అంతమందిలో.. ప్రేమ అభ్యర్థనా?

ఆస్ట్రేలియా- భారత్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ముప్ఫైవేలమందితో కిటకిటలాడుతోంది స్టేడియం. ఓ పాతికేళ్ల యువకుడు తన మోకాళ్లపై కూర్చొని.. సినిమా హీరో స్టైల్లో ‘ఐలవ్యూ.. నా ప్రేమను అంగీకరించవూ’ అంటూ ఓ అమ్మాయికి ఎరుపు రంగు రోజా అందించాడు

Published : 23 Dec 2023 00:50 IST

ఆస్ట్రేలియా- భారత్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ముప్ఫైవేలమందితో కిటకిటలాడుతోంది స్టేడియం. ఓ పాతికేళ్ల యువకుడు తన మోకాళ్లపై కూర్చొని.. సినిమా హీరో స్టైల్లో ‘ఐలవ్యూ.. నా ప్రేమను అంగీకరించవూ’ అంటూ ఓ అమ్మాయికి ఎరుపు రంగు రోజా అందించాడు. ఆరు నెలలుగా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు తను. సిగ్గుల మొగ్గవుతూ అతడి చేయందుకుంది ఆ చిన్నది. వేలమంది చప్పట్లు చరిచారు. వందల సెల్‌ఫోన్‌ కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇలాంటి ‘పబ్లిక్‌ ప్రపోజల్స్‌’ ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి.  

స్టేడియం ఒక్కటేనా..? సినిమా థియేటర్‌.. సముద్ర తీరం.. పబ్లిక్‌ పార్క్‌.. షాపింగ్‌ మాల్‌.. ఇలా జనసమ్మర్థం ఉండే చాలా ప్రాంతాలు ప్రేమ, పెళ్లి అభ్యర్థనలకు వేదికలవుతున్నాయి. అపర ప్రేమికులు తమ సృజనాత్మకత అంతా చూపిస్తూ.. మనసుకి నచ్చినవారికి సరికొత్త రీతిలో ప్రపోజ్‌ చేస్తూనే ఉన్నారు. అసలు ప్రేమ, పెళ్లి అంటే.. ఇద్దరు మనుషుల మధ్య ఉండాల్సిన విషయం. రెండు మనసులు కలవాల్సిన సందర్భం. అలాంటి వ్యక్తిగత విషయాన్ని ఇంత ‘సీన్‌’ చేయాలా? వందలు, వేలమంది చూసేలా గోల చేయాలా? అని ఎవరికైనా సందేహం రాక మానదు. దీని వెనక మానసిక కోణాలు, ఎత్తుగడలూ ఉంటాయంటున్నారు లవ్‌గురూలు. ప్రేమించిన వ్యక్తికి ఆ విషయం తెలియజెప్పాలనుకోవడం ఒక కోణమైతే.. తెలియజేసే విధానం సృజనాత్మకంగా ఉండాలనుకోవడం మరోటి.

 ఐడెంటిటీ క్రైసిస్‌

 ఎవరి ప్రేమ వాళ్లకి గొప్పదే.. ఈ గొప్ప పనిని కొందరు ప్రపంచమంతా వినబడేలా, కనబడేలా చేయాలనుకుంటారు. దాంట్లో భాగమే ఇది. తాము ఇష్టపడ్డవారికి ఆ విషయం చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవారి స్పందన వినాలని కొందరు బలంగా కోరుకుంటారట. దీన్నో ఘనకార్యంగా భావిస్తారట. ఒకరకంగా చెప్పాలంటే ఇది ‘ఐడెంటిటీ క్రైసిస్‌’నే అంటారు మానసిక నిపుణులు.  విపరీతమైన ఆందోళన, మనసుపై నియంత్రణ లేకపోవడం.. ఒత్తిడి.. ఇతరుల ప్రభావానికి లోనవడం సైతం ఈ పబ్లిక్‌ ప్రపోజల్‌ని ఎక్కువగా ఎంచుకునేందుకు కారణం అవుతుందట. కొందరైతే ఈ విధానాన్ని ఒక మానసిక ఎత్తుగడగానూ భావిస్తుంటారు. తాము ప్రపోజ్‌ చేయబోయే అమ్మాయి లేదా అబ్బాయి తమ అభ్యర్థనను ఒప్పుకోరేమో.. అనే అనుమానం ఉన్నప్పుడు సైతం కొందరు తెలివిగా ఈ దారి ఎంచుకుంటారట. అందరిముందు అంత గ్రాండ్‌గా, ప్రేమగా అభ్యర్థిస్తే అవతలివారు ‘నో’ చెప్పరని ఓ నమ్మకం! ఏదేమైనా ఈ పబ్లిక్‌ ప్రపోజళ్లు అన్నీ నిజాయతీగా ఉంటాయనీ చెప్పలేం.. కొన్ని జంటలు పక్కా ప్రణాళిక ప్రకారమే అందరి దృష్టిలో పడాలనుకుంటారు.
ఎంత చేసినా అన్ని ప్రపోజళ్లకీ శుభం కార్డు పడుతుందని చెప్పలేం. గులాబీ పువ్వుతో ప్రేమ తెలిపినా, గోల్డ్‌ రింగ్‌ ఇచ్చి పెళ్లాడమని కోరినా.. ఒక్కోసారి అవతలివైపు అమ్మాయి లేదా అబ్బాయి నుంచి ‘నో’ అనే సమాధానం రావచ్చు. అసలు నచ్చకపోతే చెంప ఛెళ్లుమనొచ్చు కూడా. ఇక జనం స్పందన కోసం ఇలా చేసేవాళ్లు ఒక్కోసారి ఉసూరుమనే పరిస్థితీ రావచ్చు. అంతమందిలో ప్రపోజ్‌ చేసినా.. చుట్టుపక్కల ఉన్నవారు ఏమీ జరగనట్టే ఉంటే.. ప్రపోజ్‌ చేసేవాళ్లు, చేయబడేవాళ్ల ప్రేమావేశం చప్పున చల్లారిపోతుంది. వీటిన్నింటికీ మించిన ప్రమాదం మరొకటుంది. పబ్లిక్‌ ప్రపోజల్‌ రొమాంటిక్‌గానే ఉండొచ్చుగాక.. తర్వాత ఆ ప్రేమ కొనసాగనప్పుడు, ప్రేమ పెళ్లి పీటలు ఎక్కనప్పుడు.. జనం దృష్టిలో ఆ జంట చులకన అవుతుంది. ప్రపోజల్‌ సమయంలో హీరోల్లా పోజు కొట్టినవాళ్లే.. ఆ బంధాన్ని నిలుపుకోలేకపోతే పెద్ద జీరోలుగా మిగిలిపోతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని