ప్రేమకథల నాయిక నిజ జీవితంలోనూ వలపు బాట పట్టింది. రాజకీయాలతో బిజీగా ఉండే యువ నేత ఆమె మనసు గెలుచుకున్నాడు.

Updated : 30 Sep 2023 06:53 IST

ప్రేమకథల నాయిక నిజ జీవితంలోనూ వలపు బాట పట్టింది. రాజకీయాలతో బిజీగా ఉండే యువ నేత ఆమె మనసు గెలుచుకున్నాడు. పెనవేసుకున్న రెండు హృదయాలు ఏడు, ఎనిమిదేళ్లపాటు తమదైన లోకంలో విహరించాయి. మనువాడే తరుణంలోనే తమ మధ్య ఏముందో చెప్పాయి... ఆ పరిణతి చెందిన పరిణీతి చోప్రా-రాఘవ్‌ చద్ధాల ప్రేమకథ ఏంటంటే..

  • పరిణీతి తెరపై మెరిసే నాయిక. రాఘవ్‌ రాజకీయం, వ్యాపారాల్లో రాణిస్తున్న నేత. వీళ్లిద్దరి మధ్య వలపు కథ ఎలా మొదలైందంటే.. ఇద్దరూ ఇంగ్లండ్‌లోనే చదువుకున్నారు. పరిణీతి మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌లో, రాఘవ్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో. అక్కడే పరిచయం ఏర్పడింది. రాఘవ్‌ చదువయ్యాక అక్కడే ఓ సంస్థ ప్రారంభించి కొన్నాళ్లు ఉన్నాడు. అప్పుడే ఇద్దరి మధ్యా రాకపోకలు సాగుతుండేవి. ఏడేళ్ల కిందట ‘ఇండియన్‌ యూకే అఛీవర్స్‌’కి ఓ సన్మానం చేశారు. దానికి ఇద్దరికీ ఆహ్వానం అందింది. అక్కడే ఈ జంట మరింత దగ్గరైంది.
  • ప్రేమాయణాన్ని చాలా ఏళ్లు గుట్టుగానే ఉంచారు. కానీ అసలే సెలెబ్రిటీలు కదా.. కెమెరాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేవి. అలా ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో, మరోసారి మొహాలీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూస్తూ, ఇంకోసారి రెస్టరంట్‌లో డిన్నర్‌ డేట్‌ చేస్తూ చిక్కిపోయారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రేమను బహిర్గతం చేశారు. అంతకుముందు పరిణీతి ‘చమ్కీలా’ సినిమా షూటింగ్‌ పంజాబ్‌లో జరిగినప్పుడూ.. రాఘవ్‌ చాలాసార్లు షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లేవాడు.
  • రాఘవ్‌ అందగాడు, డబ్బూపలుకుబడి ఉన్న వ్యక్తి. కాలేజీ రోజుల్లోనే చాలామంది అమ్మాయిలు వెంటపడేవారట. పరిణీతి సినిమా నటి. అభిమానించేవాళ్లు ఇష్టపడేవాళ్లకి కొరత లేదు. వాళ్లందిరినీ కాదని వీళ్లు ఒకరి వెంట ఒకరు పడ్డారు. ఇంతకీ ఇద్దిరికీ ఒకరిలో ఒకరికి ఏం నచ్చింది అనడిగితే.. ‘రాఘవ్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ చలించడు. ప్రశాంతంగా ఉంటాడు. మొహంలో చిరునవ్వు చెరగనీయడు. హ్యూమర్‌ ఎక్కువ. ఫ్రెండ్షిప్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. తనవాళ్లని చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. ఒకమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి?’ అంటూ తను అతడి ప్రేమలో పడ్డ కారణాలు వివరిస్తుంటుంది. పరిణీతిలో నీకేం నచ్చాయని రాఘవ్‌ని అడిగితే ‘తన నవ్వు, తన ఉత్సాహం, తన అందం. తను పక్కనుంటే సమయమే తెలియదు’ అంటాడు.
  • వాళ్ల ప్రేమ ఎంత గుట్టుగా సాగిందో.. ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి అంత అంగరంగవైభవంగా అందరికీ తెలిసేలా జరిగింది. దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఎంగేజ్‌మెంట్‌కి వేదికైంది. వజ్రాలతో పొదిగిన ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది పరిణీతి. వివాహం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పాలనురగ, బంగారు వర్ణాలతో మెరిసిపోయిన ప్రత్యేకమైన లెహెంగా ధరించి ముస్తాబై వచ్చింది పరిణీతి. దీన్ని ప్రఖ్యాత డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని