మరీ అంతొద్దు గురూ..

శ్రీకాంత్‌ వారం రోజులుగా సరిగా అన్నమే తినట్లేదు.. భారత్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు అనుశ్రీ ఉన్నట్టుండి ఏడుస్తోంది. ఎప్పుడు చూసినా చెక్కిళ్లపై కన్నీటి చుక్కలే.. నువ్వు అబ్బాయిలతో సన్నిహితంగా ఉండి మన పరువు తీస్తున్నావు అని తల్లి మందలించడమే కారణం

Updated : 25 Nov 2023 01:46 IST

శ్రీకాంత్‌ వారం రోజులుగా సరిగా అన్నమే తినట్లేదు.. భారత్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. 

అనుశ్రీ ఉన్నట్టుండి ఏడుస్తోంది.. ఎప్పుడు చూసినా చెక్కిళ్లపై కన్నీటి చుక్కలే.. నువ్వు అబ్బాయిలతో సన్నిహితంగా ఉండి మన పరువు తీస్తున్నావు అని తల్లి మందలించడమే కారణం.

వీళ్లే కాదు.. ప్రతిదానికీ అతిగా స్పందించడం.. లోలోన మథనపడటం.. చివరికి మానసిక కుంగుబాటుకి గురవడం ఈమధ్య కాలంలో చాలామంది యువతలో కనిపిస్తోంది. కోపం, సంతోషం, బాధ... ఇలాంటి భావోద్వేగాలు అందరిలో ఉంటాయి. అయితే వీటి డోసు ఎక్కువైనప్పుడే వస్తుంది చిక్కంతా. దీర్ఘకాలం ఇదే కొనసాగితే మానసిక రుగ్మతల బారిన పడటం ఖాయం. మరి ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడం ఎలా?

  • మనం మరమనుషులం కాదు. నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి. దుఃఖమొస్తే ఏడవాలి. భావోద్వేగాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించాల్సిందే. అయితే వాటిలో తీవ్రత ఉన్నప్పుడే కదా సమస్య. ఆ తీవ్రతను సానుకూలంగా మలచుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు పంచ్‌బ్యాగ్‌పై పిడిగుద్దులు విసురుతూ ప్రతాపం చూపడం.. వ్యాయామం చేయడం.. సినిమా చూడటం.. మనకిష్టమైన వ్యక్తులతో మాట్లాడటం. ఇలాంటివి భావోద్వేగ తీవ్రతను తగ్గిస్తాయి.
  • క్రికెట్‌ మ్యాచ్‌ మనకు అనుకూలంగా లేదు. టీవీ కట్టేసి బయటికెళ్లండి. ఎవరితోనో వాగ్వాదం జరుగుతోంది. అక్కడి నుంచి దూరంగా వెళ్లండి. భావోద్వేగ తీవ్రత పెంచే ప్రదేశం, మనుషుల నుంచి దూరంగా వెళ్లడం, విరామం తీసుకోవడం, ఒంటరిగా గడపడం.. ఇవన్నీ సమస్య తీర్చే మార్గాలే.
  • బాధకు కారణాలేంటి? బాధ తగ్గించే మార్గాలేంటి? ఒక పేపరుపై పెట్టండి. ఉదాహరణకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ పోయింది. గెలుపోటములు సహజం కదా! ఒక్కరే గెలుస్తారు కదా.. ఓటమి నాలాగే చాలామందికి బాధే.. అయినా అందరూ నాలాగే అతిగా ఆలోచిస్తున్నారా? ఇలా రాసుకుంటూ వెళ్తే.. మన ఆవేదనలో అర్థం లేదని తెలుస్తుంది.
  • ఇతరుల నుంచి ఆశించడం.. వాళ్లని అంచనా వేయడం.. ఈ రెండూ ఆపితే సగం సమస్య తీరినట్టే. మనం అనుకున్నది జరగనప్పుడే భావోద్వేగాలను నియంత్రించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అసలు అంచనాలు లేకుండా ఉండటం ఉత్తమం.
  • ప్రతికూల పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా మార్గాలేమైనా ఉన్నాయా? వెతకండి. ధ్యానం, యోగా.. తద్వారా మానసిక ప్రశాంతత, కంటినిండా నిద్ర.. ఇవన్నీ ఓవర్‌ రియాక్ట్‌ కాకుండా చేసే సాధనాలే. అంతర్జాలంలో వెతికితే వీటిని బోలెడు చిట్కాలు ఉంటాయి. ఇన్ని చేసినా.. ఈ అతిగా స్పందించడం ఆపలేకపోతే.. మానసిక నిపుణులనైనా కలవడం మంచిది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని