పెళ్లి గోలతో కష్టాల లొల్లి!

సాఫ్ట్‌వేర్‌ కొలువు చేసుకుంటూ.. సరదాగా సాగిపోతున్న నా జీవితంలోకి¨ కన్నవాళ్లు పెట్టే పెళ్లి గోలతో కష్టాల లొల్లి మొదలైంది. షాదీ చేసుకోకుంటే చావగొట్టేలా ఉన్నారని.. సతి కోసం సామాజిక మాధ్యమాల వెంట పడ్డాను. అందమైన ప్రొఫైల్‌ పిక్‌లు చూసి ఫేస్‌బుక్‌లో అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టాను.

Published : 11 Nov 2023 01:20 IST

సాఫ్ట్‌వేర్‌ కొలువు చేసుకుంటూ.. సరదాగా సాగిపోతున్న నా జీవితంలోకి¨ కన్నవాళ్లు పెట్టే పెళ్లి గోలతో కష్టాల లొల్లి మొదలైంది. షాదీ చేసుకోకుంటే చావగొట్టేలా ఉన్నారని.. సతి కోసం సామాజిక మాధ్యమాల వెంట పడ్డాను. అందమైన ప్రొఫైల్‌ పిక్‌లు చూసి ఫేస్‌బుక్‌లో అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టాను. ఎవరైనా కరుణించకపోతారా అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశాను. ఎట్టకేలకు నా అభ్యర్థనను ఓ అమ్మాయి ఆమోదించడంతో ఆస్కార్‌ గెలిచినంత సంతోషంతో ఎగిరి గంతేశాను. వారం తిరగకముందే తెలిసింది.. నాతో అచ్చికబుచ్చికలు ఆడుతోంది అమ్మాయి కాదు అబ్బాయని. ప్రొఫైల్‌ పిక్‌తో నన్ను ఏమార్చుతున్నాడని. ఆ వేదనలో ఉన్న నాకు ఓ తీయని స్వరంతో వాట్సప్‌లో ఓ వాయిస్‌ కాల్‌ రావడంతో, నాకోసం ఏ సుగుణ సుందరో చేసి ఉంటుందని లోలోపలే సంతోషపడ్డాను. ముసిముసి నవ్వులతో ‘హలో’ అనగానే అవతలివైపు ‘ఛీ.. కొంచెమైనా సిగ్గుండాలి కదా. నా డబ్బులు ఎప్పుడిస్తావు?’ అని అవతలివైపు ఆడ గొంతు చెడామడా తిట్టడంతో ఆ ఫిమేల్‌ నేను కొత్త బండి కొనడానికి మేలు చేసిన కొలీగ్‌ అని అర్థమైంది. ఎలాగోలా ఆమెని కూల్‌ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఓ చిన్నదానికి వలపు సందేశం పంపాను. ‘పట్టుమని పాతికమంది ఫాలోయర్లు లేరు.. వయసు చూస్తే ముప్ఫై దాటి మూడేళ్లైంది. పద్దెనిమిదేళ్ల పడుచు అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది ఆ చిన్నది. ఎక్స్‌లు, టెలిగ్రామ్‌లు, స్నాప్‌చాట్‌లు అన్నీ ప్రయత్నించి.. అలసిపోయి ఇంక నాకు పెళ్లి కాదని ఫిక్సైపోయాను. బాధల్ని తగ్గించుకోవడానికి గోవాకి వెళ్లిపోయి సముద్రంలో సరదాగా చేపలు పట్టుకుంటుంటే.. సరయు వచ్చి నా సరసన కూర్చుంది. సరదాగా మాట్లాడుతూ నన్ను ముగ్గులోకి దింపింది. రెస్టరంట్లకు తిప్పుతూ.. విలాసాలకు సై అంటూ.. మూడు రోజుల్లోనే నిండుగా ఉన్న నా పర్సుని ఖాళీ చేయించేసింది. అయినా ఫర్లేదని మా ఇంటికి తీసుకొచ్చి తనని నా ఇంటిదాన్ని చేసుకుంటానంటే.. పగలబడి నవ్వి నన్ను పాగల్‌గాడిలా చూసింది. అన్నీ ట్రై చేశాక.. సామాజిక మాధ్యమాలు సతి కోసం కాదు, సరదాకు మాత్రమే అని తెలుసుకున్నాక.. ఇక అమ్మానాన్నలు చూసిన అమ్మాయినే ఓకే చేయాలని ఒట్టేసుకున్నాను.
పంగా సాంబశివారెడ్డి, కడప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని