నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..

నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ.. నాకు ఊహ తెలిసేలోపే నా జీవితంలో భాగమయ్యావు. కాదుకాదు.. నా జీవితమంతా నిండిపోయావు.

Published : 16 Dec 2023 00:42 IST

 నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ.. నాకు ఊహ తెలిసేలోపే నా జీవితంలో భాగమయ్యావు. కాదుకాదు.. నా జీవితమంతా నిండిపోయావు. అఆలు, లతో మొదలు పెట్టి.. నన్ను నిండా ప్రేమలో ముంచేశావు.(కాస్‌ టీటా), (సైన్‌ టీటా) అంటూ మరింత దగ్గరయ్యావు. కలలోనూ.. ఇలలోనూ నా పక్కనే ఉంటూ నన్ను సొంతం చేసుకున్నావు. కానీ నీ అతి ప్రేమతో ఒక్కోసారి నాకు చిరాకేసేది. నిన్ను అమాంతం పక్కనపెట్టి హాయిగా ఉండాలనిపించేది. అంతలోపే నువ్వు లేకపోతే.. నా జీవితానికే అర్థం లేదంటూ మనసు పోరు పెట్టేది. అయినా.. నా బతుకంతా నువ్వే అయిపోయావు.. నా జీవితం సంతోషాల్లేక అమావాస్యలా మారిందని అప్పుడప్పుడు గోల చేస్తే.. ‘నీ భవిష్యత్తులో వెలుగులు నింపే పౌర్ణమి అతడే’ అంటూ ఊరడించారు అమ్మానాన్నలు. ఎవరెంత నచ్చజెప్పినా ఒకానొక సమయంలో నీ అతి జోక్యాన్ని తట్టుకోలేక నిన్ను దూరం పెట్టేశాను. అప్పుడుగానీ అర్థం కాలేదు.. నీ విలువేంటో! నువ్వు నా పక్కన లేకపోయేసరికి నన్ను కనీసం మనిషిలా కూడా చూడటం మానేశారు ఈ జనాలు. తప్పు తెలుసుకొని మళ్లీ నీ చేయందుకున్నా. కడదాకా నీతోనే నా జీవితం అని ఫిక్సయ్యా. నీపై నా ప్రేమను రెండింతలు చేశా. నువ్వూ అంతేగా. నేను నిన్ను ప్రేమిస్తే.. ఆ ప్రేమను తిరిగిచ్చేశావు. నన్ను ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టావు. నా జన్మకు కారణం మా అమ్మ అయితే... నేడు నేను సమాజంలో ఒక గౌరవస్థానం దక్కించుకున్నానంటే అది నీ చలవే. అందుకే.. ఓయ్‌ ‘చదువూ’ ఐ లవ్యూ. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.      

 అవదూత హరిప్రియ, నారాయణపూర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని