కోహ్లిలా కుమ్మేద్దాం..

దిగ్గజ క్రికెటర్లలో ముందువరుస. ఆటలో అడుగుపెట్టి పదిహేనేళ్లైనా అదే దూకుడు.. రిటైరయ్యే వయసులోనూ క్రికెట్‌పై అంతే మమకారం.. ఇవీ విరాట్‌ కోహ్లి గురించి చెప్పుకొని తీరాల్సిన విషయాలు.

Updated : 28 Oct 2023 09:39 IST

దిగ్గజ క్రికెటర్లలో ముందువరుస. ఆటలో అడుగుపెట్టి పదిహేనేళ్లైనా అదే దూకుడు.. రిటైరయ్యే వయసులోనూ క్రికెట్‌పై అంతే మమకారం.. ఇవీ విరాట్‌ కోహ్లి గురించి చెప్పుకొని తీరాల్సిన విషయాలు. ఈ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్న తన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే..

  • మమకారం: చాలామందికి చేస్తున్న ఉద్యోగంలో.. ఎంచుకున్న ఆటలో.. కొన్నేళ్లు గడిస్తే అనాసక్తి మొదలవుతుంది లేదా అలసిపోతారు. కానీ కోహ్లిలో ఇప్పటికే అదే తృష్ణ.
  • ఎన్నో రికార్డులు కొల్లగొట్టినా.. ఇంకా సాధించాలనే కాంక్ష. అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఎలా ఉండేవాడో.. 35 ఏళ్ల వయసులోనూ అదే తీరు కొనసాగిస్తూనే ఉన్నాడు. దీనంతటికీ కారణం అతడికి ఆటపై ఉన్న మమకారమే. ఇంకా సాధించాలనే కసే.
  • ఆత్మవిశ్వాసం: ఏ క్రికెటర్‌ అయినా డకౌట్‌ అయితే డీలా పడిపోతాడు. సెంచరీ చేస్తే గాల్లోకి పంచ్‌లు విసురుతాడు. విరాట్‌ మాత్రం మైదానంలో దిగిన ప్రతిసారీ  ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోతాడు. జీరోకి వెనుదిరిగినా.. తర్వాత మ్యాచ్‌లో సెంచరీ కొడతాననే ధీమాతో ఉంటాడు. జట్టు బౌలర్లు వికెట్లు తీసినా, తోటి ఆటగాడు సెంచరీ బాదినా సింహనాదం చేస్తాడు. ఈ రికార్డుల రారాజు తన కెరియర్‌లో కొన్నిసార్లు పరుగులు చేయని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా.. ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరనీయడు.
  • అంకితభావం: ఆట పట్ల ఇష్టం ఉండటం వేరు. దానికోసం అంకితభావంతో పని చేయడం వేరు. మ్యాచ్‌ ఉన్నా, లేకపోయినా.. సాధన ఆపడు కోహ్లి. రాత్రి పదకొండు దాటితే ఇంట్లో ఉండాల్సిందే. పార్టీలకు దూరం. వాటితో ఆటపై ఏకాగ్రత కుదరదంటాడు. మ్యాచ్‌లు ఉన్నా, లేకపోయినా రోజుకి రెండు గంటలైనా సాధన చేయాల్సిందే. ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది ఇష్టంతో చెయ్‌. కష్టపడు. ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయినా ఏదో ఒకరోజు తప్పకుండా విజయం సాధిస్తావు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
  • ఫిట్‌నెస్‌: క్రికెట్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్‌ ఎవరు అంటే సమాధానం కోహ్లి పేరే వస్తుంది. ప్రొఫెషనల్‌ అథ్లెట్‌లాంటి శరీరాకృతి అతడి సొంతం. ఈ వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ చిరుతలా పరుగెత్తుతాడు. దానిక్కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ‘వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తడానికి, బాగా ఫీల్డింగ్‌ చేయడానికి ఫిట్‌నెస్‌ అవసరం. అంత కన్నా ముఖ్యం నేను ఆరోగ్యకరమైన జీవితం గడపాలి’ అంటుంటాడు.
  •  నాయకుడు: గతంలో ఎన్నో మరపురాని విజయాలకు కోహ్లి నాయకత్వం వహించాడు. ప్రస్తుతం జట్టుకి కెప్టెన్‌ కాకపోయినా.. తన అనుభవం, అవసరం ఉన్నప్పుడు ముందుంటాడు. కుర్రాళ్లకు మార్గదర్శకత్వం వహిస్తాడు. చొరవ తీసుకుంటాడు. తాను స్వతహాగా లీడర్‌ని అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు.
  •  చివరి వరకూ: క్రికెట్‌లో కోహ్లిని ఛేదనలో మొనగాడు అంటుంటారు. ఆశలు వదిలేసిన దశ నుంచి, చివరి వరకూ పోరాడి ఎన్నోసార్లు జట్టుని గెలిపించిన సందర్భాలున్నాయి. ఇది ఓటమిని ఒప్పుకోని అతడి తత్వాన్ని సూచిస్తుంది. క్రికెట్‌కే కాదు.. ప్రతి రంగానికీ, యువతకి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని