ఛేదిద్దాం.. NEXTING వలయాన్ని!

పెద్దగా కొనేదేం ఉండదు.. అయినా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో అదేపనిగా వెతికేస్తుంటారు! సమయం వృథా అని తెలుసు.. కానీ ‘బిగ్‌బాస్‌’ షోలో ఎవరెలా ఆడుతున్నారో తెలుసుకోవాలనుకుంటారు! సామాజిక మాధ్యమాల్లో ఎవరేం పోస్టులు పెట్టారు?

Updated : 14 Oct 2023 11:22 IST

పెద్దగా కొనేదేం ఉండదు.. అయినా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో అదేపనిగా వెతికేస్తుంటారు! సమయం వృథా అని తెలుసు.. కానీ ‘బిగ్‌బాస్‌’ షోలో ఎవరెలా ఆడుతున్నారో తెలుసుకోవాలనుకుంటారు! సామాజిక మాధ్యమాల్లో ఎవరేం పోస్టులు పెట్టారు? ఎవరి ఫొటోలకు ఎలాంటి కామెంట్లు వచ్చాయనే తహతహ! యువతలో ఇలాంటి మనస్తత్వం ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతోందట. ఏంటిది అంటే ‘నెక్స్టింగ్‌’ అంటున్నారు సైకాలజిస్టులు. ఆత్రుత.. అత్యుత్సాహం.. జిజ్ఞాస.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కాంక్ష.. పదం ఏదైనా కానివ్వండి.. అది నెక్స్టింగ్‌కి ప్రతిరూపమే అంటారు. యువత చర్చల్లోనూ ఈ పదం తెగ నానుతోంది.

ధోరణిలో కొట్టుమిట్టాడే ఓ కుర్రాడిని ఎందుకిలా చేస్తున్నావంటే.. ‘నా తప్పేం లేదు. నా మస్తిష్కంలోని ప్లెజర్‌ హార్మోన్‌ ‘డోపమిన్‌’ చేస్తున్న మాయే’ అనొచ్చు. ఈ హార్మోన్‌ అమ్మాయిలు, అబ్బాయిలను కుదురుగా కూర్చోనివ్వదు. అసలే ఉత్సాహం ఉరకలెత్తే యువతలో మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత రేకెత్తిస్తుంది. అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తిని నరనరాల్లో రగిలిస్తుంది. ఫలితం.. వాళ్లకు తెలియకుండానే ‘నెక్స్ట్‌ ఏంటి?’ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది ఒక పరిధికి లోబడి ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఉత్సాహం అతిగా మారినప్పుడే వస్తుంది చిక్కంతా. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోర్కెతోపాటు.. ప్రతి విషయంపై ఒక అంచనాకు వచ్చేస్తారు. అంటే ఉదాహరణకు ఈ ప్రపంచకప్‌లో విజేత వీళ్లేనని బల్లగుద్ది మరీ చెప్పేస్తారు. ఫలానా సినిమాలో తర్వాత సన్నివేశం ఊహిస్తారు. ఇదే జరిగి తీరుతుందని పక్కవాళ్లతో వాదిస్తారు. అంచనాలు నిజమైతే ఓకే.. తలకిందులైతే తల్లడిల్లిపోతారు. పెట్టిన ఫొటో, కొట్టిన కామెంట్‌కి అనుకూలమైన స్పందన రాకపోతే ఆగమాగం అవుతారు. సినిమాలు, ఆటలు, సామాజిక మాధ్యమాలు, ప్రేమలు.. ఇలా యూత్‌కి ఆసక్తి ఉన్న ప్రతి రంగంలోనూ ఇదే తీరు. ఈ ఆలోచనలు, అంచనాల ప్రవాహం నిరంతరం కొనసాగి ఒక్కోసారి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. భవిష్యత్తును, జరగబోయే సన్నివేశాల్ని ఊహిస్తూ, అంచనాలు కడుతుంటే.. వర్తమానంలో అనుభవించాల్సిన విలువైన సమయం హరించుకుపోతుందనే వాస్తవాన్ని గ్రహించలేరు.

అడ్డుకట్ట పడాలిలా..

  • నిశ్చలమైన నీటిలో ఓ గులకరాయి విసిరితే వలయాలు ఏర్పడినట్టు.. ఆలోచనలూ చెల్లాచెదురవుతాయి. కాబట్టి మనసుని కుదిపే ఆలోచనలు వస్తుంటే.. చేస్తున్న పనిని తక్షణం ఆపేయాలి. చిన్న విరామం ఇవ్వాలి.
  • నెక్స్టింగ్‌ అత్యుత్సాహం కనపడగానే సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. గాలి పీల్చుకొని వదలాలి. దాంతో ఊహా ప్రపంచం వదిలి వాస్తవంలోకి వచ్చేస్తాం.
  • ఆ ఆలోచనలు వస్తున్నప్పుడు మనల్ని మనం వేరే వ్యక్తిగా భావించుకోవాలి. ఈ ఊహా లోకంలో విహరిస్తుంటే లాభనష్టాలేంటో బేరీజు వేసుకోవాలి.
  • అత్యుత్సాహం ఆలోచనలు రాగానే ఒక్కసారి లేచి కాసేపు అటూఇటూ తిరగాలి. సన్నిహితులతో ఒకట్రెండు నిమిషాలు మాట్లాడాలి.
  • ఊహల్లో ఉండటం వల్ల ఏమేం నష్టాలున్నాయో.. జాబితా రాసుకోవాలి. వాస్తవ ప్రపంచంలో ఉంటానని మనకు మనమే చెప్పుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని