స్లీప్‌ డైవోర్స్‌..దగ్గరయ్యేందుకు.. దూరంగా!

యువతలో ఇప్పుడిదో హాట్‌ టాపిక్‌. గూగుల్‌ స్లీప్‌ డైవోర్స్‌...గాలింపుల్లో.. సామాజిక మాధ్యమ చర్చల్లో.. ఆఫ్‌లైన్‌ పిచ్చాపాటీ కబుర్లలో ఒకటే రచ్చ.

Published : 07 Oct 2023 00:37 IST

యువతలో ఇప్పుడిదో హాట్‌ టాపిక్‌. గూగుల్‌ స్లీప్‌ డైవోర్స్‌...గాలింపుల్లో.. సామాజిక మాధ్యమ చర్చల్లో.. ఆఫ్‌లైన్‌ పిచ్చాపాటీ కబుర్లలో ఒకటే రచ్చ. ఇది కొత్తగా పెళ్లైన జంటల మధ్య వచ్చే పొరపొచ్చాల ముచ్చట. ప్రౌఢ దంపతుల కలతల వ్యవహారాల యవ్వారం. కలిసి ఉండాల్సిన ఆలుమగలు.. వేరువేరు పడకల్లో సర్దుకునే కథ.

స్లీప్‌ డైవోర్స్‌ అంటే.. మొత్తం బంధానికి విడాకులేం కాదు. పడక గదిలో పడుచు జంటల మధ్య వచ్చే విరామం మాత్రమే. మనసులు కలబోసుకొని.. తనువులు పెనవేసుకునే తరుణంలో ఈ ఎడబాటు ఏంటి? అంటే దానికి బోలెడు కారణాలున్నాయి. భిన్న వాదనలున్నాయి. దూరమయ్యేది దగ్గరయ్యేందుకే అని కొందరంటే.. దూరంగా ఉండటం శాశ్వతంగా దూరవడానికి సంకేతం అని ఇంకొందరి వాదన. సాధారణంగా కొందరికి రాత్రి వేళల్లో.. ఏ చిన్న శబ్దం వినిపించినా చికాకుగా ఉంటుంది. పక్కవాళ్లు గురక పెడుతున్నా.. ఏదైనా అలికిడిగా ఉన్నా.. కంటిమీద రెప్ప వాలదు. ఇద్దరిలో ఒకరు నిద్రలేమి కారణంగా పక్కపై అటూఇటూ దొర్లుతుంటే.. ఆ ప్రభావం పక్కవారిపై తప్పకుండా ఉంటుంది. ఒకరికి ఏసీ పడదు.. ఇంకొకరికి అది లేకపోతే కుదరదు. పంకా తిరగట్లేదని అమ్మాయి గోల పెడుతుంటే.. బెడ్‌షీట్‌ నలిగిపోయిందని అబ్బాయి కోపం. లైట్‌ వేస్తే కొందరికి నిద్ర రాదు. తీస్తే ఇంకొకరు ఊరుకోరు. ఫలితంగా ఇద్దరిలో ఒకరు ఏ హాల్‌లోనో, పక్క బెడ్‌రూమ్‌లోనో చోటు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే స్లీప్‌ డైవోర్స్‌.

కలత లేని నిద్ర ఉన్నప్పుడే కలహాల్లేని కాపురం సాధ్యం అంటారు మానసిక నిపుణులు. నాణ్యమైన నిద్రతో కాగ్నిటివ్‌ లబ్ది చేకూరుతుంది. మానసిక సమస్యలు దూరమై ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అనుబంధాలు బలపడతాయి అంటారు వాళ్లు. అయితే.. పడకలు వేరైనప్పుడు.. శృంగారం దూరమైనప్పుడూ అనుబంధాలు బీటలు వారే ప్రమాదమూ లేకపోలేదంటూ మరో కోణంలో వాదించే సంప్రదాయవాదులూ లేకపోలేదు. ఈ అంశంపై అధ్యయనం చేసిన మానసిక శాస్త్రవేత్త సుజాన్‌ ఆల్బర్స్‌ చెబుతున్న వాదన ప్రకారం.. ‘జంటలో మంచి శృంగార భావనలు కలగాలంటే ముందు సుఖవంతమైన నిద్ర ఉండాలి. స్లీప్‌ డైవోర్స్‌ కారణంగా రాత్రంతా వేర్వేరు చోట నిద్ర పోయినప్పుడు సహజంగానే వాళ్లలో దగ్గరవ్వాలనే కోరిక మొదలవుతుంది. శారీరకంగా, మానసికంగా సాన్నిహిత్యం పెరుగుతుంది. అంతే తప్ప దూరంగా ఉంటే.. దూరమవుతారనే అభిప్రాయం సరికాదు’ అంటారామె. లాభనష్టాల మాట అలా ఉంచితే.. భారత్‌ సహా.. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌ విపరీతంగా పెరిగిపోతోందని అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌ (ఏఏఎస్‌ఎం) అధ్యయనాల్లో తేలింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని