గ్లామరే కాదు.. గ్రామరూ ముఖ్యమే!

పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. అన్నాడో కవి. అది అప్పుడు. ఇది టెక్‌ యుగం గురూ! కుర్రకారుకి సంప్రదాయాలతోపాటు చదువు, కొలువు, డబ్బు, గ్లామరూ ముఖ్యమే.

Published : 09 Dec 2023 00:04 IST

పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. అన్నాడో కవి. అది అప్పుడు. ఇది టెక్‌ యుగం గురూ! కుర్రకారుకి సంప్రదాయాలతోపాటు చదువు, కొలువు, డబ్బు, గ్లామరూ ముఖ్యమే. ఇప్పుడు గ్లామరే కాదు.. గ్రామరూ, భాష, ప్రవర్తించే పద్ధతీ చూస్తాం అంటున్నారు. ‘మ్యారేజీ సైట్లలో సంబంధాల కోసం వెతికేటప్పుడు మీరేం కోరుకుంటారు?’ అని ఓ డేటింగ్‌ యాప్‌ చేసిన అధ్యయనంలో ఇదిగో ఇలా సెలవిచ్చారు.

యువ నాడి

  • ఒకమ్మాయి లేదా అబ్బాయి ‘బయోగ్రఫీలో అసలు ముందు మీరేం చూస్తారు?’ అనడిగినప్పుడు తప్పుల్లేకుండా, పద్ధతిగా ఎవరి ప్రొఫైల్‌ అయితే ఉంటుందో.. ముందు వాళ్లపై మా దృష్టి పడిపోతుంది అన్నారు. తర్వాత ఫొటో, వస్త్రధారణ.. చూసి ఇతర వివరాల్లోకి వెళ్లిపోతారట.
  • తమ మనసులో ఉన్న విషయాన్ని చెప్పలేక తప్పుల తడకగా వివరాలు సమర్పించేవాళ్లని చూస్తే అస్సలు నచ్చదట. గ్రామర్‌, స్పెల్లింగ్‌ తప్పులుంటే ఆ ప్రొఫైల్‌ని 37శాతం మంది రిజెక్ట్‌ చేసేస్తారట. ఈ తప్పుల్ని అత్యధికంగా పట్టించుకునేది అమ్మాయిలే.
  • 22 శాతం మంది అందం, ఆస్తిపాస్తులు కాకుండా కేవలం తమలాంటి ఆసక్తులు, అభిరుచులు, ఇష్టాలు, గుణగణాలు.. కలిస్తేనే ఓకే చెప్పేస్తామని సెలవిచ్చారు.
  • అమ్మాయి అందంగా ఉంటే చాలు.. బంధానికి మేం ఓకే అంటాం అని ధీమాగా చెప్పిన మగానుభావులు 31శాతం మంది. దీనికితోడు కాస్త ఆత్మవిశ్వాసమూ ఉండాలనీ కోరుకున్నారు.
  • తాము కట్టుకోబోయేవాళ్లు సరదాగా, నవ్వించేలా ఉండాలని 38శాతం యువత బలంగా కోరుకుంటు న్నారు. వీటితోపాటు మంచి ఉద్యోగం, కుటుంబాన్ని బాగా చూసుకోవడం, ఒకర్నొకరు గౌరవించుకోవడం, ఆస్తిపాస్తులు.. ఇలాంటి అంశాలకూ యువత ప్రాధాన్యం ఇస్తోంది.

దేశంలోని ఆరు మెట్రో నగరాలు, మరో పది పెద్ద పట్టణాల్లోని 18 నుంచి 30 ఏళ్ల వయసున్న పదివేలమంది యువతతో మాట్లాడి ఈ అధ్యయనం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని