అవినీతి అంతమే.. మా పంతం!

అవినీతి అంతమవ్వాలనేది అందరిమాట... అందుకు మనమేం చేస్తున్నాం? అంటే సమాధానం ఉండదు. నిజాయతీపరులకు పట్టం కట్టడం అవినీతిని అణచడానికో మార్గం అంటోంది యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌.

Updated : 25 Nov 2023 01:35 IST

అవినీతి అంతమవ్వాలనేది అందరిమాట... అందుకు మనమేం చేస్తున్నాం? అంటే సమాధానం ఉండదు. నిజాయతీపరులకు పట్టం కట్టడం అవినీతిని అణచడానికో మార్గం అంటోంది యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌.

ప్రభుత్వంలో అవినీతి లేని శాఖలు అరుదు. రాజకీయ నాయకులు, సర్కారీ ఉద్యోగుల్లో అత్యధికులదీ అవినీతి బాటే. అవినీతి చేస్తూ పట్టుబడ్డా.. శిక్ష పడినవాళ్లని వేళ్లమీద లెక్కించొచ్చు. మరి ఈ దోపిడీ తగ్గేదెలా? ఇదే ఆలోచన పదమూడేళ్ల కిందట రాజేంద్ర పల్నాటికి వచ్చింది. భిన్నంగా ఆలోచించాడు. అవినీతి సరే.. నిజాయతీ, విలువలున్న కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులుంటారుగా! వారికి మద్దతునిస్తే.. గుర్తింపునిస్తే.. ప్రోత్సహిస్తే... ఈ సమాజం కొద్దిగానైనా మారుతుంది అనుకున్నాడు. ‘యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌’ ప్రారంభించాడు. అప్పట్నుంచి మార్పు కోసం వేలాది మంది యువకులను ఏకం చేస్తూ శాంతియుతంగా ముందుకు సాగుతోందీ సంస్థ.

కార్యక్రమాలివీ..

నిజాయతీకి పట్టం: తెలుగు రాష్ట్రాల్లో నిజాయతీగా పనిచేసి, అతి సామాన్య జీవితం గడుపుతున్న ఎమ్మెల్యేలను సత్కరించి వారిని నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు. గ్రామాలు పురోగమిస్తేనే దేశ భవిష్యత్తు అన్నారు మహాత్మా గాంధీ. ఆ పల్లెల భవిష్యత్తు ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల చేతుల్లో ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అహరహం శ్రమిస్తూ, గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచ్‌లను గుర్తిస్తూ వారిని సత్కరిస్తున్నారు. తెలంగాణలో ఉత్తమ గ్రామాలుగా నిలిచిన రంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం, కొమురంభీం జిల్లాలోని బీబ్రా, జగిత్యాల జిల్లా లక్ష్మిపురం నాగులపేట, వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం మరియపురం తదితర గ్రామాలను యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ బృందం సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఇతర గ్రామాల్లో తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు, ఫాలోవర్లు, మీడియా ద్వారా.. ప్రతి ఏడాది ఈ నిజాయతీపరులైన అధికారులు, సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలను గుర్తించి వాళ్లని గౌరవిస్తున్నారు.

వ్యతిరేకం: ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే ఎలాంటి సేవలు అందుతాయి? అధికారుల పనితీరు ఎలా ఉంటుంది? చెబుతున్నారు. లంచం ఇవ్వకుండా అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు, సలహాల పెట్టెలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి నివేదికలు జనం ముందు పెడుతున్నారు. 

అవగాహన: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిన సందర్భాలున్నాయి. ఈ చట్టం ద్వారా అక్రమాల్ని వెలుగులోకి తేవడం, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం లాంటివి చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు మందులు, నిత్యవసరాలు ఉచితంగా అందజేశారు. ప్రస్తుతం తినేవారు పెరుగుతున్నారు.. పండించే వారు తగ్గుతున్నారు. ఈ అసమతౌల్యాన్ని తగ్గించడానికి, వ్యవసాయానికి అండగా నిలవడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయమే ప్రాణంగా బతికిన వృద్ధ రైతులు, ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేస్తున్న యువ రైతులను సమాజానికి పరిచయం చేస్తున్నారు.

మంత్రి భాస్కర్‌, ఈటీవీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని