కుర్రకారు మెచ్చే కారు

మధ్యవయసులో లేదా జీవితంలో స్థిరపడ్డాకే కారు ఓనర్లు కావడం అన్నది కాలం చెల్లిన మాట. ఉరకలెత్తే వయసులోనే.. కెరియర్‌ మొదలు పెట్టీపెట్టగానే కారు కొనడం అన్నది నయా ట్రెండ్‌.

Published : 14 Oct 2023 00:18 IST

యువాహనం

మధ్యవయసులో లేదా జీవితంలో స్థిరపడ్డాకే కారు ఓనర్లు కావడం అన్నది కాలం చెల్లిన మాట. ఉరకలెత్తే వయసులోనే.. కెరియర్‌ మొదలు పెట్టీపెట్టగానే కారు కొనడం అన్నది నయా ట్రెండ్‌. మొదటిసారి ఈ నాలుగు చక్రాల వాహనాన్ని సొంతం చేసుకుంటున్న వాళ్లలో 60శాతం మంది 25 నుంచి 40 ఏళ్ల వయస్కులే అంటోంది ఓ అధ్యయనం. అంటే వాళ్లంతా అచ్చంగా యువతనే. ఈ కుర్రకారు అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వాహనాలు కొన్ని.

మారుతి సుజుకీ బ్యాలెనో: 1.2 లీటర్ల డ్యుయెల్‌ జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇందులో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ రకాలున్నాయి. లీటరుకి 22.94 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది అంటోంది తయారీదారు. హ్యాచ్‌బాక్‌ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది.
ధర: రూ.6.45లక్షలు-రూ.9.88 లక్షలు

మారుతిసుజుకీ వ్యాగన్‌ ఆర్‌

తక్కువ ధరలో.. కాస్త ఎత్తుగా, విశాలంగా ఉండాలని భావించే యువత దీనివైపు మొగ్గు చూపుతున్నారు. గత నెలలో ఏకంగా 17 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
1, 1.2 లీటర్ల ఫైవ్‌స్పీడ్‌ మాన్యువల్‌/ఏఎంటీ ఇంజిన్‌తో వస్తోంది. 25 లీటర్ల అత్యధిక మైలేజీనిస్తుంది అంటోంది కంపెనీ.
ధర: రూ.5.54లక్షలు- రూ.7.42లక్షలు

టాటా నెక్సాన్‌

ఈమధ్యకాలంలో కుర్రకారు మనసు దోచుకుంటన్న వాటిలో ఈ కారు ముందు వరుసలో ఉంది. గత నెలలో ఏకంగా 16వేల కార్లని కొనుగోలు చేసింది యువత. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ఇది నెంబర్‌వన్‌. భద్రతపరంగానూ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ అందుకుంది. 1.2 పెట్రోల్‌, 1.5లీటర్ల డీజిల్‌  ఇంజిన్లతో అందుబాటులో ఉంది. మైలేజీ లీటరుకి 17.44 (పెట్రోల్‌), 24కి.మీ.(డీజిల్‌)కి.మీ.లు. ఇందులో బ్యాటరీ కారూ పెద్ద హిట్‌. ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌తో 465 కిలోమీటర్లు దూసుకెళ్తుంది.
ధర: రూ.8.09లక్షల నుంచి రూ.13.49లక్షలు

మారుతిసుజుకీ స్విఫ్ట్‌

పేరుకి తగ్గట్టే ఫీచర్లు, పనితీరులో చురుకుదనం ఈ మోడల్‌ సొంతం. 1.2లీటర్ల డ్యుయెల్‌ జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో లీటరుకి 22.56 కిలోమీటర్ల మైలేజీ వస్తుందంటోంది మారుతి.
ధర: రూ.6లక్షల నుంచి రూ.10లక్షలు

హ్యుందాయ్‌ క్రెటా

సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాల్లో ముందున్న మోడల్‌ హ్యుందాయ్‌ క్రెటా. ఎనిమిదేళ్ల కిందట భారత మార్కెట్లోకి వచ్చి అమ్మకాల్లో దూసుకెళ్తోంది. 1,493సీసీ, 250ఎన్‌ఎం టార్క్‌లతో దూసుకెళ్తుంది.
ధర: రూ.10.87లక్షలు- రూ.19.20లక్షలు
(ధరలన్నీ ఎక్స్‌ షోరూం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని