ఫిట్‌నెస్‌కి దిశానిర్దేశం..

తనేం సూపర్‌స్టార్‌ కాదు.. అయినా బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కి తనే చిరునామా! అడపాదడపా మిడిల్‌క్లాస్‌ అమ్మాయి పాత్రలు వేసినా.. అమ్మడు సూపర్‌మోడల్‌కి ఏమాత్రం తీసిపోదు...ఆ భామే దిశా పటానీ.

Updated : 09 Dec 2023 06:01 IST

తనేం సూపర్‌స్టార్‌ కాదు.. అయినా బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కి తనే చిరునామా! అడపాదడపా మిడిల్‌క్లాస్‌ అమ్మాయి పాత్రలు వేసినా.. అమ్మడు సూపర్‌మోడల్‌కి ఏమాత్రం తీసిపోదు...
ఆ భామే దిశా పటానీ. జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తూ అభిమానులకు మరోసారి ఫిట్‌నెస్‌ పాఠాలు బోధించింది. ఇంతకీ వర్కవుట్‌ సీక్రెట్స్‌.. సొగసు రహస్యాలు ఏంటంటే...

కసరత్తుల రహస్యం: ఎంత పని ఉన్నా, షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. రోజుకి కనీసం గంటసేపైనా జిమ్‌లో గడుపుతానంటోంది దిశా. దీంతోపాటు కిక్‌బాక్సింగ్‌ లేదా జిమ్నాస్టిక్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకుంటుంది. కార్డియో వర్కవుట్లతోపాటు వెయిట్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు చేస్తుంది. కార్డియోలో సైక్లింగ్‌, పరుగుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌లో డెడ్‌లిఫ్ట్‌లు, హిప్‌ థ్రస్ట్‌లు తన ఫేవరిట్‌. నాజూకైన తన శరీరంతో డెడ్‌లిఫ్ట్‌లు చేస్తుంటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. శరీరంలోని అనవసర కేలరీలు కరగడానికి తన వర్కవుట్‌ రొటీన్‌లో డ్యాన్స్‌ని తప్పనిసరి చేసుకుంటుందట. ఇంత ఫిట్‌గా ఉంటుంది గనకే ఎలాంటి ఫైటింగ్‌లు అయినా అవలీలగా చేసేస్తోంది.

ఇదే ఆహారం: కసరత్తులు చేస్తే ఫిట్‌గా తయారవుతాం. అది కాపాడుకోవాలంటే డైట్‌ సైతం సరిగా పాటించాల్సిందే. ఈ విషయం దిశాకి తెలుసు గనకే కచ్చితంగా ఫాలో అవుతుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమపాళ్లలో ఉండేలా చూసుకుంటుంది. పొద్దున మూడు ఎగ్‌వైట్స్‌, పాలు, పండ్లరసం, తృణధాన్యాల జ్యూస్‌ తీసుకుంటుంది. అన్నం, చపాతీ, ఆకు కూరలు, చికెన్‌లతో భోజనం, సాయంత్రాలు బాదం, పిస్తా, వేరుశనగ గుళ్లలాంటి పోషకాలు ఎక్కువ ఉండే స్నాక్స్‌ తీసుకుంటుంది. డిన్నర్‌లో అత్యధికంగా ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్త పడుతుంది. గుడ్లు, చికెన్‌, పప్పు, బ్రౌన్‌రైస్‌లతోపాటు సలాడ్లు తప్పనిసరి. తనకి స్వీట్లంటే మహా ఇష్టం. అయినా అరుదుగానే వాటిని తన డైట్‌లో భాగం చేసుకుంటుంది.

వీటితోపాటు యోగా, ఈతలను తన దినచర్యలో భాగం చేసుకుంటుంది దిశా. మీరూ పాటిస్తే నాలాగ ఫిట్‌నెస్‌గా ఉండొచ్చని యువతకు దిశానిర్దేశం చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని