తీర్మానం... తీరు మార్చేద్దాం!

బరువు తగ్గాలి... ఫోన్‌ అతిగా వాడొద్దు... మందు మానేయాలి... బ్లా.. బ్లా.. బ్లా! కొత్త ఏడాది రాగానే ఇలా ఎన్నెన్నో అనుకుంటాం. ‘న్యూ ఇయర్‌ రెజల్యూషన్స్‌’ పేరుతో తీర్మానాలు చేసేసుకుంటాం.

Published : 06 Jan 2024 00:19 IST

బరువు తగ్గాలి... ఫోన్‌ అతిగా వాడొద్దు... మందు మానేయాలి... బ్లా.. బ్లా.. బ్లా! కొత్త ఏడాది రాగానే ఇలా ఎన్నెన్నో అనుకుంటాం. ‘న్యూ ఇయర్‌ రెజల్యూషన్స్‌’ పేరుతో తీర్మానాలు చేసేసుకుంటాం. నాలుగు రోజులు హడావుడి చేస్తాం. తర్వాత షరా మామూలే. రెజల్యూషన్స్‌ అంగుళం కదలకుండా అక్కడే ఉంటాయ్‌. ఎందుకలా? అంటే శక్తికి మించిన లక్ష్యాలు తలకెత్తుకోవడమే. అనుకున్నవాటిని ఆసక్తితో చేయకపోవడమే. భారీ లక్ష్యాల సంగతి పక్కన పెట్టి ఇలా చిన్నచిన్న వాటిని దాటుకుంటూ ముందుకెళ్తే ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుంది.

అత్యుత్సాహం వద్దు

 బరువు తగ్గాలి.. సిక్స్‌ప్యాక్‌ రావాలి.. అనుకోవడం ఒక ఆశ, కోరిక. సాధ్యం కావాలంటే కష్టమైన కసరత్తులు చేయాలి. క్రమం తప్పకుండా, దీర్ఘకాలం కొనసాగాలి. ఇది ఒక యజ్ఞంలా ఒక క్రమపద్ధతిలో కొనసాగాలి. వర్కవుట్లని ఎంజాయ్‌ చేయాలి తప్ప సన్నబడాలనే ఆరాటం, అత్యు త్సాహం ఫలితాన్నివ్వదు.

 కొంచెం తగ్గిద్దాం..

పదే పదే వాట్సప్‌లోకి తొంగి చూస్తాం.. ఫొటోలు క్లిక్‌మనిపించి ఇన్‌స్టాలో పెడతాం. అసలు స్మార్ట్‌ఫోన్‌ వాడకపోతే యువతే కాదు అనుకుంటాం. ఆ సంగతి ఒప్పుకుందాం. కానీ ఫోన్‌కే అతుక్కుపోతే ఇంక రెజల్యూషన్స్‌ సాధించేదెలా? కొన్ని గంటలు ఫోన్‌ తీసి పక్కన పెట్టండి. రోజంతా నెట్‌ తెరవనని తీర్మానం చేయండి. కొంపలేం మునిగిపోవు. ఇంకొందరైతే సామాజిక మాధ్యమాన్ని రణరంగంగా మార్చేస్తుంటారు. అంతర్జాలంలో పోట్లాటలు, వీధి పోరాటాలు అసలే వద్దు. వీలైతే ప్రేమిద్దాం డూడ్‌.

దయని షేర్‌ చేద్దాం

ఫొటోలు, పోస్టులు తెగ పంచుకుంటాం. స్టేటస్‌ని గొప్పగా చెప్పుకుంటాం. అదే స్ఫూర్తితో పక్కనున్న వాళ్లతో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే ఏమవుద్ది? అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుంటే మన సొమ్మేం పోతుంది? వేలు, లక్షల రూపాయలు ఇవ్వాలనేం లేదు. మంచి మనసుతో.. మనకున్నదాంట్లో పంచుకుంటే.. కష్టాల్లో ఉన్న పెదాలపై చిరునవ్వుకి కారణమైతే కొత్త ఏడాదిలో అంతకుమించిన మంచి తీర్మానం ఏముంటుంది?

సమాజాన్ని చదివేద్దాం

మనం ఎదగాలంటే.. ఎత్తుకు పైఎత్తులు వేయాలంటే.. మనుషుల్ని చదవాలి. తమ జీవిత సారాన్ని కాచి వడబోసిన మంచి రచయితల పుస్తకాలు చదవాలి. జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తే ఒంటికి ఎంత మంచిదో.. పుస్తకాలతో మెదడుకు అంత వ్యాయామం. కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. కొత్తగా అవగాహన పెంచుకోవడం.. సమాజాన్ని అర్థం చేసుకోవడం.. ఇవన్నీ మనకు మరింత లౌక్యం నేర్పిస్తాయి.

అతిని వదిలేద్దాం...

యూత్‌ ఫోన్‌లో లెక్కలేనని యాప్‌లు ఉంటాయి. ఫుడ్‌, ఈ కామర్స్‌, షాపింగ్‌, గేమింగ్‌.. వీటితో మంచి కాలక్షేపమే కాదు.. అదేపనిగా వెతకడం.. ఆఫర్లు ఉన్నాయి కదా అని అవసరం లేకపోయినా ఏవేవో కొనేస్తుంటారు చాలామంది. తీరా బిల్లు కట్టాల్సిన సమయానికి జేబులు తడుముకుంటారు. ఇలాంటివి మన తీర్మానాలు, లక్ష్యాలకు అడ్డు పడతాయి.

మంచిని స్వాగతిద్దాం

బుర్రలో సత్తువే కాదు.. ఒంట్లో సత్తా ఉన్నప్పుడే అనుకున్నవన్నీ చేయగలం. ఇప్పుడంటే కుర్రాళ్లం.. కొండలనైనా పిండి చేయగలం.. కాస్త వయసుడిగితే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ఓపిక ఉండొద్దూ! అందుకే ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు పెంచుకోవాలి. జిమ్‌కెళ్తారా? జిమ్మిక్కులు చేస్తారా? ధ్యానంపై ధ్యాస పెడతారా.. అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది.  

ప్రావీణ్యం సాధిద్దాం

‘నీకేం వచ్చు?’ అంటే.. ‘ఈతొచ్చు సర్‌’ అంటాడో హీరో. సినిమాలో కాబట్టి సరిపోయింది. జీవితంలో నహీ చలేగా! యూత్‌ అన్నాక కాస్తంత కళాపోషణే కాదు.. కళలో ప్రావీణ్యం ఉండాలి. అదీ కాకపోతే కనీసం ప్రవేశం అయినా ఉండాలిగా! గిటార్‌ వాయించడం.. గరిటె తిప్పడం.. పాడటం.. ఇవి సరదా వ్యాపకాలు. మరి కెరియర్‌లో నిలదొక్కుకోవడం, ఉపాధి కోసం ఏదైనా ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో ఎప్పటికైనా పనికొస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని